-

మంత్రి ఆది అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం

16 Aug, 2017 09:23 IST|Sakshi
జమ్మలమడుగులో డాక్టర్ల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఆది

70 ఏళ్లుగా రిజర్వేషన్లు అనుభవిస్తున్నా మార్పు లేదనడంపై దళిత సంఘాల మండిపాటు
ఇటీవలే.. ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారన్న సీఎం చంద్రబాబు..
అదే బాటలో మంత్రులు, ఇతర నేతలు..


సాక్షి, అమరావతి: వివక్ష పూరిత వ్యాఖ్యలు చేయడం, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ అణగారిన వర్గాల పట్ల అవమానకరమైన రీతిలో వ్యవహరించడం తెలుగుదేశం పార్టీ నేతలకు అలవాటుగా మారిపోయింది. ఆవు చేను మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా? అన్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే స్వయంగా కుల విద్వేష పూరిత వ్యాఖ్యలతో ఎస్సీలను కించపరుస్తున్న నేపథ్యంలో మంత్రులు, ఆ పార్టీ ఇతర నేతలు సైతం మరింత రెచ్చిపోతున్నారు. మంగళవారం దేశం స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్న తరుణంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న సీహెచ్‌ ఆదినారాయణరెడ్డి అడ్డూ అదుపూ లేకుండా ఎస్సీలపై దారుణమైన వ్యాఖ్యలు చేశారు.

వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగులోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్సీలను కించపరిచే వ్యాఖ్యలు చేశారు. ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లయినా దళితులు మారలేదు. వారికి పదేళ్లకు మాత్రమే రిజర్వేషన్లు కల్పించారు. ఇపుడు అది ఏడు పదులు దాటి ఎనిమిదో పదిలోకి వెళ్తోంది. అయినా వారిలో ఎలాంటి మార్పు రాలేదు. వారు చదువుకోరు.. శుభ్రంగా ఉండరం’టూ వివక్ష పూరిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యాఖ్యలు మంత్రి, టీడీపీ పెద్దలు, నేతల దురహంకారాన్ని తెలియచేస్తున్నాయనేందుకు తార్కాణంగా ఉన్నాయని దుయ్యబడుతున్నారు. గతంలో ‘ఎస్సీలలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా?’ అంటూ దళితుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీస్తూ మాట్లాడిన విషయం తెలిసిందే. ‘మనం కోరుకుని పుట్టలేదు. నీవే కులంలో పుట్టావో నీకు తెలియదు. నువ్వు పుట్టాలని కోరుకున్నావా? ఎవరు మాత్రం ఎస్సీ కులంలో పుట్టాలని కోరుకుంటారు. అందరూ సంపన్న వర్గాల్లోనే పుట్టాలని కోరుకుంటారు. అందరూ రాజుల కులంలో పుడితే రాజ్యాన్ని ఏలవ చ్చనుకుంటారు’ అంటూ ఎస్సీలుగా పుట్టడమే పాపమన్నట్లు అవమానకర వ్యాఖ్యలు చేశారు. కులం మతం ప్రాంతాలను  కొందరు రాజకీయలబ్ధి కోసం వినియోగించుకోవాలనుకుంటున్నారని, కులాలను బట్టి ఓట్లు రావని, వాటితో ఎవరూ గెలవలేరని బాబు వ్యాఖ్యానించారు.

ఎమ్మార్పీఎస్‌ నేత మందకృష్ణ మాదిగ ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేకపోయారని, బీసీ సంఘాల నేత ఆర్‌ కృష్ణయ్యకు సీటిస్తే మెజారిటీ తగ్గిందని కూడా ఆయా వర్గాల నేతలను అవమానిస్తూ చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఆయన వ్యాఖ్యలపై రాష్ట్రంలో పెద్ద దుమారమే రేగింది. అన్ని వర్గాల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. ఎస్సీలుగా పుట్టాలని ఎందుకు కోరుకోరో చెప్పాలని నిలదీశారు. చంద్రబాబు మనసులో మాట బయటపడి ఆయనలో కుల వివక్షను కళ్లకు చూపించింది. ఆయనపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు పెట్టాలని డిమాండ్లు వెల్లువెత్తాయి.

రాజ్యాంగ హక్కులకూ తూట్లు
రాజ్యాంగం, చట్టం పరంగా ఎస్సీ, ఎస్టీలకు దక్కాల్సిన హక్కులకూ చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు వారికి ఖర్చు చేకుండా దారిమళ్లిస్తున్నారు. ఈ విషయంపై టీడీపీ ఎస్సీ ఎంపీ అయిన శివప్రసాద్‌ బహిరంగంగానే ధ్వజమెత్తారు. ఈ ఏడాదిలో జరిగిన అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ఆయన చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. ఎస్సీ సబ్‌ ప్లాన్‌నిధులు దారి మళ్లిస్తున్నారని, అవమానకరంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు చేశారు. 2015–16 సబ్‌ ప్లాన్‌ నిధులు, ఎస్సీలకు దక్కాల్సిన ఇతర నిధులు ఒక్క చిత్తూరు జిల్లా నుంచే రూ.352 కోట్లు ఎస్సీలకు వినియోగించకుండా వెనక్కు పంపేశారని దుయ్యబట్టారు. ఆ వర్గాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులుగా వారికి తామేమి సమాధానం చెప్పాలని నిలదీశారు. ఎస్సీ సబ్‌ప్లాన్‌ 2016–17 బడ్జెట్లో రూ.9,336 కోట్లుగా చూపించి  కేవలం రూ.6200 కోట్లు ఖర్చు చేశారు. 3 వేల కోట్లకుపైగా దారిమళ్లించారు. ఎస్సీలకు చట్టబద్ధంగా రావలసిన నిధులు కూడా అందకుండా చేస్తున్నారు.

పదవుల విషయంలోనూ చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ ఆణగారిన వర్గాల పట్ల వివక్ష చూపుతున్నారన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. కేంద్ర మంత్రి పదవులను ఇతరులకు ఇస్తున్నారు తప్ప ఎస్సీలకు అవకాశం ఇవ్వడం లేదని టీడీపీ ఎంపీ విమర్శించారు.  రాజ్యసభ పదవులు రెండు టీడీపీకి వస్తే ఆ రెండింటినీ ఇతరులకే ఇచ్చారని, దళితులను పట్టించుకోలేదన్న ఆవేదన ఆ పార్టీ నేతల్లోనే ఉంది. ఎస్సీలకు దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఇచ్చిన ‘డి’ పట్టా భూములను చంద్రబాబు సర్కారు నిర్దాక్షిణ్యంగా వెనక్కు తీసుకుంటోంది. పశ్చిమగోదావరి జిల్లా గరగపర్రులో దళితుల పట్ల కొందరు టీడీపీకి చెందిన వ్యక్తులు అవమానకరంగా వ్యవహరించి సామాజిక బహిష్కరణకు గురి చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీనిపై తీవ్రస్థాయిలో దళితులు ఉద్యమిస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది.

ఆదిని మంత్రి పదవి నుంచి తొలగించాలి: కేవీపీఎస్‌ డిమాండ్‌
మంత్రి ఆదినారాయణరెడ్డిని తక్షణమే పదవి నుంచి తొలగించాలని రాష్ట్ర కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్‌) డిమాండ్‌ చేసింది. విలేకరులు వ్యతిరేక వార్తలు రాయకూడదని చెప్పడాన్నీ ఈ సంఘం ఖండించింది. ఈ మేరకు కేవీపీఎస్‌ ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి మంగళవారం రాత్రి ఒక ప్రకటన జారీ చేశారు. మంత్రి ఆదినారాయణ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని, తన నోరు ఫినాయిల్‌తో కడుక్కోవాలని సూచించింది. ఆదినారాయణరెడ్డి దిష్టి బొమ్మను అన్ని జిల్లా, పట్టణ, మండల కేంద్రంలో దహనం చేయాలని పిలుపునిచ్చారు.

మంత్రిని బర్తరఫ్‌ చేయాలి: దళిత హక్కుల పోరాట సమితి
ఎస్సీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి ఆదినారాయణ రెడ్డి ని మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కరవది సుబ్బారావు డిమాండ్‌ చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి దళితులను అవమానిస్తున్నారని అన్నారు. రిజర్వేషన్‌.. ఎస్సీలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కన్నారు. దళితులపై ఇటీవల దాడులు పెరిగాయన్నారు. చంద్రబాబు నాయుడు పాలకుడిగా అర్హత కోల్పోయారని, ఆయన కూడా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. దళితుల భూములను సైతం లాక్కుంటున్నారని సుబ్బారావు ఆరోపించారు.

మరిన్ని వార్తలు