విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో మహానేతకు నివాళి

2 Sep, 2019 14:57 IST|Sakshi

దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో మహానేతకు నివాళి

సాక్షి, విజయవాడ: దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పదవ వర్ధంతిని పురస్కరించుకొని దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రెస్‌క్లబ్‌లో సోమవారం సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహానేత వైఎస్సార్‌తోపాటు హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన అధికారులు డా. సుబ్రహ్మణ్యం, సాల్మన్ వెస్లీలను ఈ సందర్భంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ఐఏఎస్‌ అధికారి ఉండ్రు రాజశేఖర్‌, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి చల్లప్ప, సాక్షి మాజీ ఎడిటోరియల్ డైరెక్టర్ కె రామచంద్రమూర్తి అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ.. ఐఏఎస్ అధికారిగా పి సుబ్రహ్మణ్యం ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించారని, మహానేత వైఎస్సార్ హయాంలో వచ్చిన అన్ని సంక్షేమ పథకాలను విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించారని అన్నారు. ఏడేళ్ళ పాటు వివిధ దేశాల్లో పనిచేసిన సుబ్రహ్మణ్యం తన అనుభవాన్ని ఏపీలో ఆచరణలో చూపారని తెలిపారు. అంతేకాక సుబ్రహ్మణ్యం, వెస్లీ వంటి అధికారుల సేవలు స్పూర్తిదాయకమని తెలిపారు.

చల్లప్ప మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా దళితులు ఉన్నత విద్యావంతులు కావాలని కోరారు. అంబేడ్కర్‌ ఆశయాలను నిజం చేస్తూ.. సుబ్రహ్మణ్యం, వెస్లీ వంటి అధికారులు సమాజాన్ని ప్రభావితం చేసే స్థాయికి ఎదిగారని పేర్కొన్నారు. అలాంటి వారిని అందరు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. 

రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. మహానేత వైఎస్సార్‌ మరణం తెలుగు ప్రజలను కలచి వేసిందని గుర్తుచేశారు. పదేళ్ల కిందట జరిగిన హెలికాఫ్టర్‌ ప్రమాదంలో మహానేత వైఎస్సార్‌, అధికారులు మరణించడం దురదృష్టకరమన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. దివంగత వైఎస్సార్‌ను గుర్తుచేసేలా పాలన సాగిస్తున్నారని ప్రశంసించారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. వైఎస్‌ జగన్‌ సంక్షేమంలో తండ్రిని మించిన తనయుడిగా పేరు తెచ్చుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మూడు నెలల్లోనే వైఎస్‌ జగన్‌ ప్రజల ఆదరణను పొందుతున్నారని పేర్కొన్నారు. 

సంక్షేమ పథకాల రూపకల్పనలో మహానేత వైఎస్సార్‌ తోడుగా నిలిచిన సుబ్రహ్మణ్యం, వెస్లీ వంటి అధికారులు ప్రజలకు అత్యంత చేరువయ్యారని తెలిపారు. వారి అకాల మరణం సమాజానికి, ముఖ్యంగా దళిత సమాజానికి తీరని లోటు అని రామచంద్రమూర్తి పేర్కొన్నారు. నిరుపేద దళిత కుటుంబంలో జన్మించిన సుబ్రహ్మణ్యం పట్టుదలతో ఉన్నత స్థానానికి చేరారని.. అటువంటి అధికారులు సమాజానికి అవసరమని అన్నారు.

మరిన్ని వార్తలు