డోంట్ కేర్‌గా డే కేర్ సెంటర్లు

30 Dec, 2014 01:46 IST|Sakshi

ఐసీడీఎస్‌కు బదలాయించేందుకు నిర్ణయం
మంజూరై ప్రారంభంకాని 19 సెంటర్లు


ఒంగోలు సెంట్రల్: జిల్లాలో ఎన్‌డీసీ (న్యూట్రిషన్ డే కేర్ సెంటర్లు)లు ఎక్కడున్నాయో ఎవరికీ అర్థం కావడం లేదు. నిరుపేద కుటుంబాలకు చెందిన గర్భిణులు, బాలింతలు, రెండేళ్లలోపు వయసున్న చిన్నారుల కోసం ఇందిరాక్రాంతిపథం ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా న్యూట్రిషన్ డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేశారు. అయితే ఈ కేంద్రాలు ఎక్కడ నడుస్తున్నాయో, ఎంత మందికి లబ్ధి చేకూరుతుందో తెలియని పరిస్థితి.

దీంతో వీటిని మహిళా శిశు సంక్షేమ శాఖకు అప్పగించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ నిర్ణయం కొద్ది రోజుల్లో వెలువడనుంది. 2006లో 16 సెంటర్లను రూ.40 లక్షలతో జిల్లాలో ఏర్పాటు చేశారు. ఎన్‌డీసీసీ సెంటర్లలో చిన్నారులు, గర్భిణులు, బాలింతలను చేర్చుకుని వారికి రక్తహీనత లేకుండా ఆరోగ్యవంతులుగా తయారు చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయాలి.

అనంతరం మూడు దఫాలుగా జిల్లావ్యాప్తంగా 139 గ్రామాలను ఎంపిక చేసి
అక్కడ ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో సెంటర్ ఏర్పాటుకు అయిన ఖర్చు రూ.3.48 లక్షలు. కానీ చాలా చోట్ల  పుస్తకాల్లో లెక్కలే కానీ చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు ఈ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.

ఎన్‌డీసీసీ సెంటర్లలో చిన్నారులను లాలించడం, ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం, గర్భిణులు, బాలింతలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, వారికి పోషకారం అందించడం చేయాలి.  చాలా సెంటర్లలో ఇవేవీ అమలు కావడం లేదు. గర్భిణులు, బాలింతలకు పాలు, గుడ్లు, మూడు పూటలా భోజనం అందించాలి. చిన్నారులకు పాలు ఇవ్వాలి. సెంటర్లో ఉదయం నుంచి సాయంత్రం ఆరోగ్య కార్యకర్త విధుల్లో ఉండాలి.

అధికారులు సూచించిన ఆహార పదార్థాలను తయారుచేసి ఇవ్వాలి. కానీ చాలా చోట్ల ఆహారం తయారు చేసేందుకు గ్యాస్ స్టవ్‌లు లేవు. కట్టెల పొయ్యితోనే ఆహారాన్ని వండి వారుస్తున్నారు. దీంతో ఏ లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేశారో అది నెరవేరడం లేదు. కొన్ని సెంటర్లలో ఆహార పదార్థాల సరుకులను గర్భిణులు, బాలింతలకు ఇచ్చి ఇంటి దగ్గరే వండుకు తినండని సెంటర్ల నిర్వాహకులు సలహా ఇస్తున్నారు.

ఎన్‌డీసీసీ కేంద్రాల కోసం విడుదలైన నిధులు ఏం చేస్తున్నారో కూడా అర్థం కావడం లేదు. ప్రారంభంలో రూ.3.48 కోట్లు, మరో రూ.47 లక్షలకు సబ్‌ప్లాన్ నిధులతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సబ్‌ప్లాన్ నిధులతో మత్స్యకార కుటుంబాలు ఎక్కువగా నివసించే 19 గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేయాలని డీఆర్‌డీఏ, ఐకేపీ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే ఇది గడచి ఏడాది కావస్తున్నా ప్రతిపాదనలు కార్యరూపం దాల్చడం లేదు. పైగా వీటిని కూడా ప్రభుత్వం రద్దు చేసినట్లు సమాచారం.

>
మరిన్ని వార్తలు