‘కుట్రలు మానకపోతే బాబుకు బుద్ధి చెపుతాం’

13 Jan, 2020 19:42 IST|Sakshi

సాక్షి, విజయవాడ: మాజీ సీఎం చంద్రబాబు తన సామాజిక వర్గాన్ని పెంచి పోషించేందుకే అమరావతిలో రాజధాని పెట్టాలనుకొన్నారని దళిత నేతలు వ్యాఖ్యానించారు. ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం అన్ని ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకొంటున్నారని ఆరోపించారు. కుట్రలు మానకపోతే ఐక్య దళిత వేదిక ఏర్పాటు చేసి బాబుకు బుద్ధి చెపుతామన్నారు. మూడు రాజధానులు, అన్ని ప్రాంతాల అభివృద్ధికి మద్దతు తెలిపేందుకు దళిత సంఘాలు ఏకమయ్యాయి. ఈ మేరకు మాదిగ దండోరా, మాల మహానాడు నేతలు విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం సమావేశమయ్యారు.

అనంతరం దళిత నేతలు మీడియాతో మాట్లాడుతూ.. అంబేద్కర్‌ ఆలోచనలకు అనుగుణంగానే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం ఉందని అభిప్రాయపడ్డారు. అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలన్నదే బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ ఆశయమన్నారు. అది పరిపాలన వికేంద్రీకరణతోనే సాధ్యమని పేర్కొన్నారు. ఇక టీడీపీ పాలనలో రాజధాని దళిత రైతులకు పూర్తిగా అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం చంద్రబాబు చేస్తున్న పెట్టుబడి ఉద్యమాన్ని తిప్పికొడతామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు