పద్మిని దామోదర అడుగులెటు?

12 Jan, 2014 01:16 IST|Sakshi

సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సతీమణి పద్మిని రాజకీయ అరంగేట్రం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.  వచ్చే ఎన్నికల్లో ఆమె సంగారెడ్డి నుంచే పోటీ చేస్తారని కొంతకాలంగా కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. పద్మిని కూడా సంగారెడ్డి నియోజకవర్గంలో జరిగే ధార్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతో పాటు తన వద్దకు వచ్చే స్థానిక నేతలకు తోచిన సాయం చేస్తున్నారు. మరోవైపు జయప్రకాశ్‌రెడ్డిని విభేదిస్తున్న చాలామంది సంగారెడ్డి నేతలు ఎలాగైనా రానున్న ఎన్నికల్లో పద్మినీ దామోదర్‌ను తమ నియోజకవర్గం నుంచే బరిలో దింపాలని భావిస్తున్నారు.

 ఈ విషయాన్ని ఇప్పటికే డిప్యూటీ ఎదుట ప్రస్తావించి ఆయన్ను ఒప్పించినట్లు కూడా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఏఐసీసీ పరిశీలకుడు బస్వరాజ్ పాటిల్ ఆదివారం సంగారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ కేటాయింపుపై కాంగ్రెస్ నేతల అభిప్రాయాలను సేకరించనున్నారు. దీంతో  కాంగ్రెస్ నేతల దృష్టంతా ఆదివారం జరగనున్న ఏఐసీసీ పరిశీలకుడి భేటీపైనే కేంద్రీకృతమై ఉంది. సంగారెడ్డి టికెట్ ఆశించినట్లయితే ఆమే స్వయంగా ఏఐసీసీ పరిశీలకుడిని కలిసి అవకాశం ఉంది. ఆమె సంగారెడ్డి టికెట్‌పై అంతగా మక్కువ చూపకపోతే మాత్రం ఆమెకు మద్దతుగా కాంగ్రెస్ నేతలే ఏఐసీసీ పరిశీలకుడిని కలిసి సంగారెడ్డి టికెట్ గురించి చర్చించే అవకాశం ఉంది. అయితే ఈ రెండు జరగకపోతే మాత్రం ఆమె రాజకీయ అరగేంట్రంపై సస్పెన్స్ కొనసాగే అవకాశం ఉంది.

 బలప్రదర్శనకు సిద్ధమైన జయప్రకాశ్‌రెడ్డి
 ఏఐసీసీ పరిశీలకుడు బస్వరాజ్‌పాటిల్ ఆదివారం సంగారెడ్డికి రానున్న నేపథ్యంలో విప్ జయప్రకాశ్‌రెడ్డి తన సత్తా చూపేందుకు సిద్ధమయ్యారు. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి మరోమారు కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న ఆయన, తన మద్దతుదారులతో కలిసి ఆదివారం ఏఐసీసీ పరిశీలకుడిని భేటీకానున్నట్లు సమాచారం. భారీ జన సమీకరణతో ఏఐసీసీ పరిశీలకుని ఎదుట తన సత్తా చాటిచెప్పి తద్వారా మరోమారు సంగారెడ్డి ఎమ్మెల్యే టికెట్ కైవసం చేసుకోవాలని జయప్రకాశ్‌రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం సంగారెడ్డి, కొండాపూర్, సదాశివపేట మండలాల నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను సమీకరిస్తున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు