మామ బారినుంచి రక్షించండి

4 Feb, 2014 05:12 IST|Sakshi

అనంతపురం రూరల్, న్యూస్‌లైన్: లైంగికంగా వేధించడమే కాకుండా, చంపుతానని బెదిరిస్తున్న మామ బారి నుంచి కాపాడాలంటూ ఫాతిమా అనే మహిళ విలేకరులను కోరింది. సోమవారం నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో తన కూతురు నజియా పర్వీన్‌తో కలసి ఆమె వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక రామచంద్రనగర్‌కు చెందిన జలీల్‌సాబ్ కుమారుడు మహబూబ్ బాషాతో 1987లో ఫాతిమాకు  వివాహం జరుగగా, రెండేళ్లకే భర్త మరణించాడు. అప్పటి నుంచి ఆమె అత్తవారింట్లోనే నివాసముంటోంది. కాగా, ఎనిమిది నెలల క్రితం ఆమె అత్త ఖాజాద్దీనా చనిపోయింది. అప్పటి నుంచి మామ ఆమెను లైంగికంగా వేధించడం ప్రారంభించాడు.
 
 ఈ విషయం తన ఆడపడుచులకు తెలియజేయగా, వారు ఆమెనే తప్పుపట్టడంతోపాటు బయటకు గెంటి వేశారు. దీంతో సమస్య పరిష్కరించాలంటూ ఎస్పీ సెంథిల్‌కుమార్‌కు వినతిత్రం సమర్పించగా, దర్యాప్తు చేయాలంటూ ఆయన త్రీటౌన్ సీఐ దేవానంద్‌ను ఆదేశించారు. అయితే, నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే సమయంలో ఉన్నత స్థాయిలో ఒత్తిళ్లు రావడంతో కేసు నమోదు చేసేందుకు పోలీసులు వెనుకడుగు వేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా నిందితునిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ఆమె కోరింది.

మరిన్ని వార్తలు