దళితుల ‘దారి’ మళ్లింది!

10 Jan, 2014 01:50 IST|Sakshi

మచిలీపట్నం, న్యూస్‌లైన్ : ప్రజాప్రతినిధుల పక్షపాతవైఖరి, అధికారుల అనాలోచిత చర్యలు దళితుల పాలిట శాపంగా పరిగణిస్తున్నాయి. దళితుల పేరుతో లబ్ధిపొందాలని ప్రణాళికలు రూపొందించుకున్న అగ్రవర్ణాల వారి అరాచక చర్యలకు అధికారులు వంతపాడడం పలు విమర్శలకు తావిస్తుంది.   దళితుల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని పాలకులు చేస్తున్న ప్రకటనలు ‘నేతిబీరకాయ’ చందంగా మారిపోయాయనే విమర్శలకు కొన్ని సంఘటనలతో బలం చేకూరుతుంది.

దళితుల పేరుతో నిధులు దారిమళ్లిపోతున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద రహదారి నిర్మాణం నిమిత్తం విడుదల చేసిన నిధులు వారికేమాత్రం ఉపయోగపడని వైనం నిమ్మకూరు- చినముత్తేవి రోడ్డు ప్రతిపాదనల్లో  వెలుగుచూసింది.నందమూరి హరికృష్ణ రాజ్యసభ సభ్యుడిగా తన నిధుల నుంచి రూ.1.02 కోట్లను  నిమ్మకూరు-చినముత్తేవి రోడ్డు అభివృద్ధికి కేటాయించారు.

టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామరావు సొంత గ్రామమైన నిమ్మకూరు నుంచి మొవ్వ మండలం చినముత్తేవి దళితవాడ వరకు 1.8 కిలోమీటర్ల మేర డొంక రోడ్డును తారురోడ్డుగా అభివృద్ధి చేసేందుకు ఈ మేరకు ప్రతిపాదనలు తయారు చేశారు.  ప్రతిపాదనలు ప్రస్తుతం టెండర్ల దశలో ఉన్నాయి. అయితే అసలు మతలబు అంతా ఇక్కడే ఉంది. నిమ్మకూరు నుంచి చినముత్తేవి వెళ్లడానికి సరాసరి రోడ్డు లేనే లేదు. నిమ్మకూరు నుంచి 1.8 కిలోమీటర్ల మేర డొంక రోడ్డు ఉంది. అరకిలోమీటరు మేర పొలాలు అడ్డుగా ఉన్నాయి. పంట కాల్వ ఉంది. చినముత్తేవి దళితవాడకు వెళ్లాలంటే కనీసం కాలిబాట లేని దుస్థితి.

ఇటువంటి పరిస్థితిలో కొత్తగా ప్రతిపాదించిన రోడ్డు   దళితవాడ వరకు వెళ్లే అవకాశం లేదు. అయినా ఆ ప్రాంతంలో పోలాలున్న  కొంతమంది ‘పెద్ద మనుషుల’ సౌకర్యార్థం  దళితుల నిధులను దారి మళ్లించడం విమర్శలకు తావిస్తోంది.  నిమ్మకూరు నుంచి చినముత్తేవి దళితవాడ వరకు డొంకరోడ్డును తారురోడ్డుగా అభివృద్ధి చేస్తున్నట్లు ప్రతిపాదనల్లో చూపి అధికారులు పనులకు టెండర్లు పిలిచారు.  అసలు లేనిరోడ్డును ఎలా అభివృద్ధి చేస్తారని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

అసలు విషయం ఏమిటంటే...అభివృద్ధి పనుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎంపీలకు కేటాయించే నిధుల నుంచి 22శాతం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు కేటాయించాల్సి ఉంది.  దళితవాడల అభివృద్ధికి మాత్రమే ఆ నిధులను వినియోగించాల్సి ఉంది. దీంతో  నిమ్మకూరు  డొంక రోడ్డును తారురోడ్డుగా మార్చేందుకు నిమ్మకూరు సమీపంలోని చినముత్తేవి దళితవాడను ప్రతిపాదనల్లో చూపి ఈ రోడ్డు నిర్మాణానికి రూపకల్పన చేశారు.  వాస్తవంగా ఈ రోడ్డు అభివృద్ధి చేస్తే నిమ్మకూరులోని కొంతమంది పెద్దలకు మాత్రమే ఉపయోగంగా ఉంటుందని... వ్యూహాత్మకంగానే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులనుఈ విధంగా దారి మళ్లించారనే ఆరోపణలు వినవస్తున్నాయి.
 

మరిన్ని వార్తలు