హతమయ్యాడనుకున్న వ్యక్తి ప్రత్యక్షం

24 Jul, 2014 19:00 IST|Sakshi
హతమయ్యాడనుకున్న వ్యక్తి ప్రత్యక్షం

పరిగి: చనిపోయాడనుకున్న వ్యక్తి ఏడాది తర్వాత ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. ఇదే సమయంలో అప్పట్లో పోలీసులు ప్రవర్తించిన తీరుపై జనం మండిపడుతున్నారు. అనంతపురం జిల్లా పరిగి మండలం కోనాపురం శివారులోని జయమంగళి నదిలో 2013 మార్చి 20న గుర్తు తెలియని వ్యక్తి వృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. అప్పటి హిందూపురం రూరల్ సీఐ వేణుగోపాల్, పరిగి ఎస్‌ఐ సుధాకర్‌యాదవ్ కేసు నమోదు చేశారు.

విచారణ సందర్భంగా అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులు బతికున్న వ్యక్తినే చనిపోయాడని చెప్పి అమాయకులను కేసులో ఇరికించారు. గ్రామానికి చెందిన దాళప్ప బతుకుదెరువు కోసం బెంగళూరుకు వెళ్లగా.. జయమంగళి నదిలో లభించిన మృతదేహం అతడిదేనని తేల్చేశారు.

అదే గ్రామానికి సత్యనారాయణ అలియాస్ సత్తి, నరసింహమూర్తి, మోదా గేటుకు చెందిన జిక్రియా అతడిని చంపారని.. వారిని నిందితులుగా గుర్తించి ఈ ఏడాది జనవరి 23న కోర్టులో హాజరు పరిచారు. హత్యకు గురయ్యాడని పోలీసులు చెప్పిన దాళప్ప బుధవారం ప్రత్యక్షం కావడంతో అంతా అవాక్కయ్యారు. ఈ విషయమై పోలీసు ఉన్నతాధికారులు, మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు నిందితులుగా ఉన్న వారు, వారి కుటుంబసభ్యులు తెలిపారు.
 

మరిన్ని వార్తలు