‘పాల’కూట విషం

3 Mar, 2018 12:19 IST|Sakshi

గేదెలకు ఆక్సిటోసిన్‌ ఇంజెక్షన్లు

నిషేధించినా దొడ్డిదారిన విక్రయాలు

ఈ పాలు తాగితే అనేక దుష్పరిణామాలు

పాడి రైతులు తమ గేదెలుఈనగానే దానికి జన్మించిన దూడకుముందుగా పాలు విడుస్తారు. ఆదూడ తాగగా.. మిగిలిన పాలనుమాత్రమే పితికి వాడుకుంటారు. ఒకవేళ ఏదైనా అనారోగ్య కారణం వల్ల
దూడ చనిపోతే దాని చర్మాన్ని తీసి,అందులో గడ్డి దూర్చి తల్లి పొదుగువద్ద ఉంచుతారు. తన పొదుగు వద్దదూడే వచ్చి నిలబడిందని భ్రమించిగేదె పాలు విడుస్తుంది. ఇది 30 ఏళ్లక్రితం నాటి మాట. ఇప్పుడు పరిస్థితిమారిపోయింది. మందులురావడంతో కొందరు పాడి రైతుల్లోనిర్లక్ష్యం పెరిగింది.

కర్నూలు (హాస్పిటల్‌) :   గేదెను మచ్చిక చేసుకోవడం మాని, త్వరగా పాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రమాదకరమైన ఆక్సిటోసిన్‌ అనే హార్మోన్‌ ఇంజెక్షన్‌ వేస్తున్నారు. వీటి పాలు తాగిన వారు వ్యాధుల బారిన పడుతున్నారు. గేదెలు సైతం పునరుత్పత్తి శక్తిని కోల్పోతున్నాయి. ఈ కారణంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఇంజెక్షన్లను నిషేధించింది. అయినా జిల్లాలో వ్యాపారులు వీటిని దొడ్డిదారిన తెచ్చి విక్రయిస్తున్నారు. కొందరు రైతులు త్వరగా పాలు పితకాలన్న ఆత్రుతతో గేదెలకు ఈ ఇంజెక్షన్లు వేస్తున్నారు. గతంలో దూడ చనిపోతే తప్పనిసరి పరిస్థితుల్లోనే.. అదీ పశువైద్యాధికారి సూచన మేరకు మాత్రమే గేదెలకు ఈ ఇంజెక్షన్లు ఇచ్చేవారు. అయితే.. ఇరవై ఏళ్ల నుంచి వీటి వినియోగం క్రమేణా పెరుగుతూ వచ్చింది. జిల్లాలో 4,11,000 గేదెలు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతిరోజూ 15 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి అవుతోంది. పాడి గేదెలు ఎక్కువగా ఉన్న కొందరు రైతులు, డెయిరీ కేంద్రాలు నిర్వహించే ప్రాంతాల్లో ఆక్సిటోసిన్‌ వినియోగం అధికంగా ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. నంద్యాల, డోన్, బేతంచర్ల, ఓర్వకల్లు, బనగానపల్లి, చాగలమర్రి, ఆళ్లగడ్డ, మహానంది, ఆత్మకూరు, కొత్తపల్లి, పాములపాడు, శ్రీశైలం, దేవనకొండ, నందికొట్కూరు, రుద్రవరం, అవుకు, ఉయ్యాలవాడ తదితర ప్రాంతాల్లో కొందరు పాడి రైతులు వీటిని వాడుతున్నట్లు తెలుస్తోంది. ఈ పాలు తాగినవారు జీర్ణకోశ సంబంధ వ్యాధులు, క్యాన్సర్‌కు గురయ్యే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రైతులను చైతన్యపరిచి ఇంజెక్షన్ల వాడకాన్ని నియంత్రించడంలో అధికారులు విఫలమయ్యారు.

నిషేధించినా ఆగని విక్రయాలు
ఆక్సిటోసిన్‌ అనే హార్మోన్‌ ఇంజెక్షన్‌ను మనుషులకు, పశువులకు వేర్వేరుగా వాడతారు. గర్భిణులు సుఖప్రసవం అయ్యేందుకు గాను అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే దీన్ని నిపుణుల సలహా మేరకు వాడుతుంటారు. దీనివల్ల ప్రసవ ద్వారంలోని కండరాలు వదులుగా మారి బిడ్డ బయటకు రావడానికి సులభమవుతుంది. అలాగే గేదెలకు సేపు కోసం, పాల దిగుబడి పెంచేందుకు, ఎక్కువ కాలం పాలు ఇచ్చేందుకు వీటిని వేస్తున్నారు.ఈ ఇంజెక్షన్‌ వేసిన కొన్ని సెకన్లకే పొదుగులోని కండరాల్లో కదలిక వచ్చి గేదె పాలు విడుస్తుంది. సాధార ణంగా ఈత తర్వాత గేదె ఆరు నెలల పాటు పాలిస్తుంది. అదే ఈ ఇంజెక్షన్‌ నిరంతరం వాడటం వల్ల ఆరు నెలల తర్వాత కూడా పాలు పితుక్కునే అవకాశం ఉంది. దూడను వదిలేస్తే అది ఎక్కువగా పాలు తాగుతుందని భయపడి కొందరు రైతులు ఇంజెక్షన్లపై ఆధారపడుతున్నారు. దీనిని వాడటం వల్ల అటు గేదెలకు, ఇటు మనుషులకు వ్యాధులు వస్తాయని భావించి కేంద్ర ప్రభుత్వం పదేళ్ల క్రితమే నిషేధించింది. అయినా జిల్లాలోని వ్యాపారులు దొడ్డిదారిన వీటిని తెచ్చి విక్రయిస్తున్నారు.  గేదెలు అధికంగా ఉండే ప్రాంతాల్లోని  కిరాణాదుకాణాలు, దాణా విక్రయ అంగళ్లు, మెడికల్‌షాపుల్లో వీటిని బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. పాతికేళ్ల క్రితం గేదెకు ఒక యాంపిల్‌ వేస్తే పాలు విడిచేది. కానీ ఇప్పుడు ఒకేసారి మూడు యాంపిల్‌లు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది చాలా ప్రమాదకర పరిస్థితి అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.  

గేదెల పునరుత్పత్తి దెబ్బతింటుంది
ఆక్సిటోసిన్‌ ఇంజెక్షన్‌ ఇచ్చిన గేదె పాలు తాగడం వల్ల మనుషులకు క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉంది. అందువల్లే దాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. మెడికల్‌ స్టోర్‌లలో అనధికారికంగా విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం. ఇంజెక్షన్‌ వాడటం వల్ల గేదె ఆ తర్వాత ఎదకు రాదు. గర్భం దాల్చకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుంది.  లాభం కంటే నష్టమే ఎక్కువ.  – డాక్టర్‌ అచ్చెన్న, పశువైద్యాధికారి, డోన్‌

మరిన్ని వార్తలు