కుమార్తెలే..కుమారులై!

11 Mar, 2020 12:53 IST|Sakshi
తండ్రి పాడె వెంట నడుస్తున్న కుమార్తెలు సృజన, స్పందన

ప్రకాశం, పర్చూరు: ఇద్దరూ ఆడ బిడ్డలే.. అయితేనేం ఆ తండ్రి వారిని రెండు కళ్లనుకున్నారు. ఏ బిడ్డకు చిన్న కష్టమొచ్చినా తట్టుకునే వాడు కాదు. చిన్న తనంలో ఆడుకుంటూ బిడ్డలకు ఎదురుదెబ్బ తగిలితే ఆయన విలవిల్లాడిపోయేవారు. ‘హనుమంతురావు ఇద్దరూ ఆడపిల్లలే కదరా..అని ఎవరైనా అంటే’..అయితేనేం రా..అంటూ గట్టిగా సమాధానం చెప్పేవారు. ఇలా తండ్రి ప్రేమను నిండుగా కలిగిన ఆ కుమార్తెలు.. పెరిగేకొద్దీ ఆయన ఆకాంక్షలు గుర్తించారు. నాన్న కలలను రూపమిస్తూ ఇద్దరూ విద్యావంతులై ఆయన కళ్లలో ఆనందబాష్పాలు నింపారు. వృద్ధాప్యంలోకి వెళ్లిన ఆ తండ్రి ఊపిరి సోమవారం తెల్లవారు జామున 3 గంటలకు అర్ధంతరంగా ఆగిపోయింది. కర్మకాండలు పూర్తి చేయాలంటే వారసుడు లేరే అంటూ బంధువులు నసుగుతున్నారు. ఆ సమయంలో తండ్రిపోయిన పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కన్న బిడ్డలిద్దరూ  ముందుకొచ్చారు. తండ్రికి తామే అంత్యక్రియలు చేస్తామంటూ నడుం కట్టారు.

శ్మశాన వాటికలో తండ్రికి తలకొరివి పెడుతున్న కుమార్తె స్పందన
ఒక్కొక్క అడుగు పడే కొద్దీ తమను గుండెలపై పెట్టుకుని పెంచిన నాన్న జ్ఞాపకాలు కన్నీటి బొట్లయి రాలుతుండగా.. కుమార్తెలిద్దరూ ఆయన మృతదేహంతో నడిచారు. చివరకు తండ్రికి తలకొరివి పెట్టుకుని జన్మనిచ్చిన రుణం తీర్చుకున్నారు. కొడుకులైనా, కుమార్తెలైనా తల్లిదండ్రుల కన్నపేగు మమకారాన్ని మరువకూడదనే సత్యాన్ని చాటి చెప్పారు. వివరాలు.. పర్చూరు జూనియర్‌ కళాశాలలో ఉద్యోగిగా పనిచేసి పదవీ విరమణ పొందిన అడపాల హనుమంతురావు (64) సోమవారం తన స్వగృహంలో మృతి చెందాడు. ఆయనకు సృజన, స్పందన ఇద్దరు కుమార్తెలు. వీరిని తల్లిదండ్రులు వామపక్ష భావజాలంతో పెంచారు. పిల్లలను ఉన్నత చదువులు చదివించారు. పెద్ద కుమార్తె సృజన వివాహమై యూఎస్‌ఏలో ఉంటుండగా చిన్న కుమార్తె స్పందన ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులు చదువుకుంటున్నది. తండ్రి మరణవార్త విని ఇద్దరూ పర్చూరుకు చేరుకున్నారు. తండ్రికి తలకొరివి పెట్టేందుకు కొడుకుల లేకపోవడంతో తలకొరివి పెట్టడానికి కుమార్తెలు ముందుకొచ్చారు. పెద్ద కుమార్తె దహనక్రియకు ఉపయోగించే నిప్పుల కుంపటి పట్టుకోగా చిన్న కుమార్తె స్పందన పిండం పట్టుకొని తండ్రి పాడె వెంట నడిచారు. అనంతరం స్థానిక శ్మాశాన వాటికలో హనుమంతురావు భౌతిక కాయాన్ని కట్టెల పాడెపై ఉంచగా చిన్న కుమార్తె స్పందన తన తండ్రికి తలకొరివి పెట్టి కొడుకు లేని లోటును తీర్చుతూ తండ్రి రుణం తీర్చుకుంది.

మరిన్ని వార్తలు