లేని పాకలకు నష్టపరిహారం

2 Mar, 2015 02:40 IST|Sakshi

తుఫాన్‌కు నష్టపోయి కష్టాల్లో ఉన్న బాధితులకు అందాల్సిన సాయాన్నీ తెలుగుతమ్ముళ్లు వదలడం లేదు. హుద్‌హుద్ సాయం నిధులు  పూర్తిగా పచ్చచొక్కాల జేబుల్లోకి వెళుతున్నాయి. అనర్హులతో లబ్ధిదారుల జాబితాలు రూపొందించి హుద్‌హుద్ నిధులు కొల్లగొట్టడానికి టీడీపీ వారు బరితెగించేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో కొబ్బరి చెట్లకు పరిహారం నిధులను తమ బొక్కసంలో వేసుకున్నారు. లేని కొబ్బరి చెట్ల పేరున కోట్ల రూపాయాల పరిహారం తమ ఖాతాల్లో జమ చేసుకున్నారు. తాజాగా టీడీపీ నేతల దృష్టి పశువుల పాకల పరిహారం నిధులపై పడింది. మూగజీవాల గూడు కోసం మంజూరైన నిధులను కూడా కొల్లగొట్టడానికి వెనుకాడటం లేదు.
 
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మునగపాకలోని ఈ కాలనీ చూశారా!... అంతా స్లాబ్ ఇళ్లతో ఉన్న కాలనీ ఇదీ. ఒక్క పశువుల పాక కూడా లేదు... కానీ ఈ కాలనీలో పశువుల పాకలు హుద్‌హుద్ తుపానుకు కూలిపోయాయని చెప్పి పరిహరం నిధులను ఫలహారం చేయడానికి టీడీపీ తమ్ముళ్లు సిద్ధపడ్డారు. ‘మా దారి అడ్డదారి’అన్నట్లు తయరైంది వీరి పరిస్థితి. తుఫాన్‌కు కూలిపోయిన పశువుల పాకలకు ప్రభుత్వం రూ.10 వేల చొప్పున పరిహారం ప్రకటించింది. దాంతో ఇష్టానుసారంగా పూర్తిగా అనర్హులతో లబ్ధిదారుల జాబితా రూపొందింపచేశారు.

మునగపాకలోనీ ఈ కాలనీలో ఒక్క పశువుల పాక కూడా లేదు. అసలు ఆ కాలనీలో ఎవరికీ వ్యవసాయం లేదు... పాడి పశువులూ లేవు. దాంతో పశువుల పాకలు ఉండే అవకాశమే లేదు. కానీ ఆ కాలనీలో 69 పశువుల పాకలు తుపానుకు కూలిపోయాయని జాబితా రూపొందించారు. ఆ మేరకు ఒక్కొక్కరికీ రూ.6.9 లక్షలు పరిహారం చెల్లించేందుకు సిద్ధపడిపోయారు. కానీ ఆ 69 మందిలో కేవలం ఐదుగురికే పశువుల పాకలు ఉండేవి. మిగిలినవారికి ఎవరికీ పాకలు లేనే లేవు. కానీ వారి పేర్లను చేర్చి జాబితా రూపొందించేశారు. ఒకే కుటుంబంలో  నలుగురైదుగురి పేర్లను కూడా జాబితాలో చేర్చేయడం గమనార్హం.
 
జాబితాలో ఇంకొన్ని విచిత్రాలు!
 సీరియల్ నంబర్ 15, 20, 25, 26, 38, 39లలో పేర్కొన్న వారందరూ ఒకే కుటుంబ సభ్యులు. వారెవరికీ పశువుల పాకలు  లేవు. కానీ ఆ వారందరి పేర్లను కూడా అర్హుల జాబితాలో చేర్చేశారు.
 పంచాయతీ వార్డు సభ్యుడు పూడి పరదేశీ రావు పేరును రెండుచోట్ల నమోదు చేశారు. సీరియల్ నంబర్ 43, 47లలో ఆయన పేరునే చేర్చారు. కానీ తెలివిగా ఆయన ఆధార్‌నంబర్ రాయకుండా కనికట్టు చేశారు.
 సీరియల్ నంబర్లు 6, 7, 8, 9, 49, 66లతో పేర్కొన్న పేర్లన్నీ  కూడా ఒకే కుటుంబానికి చెందినవి.  
 
పరిహారం చెల్లింపులో అక్రమాలు
‘అధికార పార్టీ నాయకులు తుఫాన్ బాధితుల నమోదులో అక్రమాలకు పాల్పడ్డారు. దళితవాడలో నిజమైన బాధితులను కాదని అనర్హులకు పరిహారం జాబితాల్లో అవకాశం కల్పించడం విచారకరం.  దీనిపై జిల్లా ఉన్నతాధికారులు విచారించి అర్హులకు న్యాయం చేయాలి’
 -రాజాన రూపావతి, దళితురాలు, ఎంపీటీసీ సభ్యురాలు
 
టీడీపీ కార్యకర్తలకే ప్రాధాన్యం
హుద్‌హూద్ తుఫాన్ బాధితుల నమోదులో అక్రమాలు చోటు చేసుకున్నాయి. నిజమైన బాధితులకు న్యాయం జరగలేదు. దళితవాడలో కేవలం 5 పా కలు మించిలేవు. కాని పరిహారాల జాబితాల్లో అ నర్హులకు చోటు కల్పించారు. కేవలం  టీడీపీ కార్యకర్తలకే చోటు కల్పించి నిజమైన బాధితులను విస్మరించారు. అధికారులతో విచారణ జరి పిం చి తగు న్యాయం చేయాలి.
 - బీలా అప్పలనాయుడు, పంచాయతీ వార్డు సభ్యుడు

మరిన్ని వార్తలు