కూతురని అప్పచెప్పితే అమ్మేసింది..

17 Jun, 2017 09:30 IST|Sakshi

ఉక్కునగరం(గాజువాక): నమ్మి వ్యాపారాన్ని అప్పగించిన తండ్రికే శఠగోపం పెట్టిందో కూతురు. సూమారు రూ.50లక్షల విలులైన తన సిబ్బంది సహకారంతో యంత్రసామాగ్రిని అమ్మేసింది.. కన్న కూతురే తండ్రినే మోసగించిన ఈ సంఘటన స్టీల్‌ప్లాంట్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల వివరాలు ప్రకారం.. స్టీల్‌ప్లాంట్‌ బ్లాస్ట్‌ఫర్నేస్‌ విభాగంలో నిర్మాణ పనులు చేస్తున్న మోడరన్‌ రిఫ్రాక్టరీ ఎరక్టర్స్‌ మేనేజింగ్‌ పార్టనర్‌ పి.కె.వి. నారాయణ(79) చిన్న కుమార్తె సునీతా నారాయణ భర్త లేకపోవడంతో తండ్రి వద్ద ఉంటుంది.

2011 నుంచి తండ్రి వద్దే ఆఫీసు అసిస్టెంట్‌గా పని చేస్తుంది. అయితే గత జనవరి నుంచి పనులు నిలిపివేశారు. అక్కడి యంత్రసామాగ్రిని సంస్థ ఆవరణలో ఉంచారు. ఈ క్రమంలో ఆయన కుమార్తె సునీతా నారాయణ, సంస్థ సూపర్‌వైజర్లు సంతోష్‌ సింగ్, దుర్గారావు, కె.ఎల్‌. కిరణ్‌కుమార్‌లతో కలిసి మిషనరీను అమ్మేశారు. ఈ విషయం తెలిసిన నారాయణ స్టీల్‌ప్లాంట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మిషనరీ విలువ సుమారు రూ. 50 లక్షలు ఉంటుందని అంచనా. సీఐ మళ్ల శేషు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు