నాన్న కలకు కొడుకునవుతా!

20 Mar, 2020 07:48 IST|Sakshi
తండ్రి రాజేంద్రప్రసాద్‌ సమాదికి పూజ చేస్తున్న లిఖిత ,తండ్రికి అంత్యక్రియలు నిర్వహిస్తున్న లిఖిత(ఫైల్‌)

కుదిపేసిన ఇంటిపెద్ద మరణం

ఒక్కగానొక్క కుమార్తెకు పుట్టెడు దుఃఖం

అంత్యక్రియల వేళ తెరపైకి కట్టుబాట్లు

మగ సంతానం లేక తర్జనభర్జన

నాన్నంటే ఇష్టమంటూ ముందుకొచ్చిన కూతురు

అన్నీ తానై ‘సాగనంపిన’  గారాలపట్టి

పున్నామ నరకం తప్పించేవాడు కొడుకంటారు. ఇదెంతవరకు నిజమో కానీ.. కూతుళ్లను కనే తల్లికి మాత్రం ప్రత్యక్ష నరకం కళ్ల ముందు కనిపిస్తుంది. మొదటి కాన్పులో పాప పుడితే కొందరు లక్ష్మి పుట్టిందని    సంబరపడితే.. మరికొందరు గుండెలపై కుంపటిగా భావిస్తారు. ఇక రెండో కాన్పులోనూ కూతురంటే.. మెట్టినింటి వేధింపులు పురిటినొప్పులకు రెట్టింపు.  ఇలాంటి సమాజంలో ఆ ఒక్కగానొక్క కుమార్తె తన   తండ్రి ప్రేమను చంపుకోలేక.. స్వర్గమో, నరకమో తానే సాగనంపుతానంటూ భీష్మించి మరీ అంత్యక్రియలు చేసింది. తండ్రి కల సాకారం చేసే కొడుకునవుతానంటూ ప్రతినబూనుతోంది.

అనంతపురం ,అమరాపురం: కట్టుబాట్ల సంకెళ్లు తెగిపడ్డాయి. కన్నతండ్రికి కూతురే అంత్యక్రియలు నిర్వహించి ఆదర్శంగా నిలిచింది. సంప్రదాయం పేరుతో తొలుత అభ్యంతరాలు తలెత్తినా.. చిన్నారిలోని ఆత్మస్థైర్యం.. తండ్రి పట్ల మమకారాన్ని చూసిన కుటుంబ పెద్దలు తల వంచక తప్పలేదు. సమాజంలో ఆడ, మగ అనే భేదం లేదని నిరూపించిన ఈ ఘటన అమరాపురం మండలంలో ఈ నెల 14న చోటు చేసుకుంది. కన్నతండ్రిని పోగొట్టుకున్న లిఖిత ఆ వివరాలను గురువారం ‘సాక్షి’తో పంచుకుంది...

నా పేరు లిఖిత. అమరాపురం మండలం తమ్మడేపల్లి గ్రామం. మా ఊరికి కిలోమీటరు దూరంలోని గౌడనకుంట జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నా. మా నాన్న రాజేంద్ర ప్రసాద్‌. అమ్మ లలిత. వాళ్లిద్దరికీ నేనొక్కదాన్నే కూతురు. గ్రామంలో మాకు 3.5 ఎకరాల పొలం ఉంది. అరకొర నీటి వసతితో అర ఎకరాలో వక్క తోట, మరో అర ఎకరాలో ఉల్లి సాగు చేస్తున్నాం. వ్యవసాయ పనులన్నీ నాన్ననే చూసుకుంటారు. ఆయనకు తోడుగా అమ్మ వెళ్తుంది. 

ఆదాయం అంతంత మాత్రమే..  
వర్షాలు సక్రమంగా కురువని పరిస్థితుల్లో పంటలసాగు చేయడం ఎంతో కష్టం. మాకున్న అర ఎకరా వక్కతోటకు నీరు సరిపోగా మిగిలిన నీటితో అర ఎకరాలో నాన్న అతి కష్టంపై ఉల్లి సాగు చేసేవారు. మిగులు భూమిలో వర్షాధారం కింద వేరుశనగ పండిస్తూ ఉండేవారు. వ్యవసాయం తప్ప మరొక పని మా నాన్నకు తెలియదు. ఈ ఆదాయం సరిపోక కె.శివరంలో మా సమీప బంధువుకు చెందిన రెండు ఎకరాలను మా నాన్న కౌలుకు తీసుకుని తమలపాకుల సాగు చేపట్టారు. 

తల్లిదండ్రులతో లిఖిత
మా అమ్మ, నాన్నది ప్రేమవివాహం
నాన్న ఏడో తరగతికే పరిమితం కాగా.. అమ్మ పదో తరగతి వరకు చదువుకుంది. పెళ్లికి ముందు మల్బరీ సాగులో పురుగుల మేపునకు నాన్న కూలి పనులకు వెళ్లేవాడు. ఆ సమయంలో అమ్మతో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. అప్పట్లో పెద్దలను అడిగితే అమ్మ తరఫు వాళ్లు ఒప్పుకోలేదంట. ఒకే సామాజిక వర్గం(వక్కలిగ) కావడంతో పాటు 2000 సంవత్సరంలో ఇద్దరూ ఎవరికీ చెప్పకుండా మరో ప్రాంతానికి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. అమ్మ అంటే నాన్నకు ఎంతో ఇష్టం. వారి పెళ్లి అయిన ఐదేళ్ల తర్వాత నేను పుట్టాను. నాన్న తమలపాకు తోట వద్దకెళ్లినప్పుడు అమ్మ ఇక్కడి వక్క తోటలను చూసుకునేది. చెట్లకు స్వయంగా తానే నీరు పెట్టేది. 

డాక్టర్‌ని చేస్తాననేవారు
నన్ను నాన్న ఎంతో ప్రేమతో చూసుకునేవారు. మా నాన్న వారి చిన్నాన్న ఈరలింగప్పకు ఓ కుమార్తె ఉంది. వరుసకు నాకు అత్త అవుతుంది. ఆమె పేరు అనసూయ. ప్రస్తుతం ఆమె కర్ణాటకలోని తుమకూరులో ప్రభుత్వ వైద్యురాలిగా పనిచేస్తున్నారు. మా నాన్న నాతో ఎప్పుడూ చెప్పేవారు. ‘అత్త మాదిరి నీవు కూడా డాక్టర్‌ కావాలమ్మా’ అంటూ నన్ను ప్రోత్సహించేవారు. ఎంత కష్టమైనా భరిస్తానని, నన్ను డాక్టర్‌గా చూడాలనేదే తన కోరికగా చెప్పుకొచ్చేవారు. 

నాన్నతోనే ఎక్కువ సమయం..  
నాన్నంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి నేనేమీ అడిగానా నాన్న తెచ్చిచ్చేవాడు. వాస్తవానికి నా పట్ల నాన్న చూపిస్తున్న ప్రేమలో మా కుటుంబంలోని పేదరికం నాకు కనిపించలేదు. ఐదో తరగతి వరకూ ప్రైవేట్‌ పాఠశాలలోనే చదువు చెప్పించారు. నా పుట్టిన రోజు నాడు మా తరగతిలోని సహచర విద్యార్థలందరికీ చాక్లెట్‌లు కొనిచ్చేవారు. పాఠశాలకు వెళ్లడం కాస్త ఆలస్యమైతే బైక్‌పై పిలుచుకెళ్లేవారు. సాయంకాలం ఇంటికి చేరుకోవడం కాస్త ఆలస్యమైనా వెంటనే వచ్చి నన్ను తీసుకెళ్లేవారు. నాకు జ్వరం వస్తే తనకే జ్వరమొచ్చినంతగా బాధపడేవారు. కాస్త దూరమైన అమరాపురంలోని ప్రైవేట్‌ డాక్టర్‌ వద్దకు పిలుచుకెళ్లి చికిత్సలు అందించేవారు. ప్రస్తుతం నేను పదోతరగతి చదువుతున్నా. అమరాపురానికి ట్యూషన్‌కు వెళుతున్నా. సాయంకాలం 5.30 గంటలకు స్నేహితులతో కలిసి ట్యూషన్‌కు ఆటోలో వెళ్లేదాన్ని. రాత్రి 8 గంటలకు ట్యూషన్‌ వదిలేవారు. అప్పుడు నాన్న బైకులో వచ్చి నన్ను తీసుకెళ్లేవారు. తాను పస్తులుంటూ మంచి ఆహారం నాకు తీసుకువచ్చి పెట్టేవారు. నాన్న బాటలోనే అమ్మ కూడా నా పట్ల ఎంతో ప్రేమగా ఉండేది. 

ఆ రోజు దిక్కుతోచలేదు
ఈ నెల 14న(శనివారం) నాన్న కాస్త నలతగా కనిపించాడు. ‘నాన్నా ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు’ అంటూ అడిగా. ‘ఏం లేదమ్మా.. బాగానే ఉన్నా’ అంటూ సమాధానమిచ్చారు. అయినా నా మనస్సు ఎందుకో చెడు సంకేతాలు ఇస్తూ వచ్చింది. నాన్నను వదిలి ఎక్కడకూ పోవాలని అనిపించలేదు. ఎందుకో నా చిన్నప్పటి నాన్న నన్ను పెంచిన తీరు గుర్తుకు వచ్చి కళ్లలో నాకు తెలియకుండానే నీళ్లు నిండుకున్నాయి. అది చూసి నాన్న చలించిపోయారు. ‘ఎందుకమ్మ అలా ఉన్నావు’ అంటూ నన్ను అడుగుతూనే బాగా చదువుకోవాలి. ఎంత కష్టమైనా భరిస్తాను. నీవు మాత్రం అత్తలా డాక్టర్‌వి కావాలి అంటూ నన్ను స్కూల్‌కు సాగనంపారు. ఆ తర్వాత నాన్న తోట వద్దకెళ్లారు. అక్కడ ఏం జరిగిందో ఏమో ఉన్నఫళంగా నాన్న గుండె పట్టుకుని కుప్పకూలిపోయారంట. అమ్మ, చుట్టుపక్కల రైతులు నాన్నను అమరాపురం ఆస్పత్రికి పిలుచుకెళ్లారు. అక్కడి డాక్టర్‌ సూచన మేరకు శిర ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు నాన్న మా నుంచి శాశ్వతంగా దూరమయ్యారు. అహర్నిశలు మా కోసం శ్రమించే నాన్న ఇక లేడనే వార్త సాయంత్రం నేను ఇంటికి వచ్చిన తర్వాత గానీ తెలియలేదు. ఒక్కసారిగా నాకు దిక్కుతోచలేదు. ఎంత సేపు ఏడ్చానో నాకే తెలియదు. 

అంత్యక్రియలకు కట్టుబాట్లు అడ్డు
మా నాన్నకు ముగ్గురు అన్నదమ్ములు. మా నాన్న అన్న శివకుమార్‌ హైదారాబాద్‌లో ఉంటారు. రెండో అన్న చంద్రమౌళి. తమ్ముడు హనుమంత రాయ. మా పెద్దనాన్నకు ఇద్దరు కుమారులు, రెండో పెద్దనాన్నకు ఒక కుమారుడు సంతానం. నాన్న చనిపోయిన తర్వాత అందరూ కలిశారు. అయితే నాకు అన్నగాని, తమ్ముళ్లు గానీ లేరు. దీంతో నాన్న అంత్యక్రియలు ఎవరు చేయాలని పెద్దలందరూ చర్చించుకోసాగారు. మా కుటుంబంలో మగ సంతానం ఇద్దరికి మించి అంత్యక్రియలు చేయరాదనే నిబంధన ఉందంట. ఇప్పటికే పెద్దనాన్న కుమారుడు వరుసకు మాకు తాత అయిన డాక్టర్‌ విజయ్‌కుమార్‌ అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో అతనితో నాన్న అంత్యక్రియలు చేయించడం కుదరదని పెద్దలు చెప్పేశారు. వ్యక్తిగత కారణాలతో మరో పెద్దనాన్న కుమారుడు ముందుకు రాలేకపోయాడు. దీంతో నాన్న అంత్యక్రియలు నేనే చేస్తానంటూ నాన్నమ్మ నాగమ్మతో చెప్పా. అదెలా చేస్తావమ్మా.. ఎవరూ ఒప్పుకోరూ అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. అయినా వినిపించుకోలేదు. నాన్నంటే నాకెంతో ఇష్టం. అంత్యక్రియలు నేనే చేస్తా అంటూ గట్టిగా కూర్చోవడంతో పెద్దలందరూ అంగీకరించారు. 

అంత్యక్రియల అనంతరం ఇబ్బంది పడ్డా
మా నాన్న అంత్యక్రియలు శనివారం(ఈ నెల 14న) నిర్వహించాను. ఆ తర్వాత కొంత ఇబ్బంది పడ్డా. ఎందుకంటే వైకుంఠ సమారాధన వరకు నేను ఎవరింటికీ పోకూడదు. కనీసం బడికి, ట్యూషన్‌కు సైతం వెళ్లలేక పోయా. సూతకం ఉండడం వల్ల ఎక్కడకూ పోకూడదంటూ పెద్దలు చెప్పారు. దీంతో ఇబ్బంది కలిగింది. అదీకాక కొన్ని రకాల పూజలు చేయడం, ఇతరుల ఇళ్లలో నీరు కూడా తాగకూడదనే నిబంధనలతో కాస్త ఇబ్బంది పడ్డా. నా స్నేహితులు కొంతమంది మాత్రమే వచ్చి పోయేవారు. మా ఇంట్లో చేసిన వంటను ఎవరూ తినేవారు కాదు. బంధువులు సైతం అసలు ముట్టలేదు. కేవలం అన్నదమ్ములు మాత్రమే తినేవారు. ఎందుకని అడిగితే నాన్న తద్దినం చేయలేదు కాబట్టి తినకూడదన్నారు.

తండ్రి కలను సాకారం చేస్తా
అమ్మను జాగ్రత్తగా చూసుకుంటా. నాన్న కల సాకారం చేయడానికైనా నా చదువును కొనసాగిస్తా. మరో 12 రోజుల్లో పదో తరగతి పరీక్షలు. నాన్న ఆశయ సాధన కోసం రోజూ పుస్తకాలతోనే గడుపుతున్నా. పుస్తకాల్లో నాన్నను చూసుకుంటున్నా. అత్త సహకారంతో డాక్టర్‌ వృత్తిలో స్థిరపడి నాన్న కల నెరవేరుస్తా. అమ్మ కూడా నా కోసమే జీవిస్తానంటోంది. నిజం చెప్పాలంటే మా అమ్మ, నాన్న పెళ్లి చేసుకుని 20 సంవత్సరాలు కావస్తున్నా.. ఇప్పటి వరకూ అమ్మ వాళ్ల పుట్టింటికి వెళ్లలేదు. నాన్నని అమ్మ పెళ్లి చేసుకోవడం అమ్మమ్మ వాళ్లకి ఇష్టంలేదు. దీంతో వారు అమ్మని ఏనాడూ ఇంటికి పిలవలేదు. తన భర్తకు గౌరవం ఇవ్వకపోవడంతో అమ్మ కూడా పుట్టింటికి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయింది. ఆఖరుకు నాన్న అంత్యక్రియలకు సైతం వాళ్లేవారూ రాలేదు. ‘నాన్న లేని లోటును నేను తీరుస్తా. నాన్న చెప్పినట్లు నీవు డాక్టర్‌వి కావాలి. వ్యవసాయ పనులు చేస్తూ ఎంత కష్టమైనా నిన్ను చదివిస్తా’ అంటూ అమ్మ చెబుతుంటే నాకు ఏడుపొచ్చేసింది.

మరిన్ని వార్తలు