పట్టపగలు నగలు చోరీ

23 Jul, 2015 23:37 IST|Sakshi
పట్టపగలు నగలు చోరీ

షాపు తెరిచిన వెంటనే అగంతకుల ప్రవేశం
రెప్పపాటులో ఆభరణాలతో ఉడాయింపు
విలువ రూ.1.12కోట్లు పథకం ప్రకారమే చోరీ
 అవాక్కయిన యజమాని

 
తగరపువలస: తగరపువలస ప్రధానరహదారిలో సాయిపద్మ జ్యూయలరీ షాపులో గురువారం ఇద్దరు వ్యక్తులు నాలుగున్నర కిలోల బంగారు ఆభరణాలు చేజిక్కించుకుని ఉడాయించారు. వీటి విలువ రూ.1.12కోట్లు ఉంటుంది. సంఘటన వివరాలిలా.. జ్యువెలరీ షాపు పైభాగంలో యజమాని ఉప్పల రత్నశ్రీకాంత్ తోపాటు తండ్రి ఈశ్వరరావు, సోదరుడు సాయి వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. రోజూ షాపు మూసివేసిన తరువాత ఆభరణాలను ఇంట్లో పెట్టుకుని ఉదయం తెరచిన తరువాత తిరిగి తీసుకురావడం రత్నశ్రీకాంత్‌కు అలవాటు. ఎప్పటిలాగే గురువారం తొలుత ఆలయంలో దండం పెట్టుకుని తర్వాత ఆభరణాల బ్యాగుతో షాపునకు వచ్చారు. వచ్చి తలుపులు తెరిచారు. అందులో పనిచేసే అమ్మాయి తుడుస్తుండగా రత్నశ్రీకాంత్ లోపల సోఫాపై ఆభరణాలు ఉంచారు. దేముని పటం వద్దకు దండం పెట్టుకోవడానికి వెళ్లారు. అప్పటికే బయట ద్విచక్రవాహనంపై మాటువేసిన పాతికేళ్ల వయసున్న ఇద్దరు యువకులలో ఒకరు షాపులోకి చొరబడి రెప్పపాటు కాలంలో బ్యాగును అందుకున్నాడు. వెంటనే ద్విచక్రవాహనం వద్దకు ఒక్క ఉదుటున వచ్చి ఎక్కేశాడు.  ఇద్దరూ రాములమ్మ థియేటర్ వైపు ఉడాయించారు.

వీరిలో ఒకరు నిక్కరు వేసుకున్నట్టు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఇద్దరు ముఖానికి మాస్కులు వేసినట్లు తెలిసింది. యజమానితో పాటు పక్కనే షూ మార్టు షాపులో ఫర్నిచర్ పనులు చేస్తున్న ముగ్గురు వెంబడించినా ప్రయోజనం లేకపోయింది.  క్రైమ్ డీసీపీ టి. రవికుమార్ మూర్తి, ఈస్ట్ ఏసీపీ రమణ, సీసీఎస్ ఏసీపీ రమేష్, పద్మనాభం సీఐ కాంతారావు, భీమిలి ఎస్‌ఐ వై. అప్పారావు, క్రైమ్ హెడ్‌కానిస్టేబుల్ సీతాపతి సంఘటన స్థలంకు చేరుకున్నారు. ప్రత్యక్షసాక్షులను విచారించారు. నిందితుని ఊహాచిత్రాలను గీయించారు. విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం ప్రాంతాలతో పాటు చెక్‌పోస్టుల వద్ద తమ సిబ్బందిని అప్రమత్తం చేశారు.

దొంగలకు కలిసొచ్చిన అంశాలు
పట్టపగలు ఆభరణాలు అపహరణకు గురైనా షాపులో సీసీ కెమేరా ఆఫ్‌చేసి ఉంది. దీంతో నిందితులు ఆచూకీ లభించలేదు. సమీపంలోని పలు షాపులలో కూడా సీసీ కెమేరాలను పరిశీలించినా ఆనవాళ్లు దొరకలేదు.{పయాణికులతో రద్దీగా ఉండే ఈ కూడలిలో పుష్కరాలు కారణంగా బస్సులు లేకపోవడంతో బోసిపోయింది. అంబేద్కరు కూడలి ఖాళీగా ఉండటం, అదే సమయంలో వర్షం కురుస్తున్న కారణంగా నిందితులు తప్పించుకున్నట్టు తెలుస్తుంది.వీరు బ్యాగుతో ఆభరణాలు ద్విచక్రవాహనంపై పట్టుకుపోతున్నప్పుడు వెంబడించినవారు కూడా అరవలేదు.  పరుగెత్తడంతోనే ఇతరులకు అక్కడ ఏమి జరిగిందే తెలియరాలేదు. కనీసం ద్విచక్రవాహనం నంబర్‌కూడా చూడలేదని వెంబడించినవారు తెలిపారు.
 
 

మరిన్ని వార్తలు