సమర్పిస్తేనే సర్వే..

3 Dec, 2015 01:04 IST|Sakshi

ప్రైవేటు వ్యక్తులతో దందా  రైతులను  పీక్కుతింటున్న వైనం
సర్వేయర్ల వ్యవహారంతో వేలాది మంది ఇక్కట్లు


అద్దెయ్య ఓ సన్నకారు రైతు. తన పొలం పక్కనే ఇటీవల ఓ గ్రానైట్ ఫ్యాక్టరీ వెలిసింది. అద్దెయ్యకు చెందిన కొంత భూమిని ఫ్యాక్టరీ యాజమాన్యం ఆక్రమించింది. పొలాన్ని సర్వే చేసి న్యాయం చేయాలని ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే ఆరు నెలలు గడిచింది. కొలతలు వేసి హద్దులు నిర్ణయించాల్సిన సర్వేయర్ ఇంతవరకూ పొలం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. మరో వైపు ఫ్యాక్టరీ యాజమాన్యం అంతకంతకూ అద్దెయ్య పొలాన్ని ఆక్రమిస్తూ వ స్తోంది. ఫ్యాక్టరీ యాజమాన్యంతో సర్వేయర్ కుమ్మక్కై తనకు అన్యాయం చేస్తున్నారని అద్దెయ్య ఆరోపిస్తున్నారు. ఇది ఒక్క అద్దెయ్య సమస్యే కాదు. జిల్లా వ్యాప్తంగా వేలాది మంది రైతులు  సర్వేయర్ల వ్యవహారంతో మానసిక క్షోభకు గురవుతున్నారు. ఎంతోకొంత సమర్పిస్తేనే తప్పా సర్వేయర్లు సీటు కదిలి రాని పరిస్థితి నెలకొంది..
 
నాదెండ్ల: చిలకలూరిపేట మండలానికి చెందిన ఓ సర్వేయర్ అయితే రాజదర్పం ప్రదర్శిస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులను తనకు సహాయకులుగా నియమించుకుని వ్యవహారాలు చక్కబెడుతున్నారు. ఇటీవల జరిగిన ఆయన పుట్టిన రోజు వేడుకలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ రాజకీయవేత్త మాదిరి పట్టణమంతా ఫ్లెక్సీలు వెలిశాయి.
 
నాదెండ్ల మండలంలో కొద్ది రోజుల కిందట వరకూ పనిచేసిన ఓ సర్వేయర్‌పై తీవ్ర అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల రెవెన్యూ అధికారులు గ్రామాల్లో నిర్వహించిన మీ ఇంటికి మీ భూమి కార్యక్రమంలో రైతులు సంబంధిత సర్వేయర్‌పై ఫిర్యాదులు చేశారు. అతని అనుయాయులే ఒక్కో పనికి ఇంత అని నిర్ణయించి రైతుల నుంచి వసూలు చేసేవారు. ఆయనపై తీవ్ర అవినీతి ఆరోపణలు రావటంతో వేరే మండలానికి బదిలీ చేశారు. సర్వే చేసేందుకంటూ డబ్బులు సమర్పించుకున్న రైతులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.

సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఒక సర్వేయర్  రైతుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాళ్ళరిగేలా తిరిగినా కనీసం మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వడని అంటున్నారు.రేపల్లె నియోజకవర్గంలో వందలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే ముందు వారి దరఖాస్తులను పరిష్కరిస్తున్నారు. మంగళగిరి, అమరావతి, తుళ్లూరు, తాడికొండ లాంటి సీఆర్‌డీఏ పరిధిలోని మండలాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇక్కడి రైతుల అగచాట్లు ఏ రోజు ఆయా తహశీల్దార్ కార్యాలయాలకు వెళ్లినా దర్శనమిస్తూనే ఉంటాయి.

 మాచర్ల నియోజకవర్గానికి చెందిన ఓ మండల కార్యాలయంలో ఓ రైతు అక్కడి సర్వేయర్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశాడు. ఆరు నెలలుగా సర్వేయర్ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా.. తన పొలం కొలిచిన పాపానపోవడం లేదని తీవ్రంగా మండిపడ్డాడు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
 
ప్రజలను పీక్కుతింటున్నారు...
సర్వేయర్లు లంచాల ఊబిలో కూరుకుపోయారనడానికి జిల్లాలో ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. పరిస్థితి పూర్తిగా చేయిదాటి పోతున్నా.. ఏ ఒక్క ఉన్నతాధికారీ వీరి గురించి పట్టించుకోవడం లేదు.  జిల్లాలో ఎందరో సర్వేయర్లు అనతి కాలంలోనే సంపన్నులుగా మారిపోతున్నా.. ఏసీబీ అధికారులకూ కన్పించడం లేదు. రైతులకు న్యాయం చేయాల్సిన సర్వేయర్లు లంచాలతో పీక్కుతింటున్నారనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఒక్కో సర్వేయర్ నలుగురుకి మించి ప్రైవేటు వ్యక్తులను నియమించుకొని దందా చేస్తున్నారు. ఎకరా పొలం కొలత వేయాలంటే రూ.5 వేలు లంచం ఇస్తేనే స్పందిస్తారు.  
 
 

మరిన్ని వార్తలు