అసలేం జరుగుతోంది..?

2 Aug, 2019 10:25 IST|Sakshi
ఆస్పత్రిలో బాధిత మహిళ తల్లితో మాట్లాడుతున్న డీసీహెచ్‌ఎస్‌ ఉషశ్రీ 

సాక్షి చీపురుపల్లి(విజయనగరం) : చీపురుపల్లి సీహెచ్‌సీలో వింత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. జిల్లా అధికారులకు, ఇక్కడి వైద్యులకు సమన్వయం లేకపోవడం ఒకెత్తయితే, అసలు ఆస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బంది ఎవరు ఏపని చేయాలో కూడా తెలియని స్థితి నెలకొంది. ఈ విషయం డీసీహెచ్‌ఎస్‌ ఉష శ్రీ ఎదుటే తేటతెల్లం కావడంతో ఆమె సైతం వైద్యులు తీరుపై అవాక్కయ్యారు. ఈ నెల 30న రాత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళా రోగిపై అక్కడ పని చేస్తున్న శానిటరీ సూపర్‌వైజర్‌ అసభ్యకరంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. ఆయనపై కేసు కూడా నమోదైంది. దీనిపై డీసీహెచ్‌ఎస్‌ ఉషశ్రీ దర్యాప్తుకు గురువారం సీహెచ్‌సీకి వచ్చారు. ఆమెకు వైద్యులు అసభ్యకరత ప్రవర్తన విషయం అంతటిని చెప్పకుండా దాచిపెట్టారు. అంతేకాదు ఇంత పెద్ద సంఘటన జరిగితే పోలీసులకు కూడా వైద్యులు ఫిర్యాదు చేయలేదు. మీడియాలో వచ్చిన వార్తలు చూసి రాష్ట్ర అధికారులు డీసీహెచ్‌ఎస్‌కు సమాచారం ఇచ్చారు.

అంతా మాయ..
మరో వింత ఏంటంటే అసభ్య ప్రవర్తనకు పాల్పడిన వ్యక్తిని 4 రోజుల ముందే తొలగించినట్లు కాంట్రాక్టర్‌ తనకు చెప్పాడని డీసీహెచ్‌ఎస్‌కు చెబుతుంటే, లేదు ఆ శానిటరీ సూపర్‌వైజర్‌ ఇంకా విధుల్లోనే ఉన్నాడని డాక్టర్లు చెబుతున్నారు. లేదు నాలుగు రోజుల క్రితమే సదరు సూపర్‌వైజర్‌ ఎస్‌కోట నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చాడని అశోక్‌ అనే మరో ఉద్యోగి డీసీహెచ్‌ఎస్‌కు చెప్పాడు. ఇదంతా చూస్తుంటే ఆస్పత్రిలో నిర్లక్ష్యం ఎలా రాజ్యమేలుతుందో అర్థం చేసుకోవచ్చని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇలాంటి సంఘటన జరిగినా ఉన్నతాధికారులకు ఇక్కడి నుంచి సమాచారం వెళ్లలేదంటే ఇంకా ఎంత పెద్ద విషయం చోటు చేసుకున్నా చెప్పరేమో అంటూ ప్రజలు నిట్టూరుస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ఆస్పత్రిని గాడిలో పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని ప్రజలు బహిరంగంగానే అనుకుంటున్నారు.

గాలికొదిలేస్తారా..?
దర్యాప్తు చేసేందుకు గురువారం సీహెచ్‌సీకి వచ్చిన డీసీహెచ్‌ఎస్‌ ఉషశ్రీ అక్కడి పరిస్థితులు చూసి డాక్టర్లు, సిబ్బందిపై విరుచుకుపడ్డారు. చికిత్సకు వచ్చిన రోగికి అన్యాయం జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేయరా..? ఉన్నతాధికారులకు విషయం చెప్పరా..? ఇది ప్రభుత్వ ఆస్పత్రి అనుకుంటున్నారా..? లేక ప్రైవేటు ఆస్పత్రి అనుకుంటున్నారా...? సెల్‌ఫోన్లు చూసుకునేందుకా ఇక్కడికి మీరు డ్యూటీకి వస్తుంది అంటూ సిబ్బందిపై ప్రశ్నల వర్షం కురిపించారు. లీగల్‌ విషయాలు పట్టించుకోకుండా ఆస్పత్రిని గాలికి వదిలేద్దామనుకుంటున్నారా..? అందరికి మెమోలు ఇస్తాను సమాధానం చెప్పండి అంటూ మండిపడ్డారు. అనంతరం సంబంధిత రోగి, ఆమె తల్లితో మాట్లాడి విషయాలు తెలుసుకున్నారు. ఆస్పత్రిలో ఇంత పెద్ద సంఘటన జరిగి రెండు రోజులు కావస్తున్నా సమాచారం ఇవ్వకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. 

ఒక్కొక్కరు ఒక్కోలా..
దర్యాప్తు చేస్తున్న సమయంలో తాను ఇటీవలే బదిలీపై వచ్చానని, ఆ రోజు పాత ఆస్పత్రికి విధులను వేరొకరికి అప్పగించేందుకు వెళ్లానని ప్రధాన వైద్యాధికారి నారాయణరావు, తాను హాఫ్‌లో ఉన్నానని ఇంకో సీనియర్‌ డాక్టర్‌ మహేంద్రగిరి తెలిపారు. ఉన్నా లేకున్నా..? విషయం తెలుసుకుని అయినా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత మీపై ఉందని డీసీహెచ్‌ఎస్‌ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం పోలీసులకు అయినా చెప్పాలి కదా అని అడిగారు. ఈ విషయం ద్వారా మీకు ఎవరికీ బాధ్యత లేదని అర్థమైందని ఆమె వ్యాఖ్యానించారు.  

ఇకపై భద్రత ప్రమాణాలు పాటిస్తాం..
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఇకపై భద్రత ప్రమాణాలు పాటిస్తాం. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, సెక్యూరిటీ గార్డులను నియమిస్తాం. చీపురుపల్లి సీహెచ్‌సీని 100 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు పంపాం. అలా జరిగితే పోలీస్‌ అవుట్‌ పోస్టు కూడా ఏర్పడుతుంది. ఇంత పెద్ద సంఘటన ఆస్పత్రిలో జరిగితే సమాచారం ఇవ్వకపోడం, మీడియాలో వచ్చిన వార్తలను చూసి ఉన్నతాధికారులు తనను అడగడం విచారకరమైన విషయమన్నారు. ఆ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ విధుల్లో లేడని కాంట్రాక్టర్, ఉన్నాడని వైద్యులు చెబుతున్నారు. అంటే ఆస్పత్రిలో నిర్లక్ష్యం రాజ్యం ఏలుతోంది. అందరిపైనా చర్యలు ఉంటాయి.
– ఉషశ్రీ, జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయ అధికారి, విజయనగరం.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు