'దళితులు సీఎం పదవికోసం ఆరాట పడలేదు'

10 Mar, 2014 16:28 IST|Sakshi
'దళితులు సీఎం పదవికోసం ఆరాట పడలేదు'

కరీంనగర్: ముఖ్యమంత్రి పదవికోసం దళితులు ఏనాడు ఆరాటపడలేదని కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించిన అనంతరం దళితుడునే సీఎం చేస్తామని కేంద్రమంత్రి జైరాం రమేష్ వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. గతంలో దళితులు సీఎం పదవిని చేపట్టడంతో, రానున్న రోజుల్లో ఆ పదవిని బీసీ వర్గానికి కట్టబెట్టాలని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు డిమాండ్ చేయడంతో సర్వే స్పందించారు.

 

దళితుడ్ని సీఎం చేయడం కాంగ్రెస్ ఎజెండా కాదని, అయితే అవకాశం వస్తే దళితుడు సీఎం అయ్యే అవకాశం కూడా ఉందన్నారు. తమకు సీఎం పదవి కేటాయించాలని దళితులు ఎప్పుడూ అడగలేదని, ఆ విషయాన్ని సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఎప్పుడూ తమ దృష్టికి తీసుకురాలేదన్నారు. పదవుల కోసం ఆరాటపడే స్లోగన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ దేనని సర్వే తెలిపారు. ఎప్పటికైనా టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేయాల్సిందేనని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తమతో పొత్తుపెట్టుకుంటే వారికే శ్రేయస్కరమన్నారు.

మరిన్ని వార్తలు