గ్యాస్‌ వినియోగంలో జాగ్రత్తలు తప్పనిసరి

28 Sep, 2019 12:34 IST|Sakshi

గడువు దాటిన సిలిండర్లతో పొంచి ఉన్న ముప్పు

నిడమర్రు: వంట గ్యాస్‌ (ఎల్‌పీజీ)తో వంట చేసుకోవడం ఎంత సులువో సరైన జాగ్రత్తలు పాటించకపోతే అంతే ప్రమాదం పొంచి ఉంటుంది. మీ డీలర్‌ çసరఫరా చేసిన వంటగ్యాస్‌ సిలిండర్‌కు ఎక్స్‌పయిరీ తేదీ ఉంటుంది. ఎక్స్‌పయిరీ తేదీ అంటే ఆ సిలిండర్‌ వినియోగించడానికి గడువు పూర్తయిందని సూచన.  గడువు దాటిన తర్వాత  మీ ఇంటికి చేరే సిలిండర్లలో లీకేజీలు ఏర్పడవచ్చు, ప్రమాదం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.  వంట గ్యాస్‌ సిలిండర్‌ను ఫిల్లింగ్‌ చేసే మయంలో నిబంధనలు ఏమిటి..?, సిలిండర్‌ గడువు తీరిందని ఎలా గుర్తించాలి.. తదితర సమాచారం తెలుసుకుందాం..

సిలిండర్‌కు 10 ఏళ్ల గడువు
చట్టప్రకారం  వంట గ్యాస్‌ (ఎల్పీజీ )సిలిండర్‌ అన్ని భద్రతా ప్రమాణాల  పరీక్షలు పూర్తి చేసుకున్న కొత్త సిలిండర్‌ గడువు 10 ఏళ్ల వరకూ ఉంటుంది. సిలిండర్‌ తయారీలో ప్రత్యేకమైన ఉక్కుతోనూ,  సిలిండర్‌ లోపల సురక్షితమైన కోటింగ్‌తో బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాన్‌డర్డ్స్‌ (బీఐఎస్‌) ప్రమాణాల మేరకు తయారు చేస్తుంటారు. చీఫ్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎక్స్‌ ప్లోజిన్స్, బీఐఎస్‌ అనుమతులు తప్పని సరిగా తీసుకున్నాకే సిలిండర్‌ అందుబాటులోకి వస్తుంది. ఒకసారి లోపాలు కనిపించిన వాటిని సరిచేసి బీఐఎస్‌ ధ్రువీకరణ తీసుకున్న సిలిండర్‌లో మరోసారి పరీక్షల సమయంలో లోపాలు కనిపిస్తే తక్షణం దాన్ని తుక్కు కింద పక్కన పెట్టాలి. ఎట్టి పరిస్థితిల్లోనూ దానిలో గ్యాస్‌ నింపకూడదు.

గడువు తేదీఎలా తెలుసుకోవాలి..?
ఫలానా సంవత్సరం, ఫలానా నెలలో సిలిండర్‌ పరీక్షలకు వెళ్లాల్సి ఉందన్న సంకేతాన్ని సిలిండర్‌పై గుర్తించడం చాలా సులభం. సిలిండర్‌పై ఉన్న మెటల్‌ ప్లేట్లలో ఒకదానిపై లోపలివైపు ఈ వివరాలు ఉంటాయి. ఉదాహరణకు మీ ఇంట్లో సిలిండర్‌పై ఏ17 అని ఉందనుకోండి అదే ఎక్స్‌పయిరీ తేదీ అని గుర్తించాలి. 19 అంకె 2019 సంవత్సరాన్ని, అంగ్ల అక్షరం –ఎ మొదటి త్రైమాసికం అని అర్థం. అంటే 2019 మార్చిలోపు ఈ సిలిండర్‌ గడువు తేదీ ముగుస్తుంది. నెలను ఇలా గుర్తించాలి. ఎ– ( జనవరి నుంచి మార్చి) బి– (ఏప్రిల్‌ నుంచి జూన్‌) సి– (జులై నుంచి డిసెంబర్‌)

మూడు నెలల గ్రేస్‌ పిరియడ్‌
ప్రతీ సిలిండర్‌పై ఉన్న గడువు తర్వాత మరో మూడు నెలలు గ్రేస్‌ పిరియడ్‌ ఉంటుంది. అంటే వినియోగదారుని దగ్గరకు వెళ్లిన సిలిండర్‌ తిరిగి  డీలర్‌ వద్దకు చేరి అక్కడి నుంచి గ్యాస్‌ రీఫిల్లింగ్‌ స్టేషన్‌కు చేరుకునేందుకు వీలుగా ఈ గ్రేస్‌ పీరియడ్‌. అంతేగానీ కస్టమర్‌ వాడుకునేందుకుకాదు. అంటే ఏ–2019 గడువుతో ఉన్న సిలిండర్‌ను మార్చి నెల తర్వాత గ్యాస్‌ డీలర్‌ మీకు పంపిస్తే ఎట్టి పరిస్థితిల్లోనూ దీన్ని తీసుకోవద్దు. మరో సిలిండర్‌ కోరే  హక్కు వినియోగదారుడికి ఉంది.  కొంత మంది డీలర్లు గడువు తేదీని పెయింట్‌తో మార్చుతున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. వాటిని గమనించాలి.
వినియోగదారుడి హక్కులు
గ్యాస్‌ కనెక్షన్‌ కలిగిన వినియోగదారుడు మరణిస్తే వారి కుటుంబ సభ్యుల పేరిట ఆకనెక్షన్‌ను మార్చుకోవచ్చు.
బుక్‌ చేసిన ఏడు పనిదినాల్లోపు సిలిండర్‌ను కస్టమర్‌కు అందివ్వాలి
కొత్త కనెక్షన్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు, అవసరమైన ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తే అదే రోజు కనెక్షన్‌ జారీ చేయాలి.
కొత్తగా కనెక్షన్‌ తీసుకునే సమయంలో డీలర్‌ స్టవ్‌ను కూడా తీసుకోవమని అడుగుతుంటాడు. కానీ నిబంధనల ప్రకారం డీలర్‌ దగ్గరే స్టవ్‌ తీసుకోవాల్సిన అవసరంలేదు.
వంటగ్యాస్‌ను వాహనాల కోసం వినియోగించడం చట్టరీత్యానేరం. దీనికి బదులు ఆటోగ్యాస్‌ కోనుగోలు చేసి వాడుకోవాలి.

మరిన్ని వార్తలు