ప్రమాదపుటంచున ప్రయాణం

9 Mar, 2019 18:47 IST|Sakshi
కొండ ప్రాంతంలోని మార్గం  

సాక్షి, విజయవాడ : ప్రమాదకరంగా ఉన్న కాలిబాటల్లో రాకపోకలు సాగించలేక కొండ ప్రాంత ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. నడిచేందుకు వీలులేని మెట్ల మార్గంలో తరచూ ప్రమాదాలకు గురవుతున్న పేదల పరిస్థితి దయనీయంగా ఉంది. నాల్గవ డివిజన్‌ పరిధిలోని కార్మికనగర్‌ కొండ ప్రాంత ప్రజల తీరని సమస్య ఇది. ఇళ్లు కొనే స్తోమత లేక, కనీసం ఇంటి అద్దెలు కట్టుకునే పరిస్థితి లేని పేదలు కొండ ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని పేదలు దాదాపు మూడు దశాబ్దాలుగా ఇక్కడ జీవిస్తున్నారు. ఉదయాన్నే సద్ది మూట కట్టుకుని కూలీ పనులకు వెళ్లి సాయంత్రానికి ఇళ్లకు చేరుకుంటారు.

నిత్యం వీరు రాకపోకలు సాగించే కాలిబాటలు ప్రమాదకరంగా ఉన్నాయి. ఏళ్లు గడిచినా ఇక్కడ మెట్ల మార్గాల నిర్మాణాలే లేవు. దీంతో స్థానికులు ప్రమాదపుటంచున ప్రయాణాలు సాగిస్తున్నారు. అడుగు జారితే అఘాతంలోకే అన్నట్లుంది ఇక్కడి పరిస్థితి. తప్పనిసరి పరిస్థితుల్లో రాకపోకలు సాగిస్తున్నారు. వర్షకాలం ఇక్కడ రాకపోకలు మరింత ప్రమాదకరంగా ఉన్నాయి. పిల్లలు, మహిళలు వచ్చిపోయే సమయంలో పడిపోయి గాయాలపాలైన సందర్భాలు లేకపోలేదు.

మామూలుగానే నడవలేక పోతుంటే నిత్యావసరాలకు సంబంధించిన బరువైన వస్తువులు పైకి చేరవేసేందుకు స్థానికులు పడే తిప్పలు అన్నీ ఇన్నీ కావు. ఏళ్ల తరబడి ఇబ్బందులు పడుతున్నా, ఎన్ని సార్లు తమ సమస్యలు చెప్పుకున్నా పట్టించుకున్న వారే లేరని ఇక్కడి వారు చెబుతున్నారు. ఓట్ల కోసం తప్పా నేతలు తమ సమస్యలు పరిష్కరించేందుకు ముందుకు రావడంలేదని ఆరోపిస్తున్నారు. నాయకులు, అధికారులు మారుతున్నారే తప్పా తమ స్థితిగతులు మారటం లేదని వాపోతున్నారు. అధికారులు స్పందించి ఈ ప్రాంతంలో కాలిబాటలు మెరుగు పరిచి, మెట్ల మార్గాలు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు