చంద్రబాబుపై అట్రాసిటీ కేసు నమోదు చేస్తాం

5 Jan, 2020 04:15 IST|Sakshi

ఐఏఎస్‌ విజయకుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చంద్రబాబు అహంకారానికి నిదర్శనం 

భగ్గుమన్న దళిత సంఘాలు 

ఇలాంటి వారు సమాజానికి ఎంతో హానికరం 

సాక్షి, అమరావతి : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్‌ అధికారి జీఎస్‌ఆర్‌కేఆర్‌ విజయకుమార్‌ను ఉద్దేశించి అనుచితంగా మాట్లాడారు. దీంతో పలు దళిత సంఘాలు చంద్రబాబు వైఖరిపై మండిపడ్డాయి. విజయకుమార్‌ను అవమానించే విధంగా మాట్లాడటాన్ని తీవ్రంగా తప్పుబట్టాయి. ఇవి అహంకార పూరిత వ్యాఖ్యలని పలువురు నాయకులు ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై వివిధ దళిత నాయకులు ఏమన్నారంటే..

సుమోటోగా అట్రాసిటీ కేసు
చంద్రబాబూ.. ఐఏఎస్‌ అధికారి విజయకుమార్‌ను నీచంగా చూస్తావా? ‘వాడు’ అని సంబోధిస్తావా? ఎంత అహంకారం.. వెంటనే క్షమాపణ చెప్పాలి. లేకుంటే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు సుమోటోగా నమోదు చేస్తాం. దళితులు తగిన బుద్ధి చెబుతారు.   
– కారెం శివాజీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్, విజయవాడ. 

బాబును దళితులు క్షమించరు
పదవి పోయిన చంద్రబాబుకు పూర్తిగా మతిభ్రమించింది. ఒక దళిత ఐఏఎస్‌ అధికారిని ఇష్టానుసారంగా మాట్లాడటం ఆయనకు తగదు. దళితులు చంద్రబాబును క్షమించరు. ఆయన దళిత సమాజానికి బహిరంగ క్షమాపణలు చెప్పాలి. 
– పెదపాటి అమ్మాజీ, ఏపీ మాల కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌

దళితులంటే బాబుకు చులకన
గతంలో కూడా చంద్రబాబు, అప్పటి టీడీపీ మంత్రులు దళితులను చులకన చేసి మాట్లాడారు. దళిత ఐఏఎస్‌ను అవమానించిన చంద్రబాబుపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. దళిత ఐఏఎస్‌లు, ఉన్నతాధికారులు సమిష్టిగా ఈ విషయంపై స్పందించి బాబుకు తగిన బుద్ధి చెప్పాలి.  
 – కొమ్మూరి కనకారావు,  ఏపీ మాదిగ కార్పొరేషన్‌ చైర్మన్‌ 

చంద్రబాబును అరెస్టు చేయాలి
విజయకుమార్‌ను అవమానకరంగా మాట్లాడిన చంద్రబాబునాయుడును అరెస్టుచేయాలి.  ఒక ఐఏఎస్‌ అధికారినే ఇలా అన్నారంటే సామాన్యులను ఏ స్థాయిలో చూస్తారో అర్థమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం సుమోటోగా కేసు నమోదుచేయాలి.  
– కల్లూరి చెంగయ్య, జాతీయ అధ్యక్షులు, ఐక్య దళిత మహానాడు

ఐఏఎస్‌లంతా ఖండించాలి
ఐఏఎస్‌ అధికారికి ఎవరైనా కనీస గౌరవం ఇవ్వాలి. ప్రభుత్వ సూచన మేరకు బోస్టన్‌ కమిటీ నివేదికను వివరిస్తే ‘వాడు మాకు చెబుతాడా’.. అని అంటారా? ఈ వ్యాఖ్యలు చంద్రబాబును ఎంతో దిగజార్చాయి. దీనిని ఐఏఎస్‌లు అంతా ఖండించాలి. 
– నల్లి రాజేష్, రాష్ట్ర అధ్యక్షుడు, మాల మహానాడు

ఉద్దేశపూర్వకంగా అవమానించారు
చంద్రబాబునాయుడుకు ఐఏఎస్‌ అధికారి విజయకుమార్‌ దళితుడని తెలుసు. కావాలనే అహంకారంతో అవమానకరంగా మాట్లాడారు.  పాలకునిగా పనికిరాడని ప్రజలు తిరస్కరించినా బుద్ధిరాలేదు.      
– నీలం నాగేంద్ర, రాష్ట్ర అధ్యక్షుడు, దళిత హక్కుల పోరాట సమితి

రాజకీయాల నుంచి తప్పుకోవాలి
ఐఏఎస్‌ విజయకుమార్‌ను అవమానించిన చంద్రబాబు తక్షణం రాజకీయాల నుంచి తప్పుకోవాలి. లేకుంటే దళితులు తగిన బుద్ధి చెబుతారు. చంద్రబాబును వెంటనే అరెస్టు చేయాలి. ఆయన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం. 
 – కొమ్ము సుజన్‌ మాదిగ, రాష్ట్ర అధ్యక్షులు, మాదిగ సంక్షేమ పోరాట సమితి. 

బహిరంగ క్షమాపణ చెప్పాలి
చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే దళితులను హేళన చేస్తూ మాట్లాడారు. ఇప్పటికీ ఆయన తన వైఖరి మార్చుకోవడంలేదు. దళిత అధికారిని అవమానిస్తూ మాట్లాడిన చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి. 
– బత్తుల వీరాస్వామి, అంబేడ్కర్‌ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

ఫ్యూడల్‌ స్వభావం బయటపడింది
చంద్రబాబు ఫ్యూడల్‌ స్వభావం బయటపడింది. దళితులను అవమానించడం ఆయనకు అలవాటు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలి. ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ చట్టం కింద ప్రభుత్వం కేసు నమోదు చేయాలి. 
– దారా అంజయ్య, రాష్ట్ర అధ్యక్షుడు, పీవీ రావు మాలమహానాడు.

మరిన్ని వార్తలు