నన్నపనేని వ్యాఖ్యలపై దళితుల ఆగ్రహావేశాలు

13 Sep, 2019 09:59 IST|Sakshi
నన్నపనేని దిష్టిబొమ్మను దహనం  చేస్తున్న మాల మహానాడు నాయకులు

సాక్షి, కాకినాడ సిటీ : దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నాయకురాలు నన్నపనేని రాజకుమారిని తక్షణం అరెస్ట్‌ చేసి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ రత్నాకర్‌ ఆధ్వర్యంలో దళితులు గురువారం ఆందోళన చేశారు. నగరంలో ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేశారు. నన్నపనేని దిష్టిబొమ్మను ర్యాలీగా తీసుకెళ్లి ఇంద్రపాలెం వంతెన సమీపం వద్ద అంబేడ్కర్‌ విగ్రహం ఎదురుగా దహనం చేశారు. నన్నపనేని దళితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ నాయకులు దళితులను కించపరచడం, దళితుల మధ్య చిచ్చు పెట్టడం అలవాటుగా మారిపోయిందని ఆయన విమర్శించారు. గతంలో దళితుల్ని తీవ్రంగా అవమానించిన చంద్రబాబు, పల్నాడులో దళితుల కోసం పోరాడుతున్నామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

మాజీ చింతమనేని ప్రభాకర్‌ దళితులను ఎలా కించపరిచారో అందరికీ తెలిసిందేనన్నారు. గత ఐదేళ్లుగా టీడీపీ పాలనలో దళితులు కనీసం ధర్నా కూడా చేయనీయలేదన్నారు. పోలీస్‌ వ్యవస్థను భ్రష్టు పట్టించింది చంద్రబాబు కాదా? అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు దళితులపై తప్పుడు కేసులు, రౌడీషీట్లు పెట్టి వేధింపులకు గురి చేశారని, కనీసం ఇప్పుడైనా చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకొని దళితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమానికి బీఎన్‌ రాజు, హరిబాబు, శ్యామ్‌ దయాకర్, బోను దేవా, బాబీ, శ్రీను తదితరులు నాయకత్వం వహించారు దిష్టిబొమ్మతో ర్యాలీ.. జీజీహెచ్‌ వద్ద ఉన్న పూలే విగ్రహం నుంచి కలెక్టరేట్‌ మీదుగా ఇంద్రపాలెం వంతెన వద్ద అంబేడ్కర్‌ విగ్రహం వరకు చేశారు.  

>
మరిన్ని వార్తలు