పాడు నిద్ర ప్రాణం తీసింది

18 Jun, 2015 01:02 IST|Sakshi

జలుమూరు: పాడు నిద్ర ప్రాణం తీసింది. రోజంతా కష్టపడి రాత్రి వేళ నిద్రపోతున్న వ్యక్తి పైనుంచి టిప్పర్ దూసుకెళ్లడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద సంఘటన వంవధార నది కరకట్టల నిర్మాణా పనుల్లో భాగంగా కొమనాపల్లి సమీపంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రాజాం మండలం పెనుబాక గ్రామానికి చెందిన చీడి రమణ(35) ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కరకట్టల పనుల్లో భాగంగా రమణ తనకున్న బుల్‌డోజర్‌తో మట్టిని సరిచేసే పనుల్లో మంగళవారం సాయంత్రం వరకూ పాల్గొన్నాడు. రాత్రికి కరకట్టల గట్టు మీదే పడుకొన్నాడు.
 
 ఇదే సమయంలో గట్టుకు మట్టి వేసే పనిలో భాగంగా మాకీయవలసకు చెందిన టిప్పర్ డ్రైవర్ మంత్రి దాలయ్య వెనుక నుంచి మట్టి వేస్తూ వాహనంతో రమణను గమనించకుండా అతని పైనుంచి వెళ్లిపోయాడు. దీంతో రమణ శరీరం నుజ్జునుజ్జు అయి..అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కొంతమంది మాట్లాడుతూ కరకట్టల నిర్మాణ పనులు చేసే వారంతా ఎప్పుడు గట్టుపైనే నిద్రిస్తారన్నారు. మంగళవారం రాత్రి కూడా శ్రీముఖలింగం గ్రామానికి చెందిన చింతం రాంబాబు, చీడి రమణ ఒకే చోట పడుకున్నారని చెప్పారు. అయితే వాహనం వస్తున్న శబ్దానికి తెలివి తెచ్చుకొని రాంబాబు పక్కకు వెళ్లగా రమణపై నుంచి టిప్పర్ వెళ్లిపోయినట్టు తెలిపారు.  
 
 కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే నా భర్త మరణానికి కారణం!
 కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే నా భర్త మరణించాడని రమణ భార్య సరోజిని రోదిస్తూ చెప్పింది. బుల్‌డోజర్ అద్దెతోపాటు పని చేసినందుకు వేతనం కూడా మూడు నెలలుగా చెల్లించలేదని వాపోయింది. ఎప్పుడు ఫోన్ చేసినా కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తే ఇంటికి వస్తానని తన భర్త చెప్పేవాడని..ఇంతలోనే తిరిగిరాని లోకానికి వెళ్లిపోయాడని విలపించింది. ఇంత ప్రమాదం జరిగినా సంబంధిత కాంట్రాక్టర్ పత్తా లేకుండా పోయాడని మృతుని బంధువులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. కాంట్రాక్టర్ వస్తే గాని రమణ మృతదేహన్ని తీసుకెళ్లమని తేల్చి చెప్పి గొడవకు దిగారు. దీంతో పోలీసులు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. విగత జీవిగా పడి ఉన్న తండ్రి మృతదేహాన్ని చూసిన రమణ కొడుకు మణికంఠ, కూతురు హేమలతాలు కన్నీరుమున్నీరయ్యారు. సరోజిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ డి.విజయ్‌కుమార్ తెలిపారు.
 

మరిన్ని వార్తలు