వినాశకాలే ‘విప్‌’రీత బుద్ధి

21 Feb, 2019 08:00 IST|Sakshi
జంగారెడ్డిగూడెంలో చింతమనేని చిత్రాన్ని చెప్పులతో కొడుతున్న దళితులు

ఏలూరులో ఇరువర్గాల ఆందోళనతో ఉద్రిక్తత

అరెస్టులు చేసి పోలీసు స్టేషన్లకు తరలింపు

పశ్చిమగోదావరి  , ఏలూరు టౌన్‌: ప్రభుత్వ విప్, దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్‌ దళితులు, బీసీలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై జిల్లా వ్యాప్తంగా దళితులు, బీసీ వర్గాలు భగ్గుమన్నాయి. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ చింతమనేని వ్యవహార శైలిపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. చింతమనేనిని వెంటనే ఎమ్మెల్యే పదవికి అనర్హుడిని చేయటంతోపాటు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలంటూ ఎస్సీ సంఘాలు ఆందోళనకు దిగాయి. దళిత నేతలు రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేశారు. చింతమనేని సిగ్గుసిగ్గు.. వినాశకాలే విపరీత బుద్ధి అంటూ నినాదాలు చేశారు.  చింతమనేని దిష్టిబొమ్మలు దహనం చేయటంతోపాటు ధర్నాలు, ఆందోళనలు చేపట్టారు.

ఏలూరు ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ విభాగం ఆధ్వర్యంలో దళిత నేతలు ధర్నా చేశారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న చింతమనేని వర్గీయులు ఎదురుదాడికి దిగారు. ఇరువర్గాలూ పోటీపడుతూ నినాదాలు చేశాయి. టీడీపీ నేతలు, కార్యకర్తలు, వైఎస్సార్‌ సీపీ దళిత నేతలను రెచ్చగొట్టేలా ప్రవర్తించటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దేందుకు యత్నించినా ఫలితం లేకపోవటంతోముందుగా వైఎస్సార్‌ సీపీ దళిత నేతలను అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. దీంతో ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త కోటగిరి శ్రీధర్‌ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులన్నీ టూటౌన్‌ స్టేషన్‌కు చేరుకుని అక్కడ బైఠాయించాయి.  తమ పార్టీ నేతలనే అరెస్టు చేయడంపై మండిపడ్డాయి. దీంతో పోలీసులు టీడీపీ నేతలు, కార్యకర్తలను కూడా స్టేషన్‌కు తరలించారు.

జిల్లా వ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు
జిల్లా వ్యాప్తంగా దళితులు, బీసీ వర్గాలు  నిరసనలు చేపట్టారు. అంబేడ్కర్‌ విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేశారు.  

హౌస్‌ అరెస్టులపై అభ్యంతరం
దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చింతమనేనిని వదిలివేసి.. వైఎస్సార్‌ సీపీ నాయకులను పోలీసులు హౌస్‌ అరెస్టు చేయడం వివాదానికి దారితీసింది. బుధవారం ఉదయం వైఎస్సార్‌ సీపీ దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త అబ్బయ్య చౌదరి ఏలూరులోని పార్టీ కార్యాలయానికి బయలుదేరుతుండగా పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు.  దీంతో ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. నిరసనగా తన ఇంటి ముందు బైఠాయించారు. అనంతరం ప్రదర్శనగా ఏలూరు చేరుకుని అంబేడ్కర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి చింతమనేని దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు.
 వైఎస్సార్‌ సీపీ బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షులు గంటా ప్రసాదరావు ఈ నెల 22 నుంచి బీసీ సంఘం తరపున నిరాహార దీక్షకు పిలుపునిచ్చారు. మాదిగ మహాసేన దళిత బహుజన రిసోర్సు సెంటర్‌ (డీబీఆర్సీ) సంఘాలు మద్దతు ప్రకటించాయి. కొవ్వలిలో మాలమహానాడు అధ్యక్షులు గొల్ల అరుణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.  అక్కిరెడ్డిగూడెంలో మాదిగ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షుడు శేఖర్‌ ఆధ్వర్యంలో నిరసనలు చేశారు.

మార్టేరు సెంటర్‌లో మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్‌ æ  ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.  చింతమనేనిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్‌ డిమాండ్‌ చేశారు.
చింతమనేనిపై సుమోటోగా కేసు నమోదు చేయాలని వైఎస్సార్‌ సీపీ జిల్లా ఎస్సీ సెల్‌ ఆధ్వర్యంలో ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.  కార్యక్రమంలో జిల్లా ఎస్సీసెల్‌ కన్వీనర్‌ నూకపెయ్యి సుధీర్‌ బాబు, మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్‌కుమార్, ఎస్సీ సంఘాల నేతలు పళ్లెం ప్రసాద్, తేరా ఆనంద్, మున్నుల జాన్‌ గురునాథ్, మెండెం ఆనంద్‌ పాల్గొన్నారు.   
వైఎస్సార్‌ సీపీ గోపాలపురం  సమన్వయకర్త తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో ద్వారకాతిరుమలలో నిరసనలు నిర్వహించారు.
చింతమనేనిని అరెస్టు చేయాలని  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్‌ ప్రధాన కార్యదర్శి ముళ్లగిరి జాన్సన్, మహిళా కన్వీనర్‌ పాము సునీత, బోడ సంసోనులు  భీమడోలు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
చింతలపూడి సమన్వయకర్త వీఆర్‌ ఎలీజా ఆధ్వర్యంలో పట్టణంలో  ర్యాలీ, బోసు బొమ్మ సెంటరులో రాస్తారోకో చేసి, అనంతరం చింతమనేని దిష్టిబొమ్మను దహనం చేశారు.
పాలకొల్లు గాంధీ బొమ్మ సెంటర్‌లో రాష్ట్ర మాలమహానాడు అధ్యక్షుడు గుమ్మాపు ప్రసాద్‌ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.  
భీమవరం వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కులవివక్ష పోరాట సమితి, దళిత ఐక్యవేదిక నాయకులు చింతమనేనిపై  ఫిర్యాదు చేశారు. వీరవాసరంలో జెడ్పీటీసీ సభ్యుడు మానుకొండ  ప్రదీప్‌ కుమార్‌  ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు, పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఆకివీడు, పాలకోడేరు మండలాల్లో  మాలమహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  కె.రాజారావు ఆధ్వర్యంలో ధర్నా చేశారు.
బుట్టాయిగూడెంలో అంబేడ్కర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి, ధర్నా నిర్వహించారు.  
ఉండ్రాజవరంలో వైఎస్సార్‌ సీపీ నిడదవోలు కన్వీనర్‌ జి.శ్రీనివాసనాయుడు ఆధ్వర్యం లో అంబేడ్కర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు.   
నిడదవోలు  చర్చిపేట అంబేడ్కర్‌ విగ్రహం వద్ద కేవీపీఎస్‌ ఆందోళనలు చేపట్టింది.  
నిడదవోలు మండలం మునిపల్లి గ్రామంలో బీజేపీ ఎస్సీ మండల అధ్యక్షుడు మందపాటి కిషోర్‌ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.

మరిన్ని వార్తలు