స్వేచ్ఛగా ఓటెత్తారు!

20 May, 2019 11:27 IST|Sakshi
ఎన్‌ఆర్‌ కమ్మపల్లి పోలింగ్‌ కేంద్రం వద్ద బారులుతీరిన ఓటర్లు

తిరుపతి రూరల్‌: దళితులు, గిరిజనులు రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును సైతం స్వేచ్ఛగా వినియోగించుకోలేని దుస్థితి రామచంద్రాపురం మండలంలో కొన్ని గ్రామాల్లో ఉంది. గత నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ ఓటింగ్‌ కోసం పోలింగ్‌ కేంద్రాలకు వచ్చిన దళిత, గిరిజనులను బలవంతంగా బయటకు పంపించి, టీడీపీ శ్రేణులు రిగ్గింగ్‌ చేసుకున్నారు. వీడియో పుటేజీల ద్వారా గుర్తించిన ఎన్నికల కమిషన్, రీ–పోలింగ్‌కు ఆదేశించింది. ఆదివారం జరిగిన రీపోలింగ్‌లోనూ దొంగ ఓట్లు ద్వారా కుయుక్తులకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించారు. కానీ ఆధికారులు ముందు అవి ఫలించలేదు. స్వేచ్ఛాయుత వాతావరణంలో నియోజకవర్గం పరిధిలోని దళితులు, గిరిజనులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కమ్మపల్లి, ఎన్‌ఆర్‌ కమ్మపల్లిలో దొంగ ఓట్లు.. ఇద్దరి అరెస్ట్‌
రిగ్గింగ్, రీసైక్లింగ్‌ ద్వారా దొంగచాటుగా ఓట్లు వేసుకునే తమ సంస్కృతి అధికారుల ముందు సాగకపోవడంతో టీడీపీ శ్రేణులు దొంగఓట్లకు తెగబడ్డారు. కమ్మపల్లిలో నిబంధనలకు విరుద్ధంగా దొంగ ఓటు వేసేందుకు ప్రయత్నించిన మునిచంద్రనాయుడు, ఎన్‌ఆర్‌ కమ్మపల్లిలో యుగంధర్‌నాయుడును ఎన్నికల అధికారులు గుర్తించారు. దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నించారని వారిని పోలీసులకు పట్టించారు. రాత పూర్వకంగా ఎన్నికల అధికారులు ఫిర్యాదు చేయటంతో మునిచంద్రనాయుడు, యుగంధర్‌నాయుడుపై కేసు నమోదు చేసి, అరెస్ట్‌ చేశారు. 
భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించిన డీఐజీ, తిరుపతి, చిత్తూరు ఎస్పీలు
రీ–పోలింగ్‌ సందర్భంగా ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలూ చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను చేశారు. డీఐజీ క్రాంతిరాణాఠాటా, చిత్తూరు, తిరుపతి అర్బన్‌ ఎస్పీలు స్వయంగా పోలింగ్‌ కేంద్రాలను పర్యవేక్షించారు. ఎన్‌ఆర్‌కమ్మపల్లి, కమ్మపల్లిలో రచ్చచేసేందుకు ప్రయత్నించిన యువకులను  అక్కడి నుంచి తరిమేశారు.
భద్రత మధ్య ఓటింగ్‌కు దళితులు, గిరిజనులు
దళితులు, గిరిజనులను టీడీపీ శ్రేణులు ఓటింగ్‌కు రాకుండా బెదిరిస్తున్నారనే ఫిర్యాదు రావడంతో ఎన్నికల అధికారులు అప్రమత్తం అయ్యారు. దళితవాడల నుంచి పోలింగ్‌ కేంద్రాల వరకు వారిని తీసుకువచ్చి, ఓటింగ్‌ చేయించి, తిరిగి వారు ఇళ్లకు చేరేంతవరకు పోలీస్‌ భద్రత ఏర్పాటు చేశారు. దీంతో దళితులు, గిరిజనుల్లో ఆత్మస్థయిర్యం పెరిగింది. 25 ఏళ్ల తర్వాత స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకున్నామని వారు ఆనం దం వ్యక్తం చేశారు.

 

మరిన్ని వార్తలు