ఉధృతంగానే గోదారి

5 Aug, 2019 03:39 IST|Sakshi
ఆదివారం తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నంలో నీట మునిగిన ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ

ధవళేశ్వరం వద్ద 14.20 అడుగులకు చేరిన నీటిమట్టం

రెండో ప్రమాద హెచ్చరిక జారీ

ముంపు గ్రామాల్లో సహాయక చర్యలు కొనసాగిస్తున్న అధికారులు

పునరావాస కేంద్రాలకు బాధితుల తరలింపు

నిత్యావసర సరుకులు, మంచినీళ్ల పంపిణీ

సాక్షి, అమరావతి/సాక్షి, నెట్‌వర్క్‌: ఎగువ ప్రాంతంలో ఉపనదుల నుంచి భారీగా వరద నీరొచ్చి చేరుతుండడంతో గోదావరిలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు కాఫర్‌ డ్యామ్‌ వద్ద 28.1 మీటర్ల ఎత్తున వరద ప్రవహిస్తోంది. ధవళేశ్వరంలోని సర్‌ ఆర్థర్‌ కాటన్‌ బ్యారేజి నుంచి 13,58,163 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ఆదివారం ఉదయం 7.30 గంటలకు నీటిమట్టం 13.75 అడుగులకు చేరుకోవడంతో బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నీటిమట్టం పెరుగుతూ మధ్యాహ్నం ఒంటిగంటకు 14.20 అడుగులకు చేరుకుంది. అక్కడి నుంచి రాత్రి 7 గంటల వరకూ నిలకడగా ఉంది. తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం, ఎటపాక, వీఆర్‌పురం, చింతూరు, కూనవరం తదితర మండలాల్లో 168 గ్రామాలు, పశ్చిమగోదావరి జిల్లాలోని 20 మండలాల్లోని 216 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. మొత్తంగా 74 వేల మంది వరద ప్రభావానికి గురైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఆయా గ్రామాల్లో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

బాధితులకు ఆహార పొట్లాలు, నీటి ప్యాకెట్లు, బియ్యం, కిరోసిన్, కందిపప్పు, పామాయిల్, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు ఉచితంగా పంపిణీ చేశారు. పూర్తిగా నీట మునిగిన గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. తూర్పు గోదావరిలో సుమారు 4,190 హెక్టార్లలో వరి చేలు, 1,198 హెక్టార్లలో ఉద్యాన పంటలు పశ్చిమలో 4,746 హెక్టార్లలో పంటలు వరదలో మునిగిపోయాయి. పలుచోట్ల రహదారులు దెబ్బతినడంతో రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్‌ స్తంభాలు నేలకొరగడంతో కరెంట్‌ సరఫరా ఆగిపోయి కొన్ని గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. కాగా, ఉభయ గోదావరి జిల్లాల్లో వరద వల్ల ముంపునకు గురైన, నీరు చేరిన గ్రామాల్లోని బాధితులకు సహాయం అందించడానికి అవసరమైన నిధులను టీఆర్‌ –27 కింద డ్రా చేసుకునేందుకు రెండు జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం అనుమతించింది. ఎంపీ రఘురామకృష్ణంరాజు, మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, సబ్‌ కలెక్టర్‌ సలీమ్‌ఖాన్‌లు నరసాపురం పార్లమెంట్‌ పరిధిలో ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలకు ఇబ్బందుల్లేకుండా సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

తాగునీటి ఇబ్బందులు రానీయకండి
ఉభయ గోదావరి, విశాఖ జిల్లాల అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి టెలికాన్ఫరెన్స్‌
తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో వరదల కారణంగా ముంపునకు గురైన గ్రామాల్లో ప్రజలు తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలంటూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయా జిల్లాల అధికారులను ఆదేశించారు. ఆదివారం పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజాశంకర్, ఈఎన్‌సీ సుబ్బారెడ్డిలతో కలసి మూడు జిల్లాల కలెక్టర్లతో పాటు జిల్లా పరిషత్‌ సీఈవోలు, డీపీవోలతో మంత్రి టెలికాన్ఫరెన్స్‌ సమావేశం నిర్వహించారు. వరద ప్రాంతాల్లో ప్రజలు కలుషిత నీటిని తాగకుండా మంచినీటి ప్యాకెట్లను సరఫరా చేయడంతో పాటు గ్రామాల్లో నివాసిత ప్రాంతాల మధ్య మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. పారిశుధ్య కార్యక్రమాలపై అక్కడి ప్రజలకు అవగాహన పెంచడం, పందులు వంటి వాటిని గ్రామాలకు దూరంగా ఉంచడం వంటి విషయాల్లో మండల స్థాయి అధికారుల ద్వారా తగిన చర్యలు చేపట్టాలన్నారు.

పోటెత్తిన కృష్ణమ్మ
శ్రీశైలం ప్రాజెక్ట్‌/రాయచూరు రూరల్‌: శ్రీశైలం జలాశయానికి సోమవారం వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర జల సంఘం పేర్కొంది. గత 4 రోజులుగా జలాశయానికి 2 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో నీటి మట్టం గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం జలాశయంలో నీటి మట్టం 857 అడుగులకు, నీటి నిల్వ 98.9024 టీఎంసీలకు చేరింది. నీటి మట్టం 854 అడుగులు దాటడంతో కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్‌ కేంద్రాలలో విద్యుత్‌ ఉత్పాదన కు జనరేటర్లను సిద్ధం చేశారు. ఆదివారం ఆల్మట్టి డ్యాం నుంచి ఏకంగా 2.50 లక్షల క్యూసెక్కుల నీటిని నదికి వదిలారు.

మరిన్ని వార్తలు