డెడ్ స్టోరేజికి మరో 5అడుగులు

22 Mar, 2015 01:44 IST|Sakshi

మాచర్లటౌన్ : నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం రోజురోజుకి తగ్గిపోతోంది. రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లో లేకపోయినా రైతుల ప్రయోజనాల దృష్ట్యా అధికారులు కుడి, ఎడమ కాలువలకు నీటి విడుదల కొనసాగిస్తూనే ఉన్నారు. దీంతో జలాశయ నీటి మట్టం 515 అడుగులకు పడిపోయింది. మరో ఐదు అడుగులు తగ్గితే (510 అడుగులు) డెడ్ స్టోరేజి స్థాయికి చేరుకుంటుంది. ప్రతిరోజు సాగర్ ఎడమ కాలువకు ఎనిమిది వేల క్యూసెక్కులు, కుడికాలువకు ఐదు వేల క్యూసెక్కులు, నల్గొండ జిల్లాలోని ఎస్‌ఎల్‌బీసీకి 1350 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు.

దీంతో రోజుకి 15వేల నుంచి 20 వేల క్యూసెక్కుల నీటిని అవుట్ ఫ్లోగా విడుదల చేయాల్సి వస్తోంది. శ్రీశైలం జలాశయం నీటి మట్టం శనివారానికి 832.20 అడుగులకు చేరుకోవటంతో అక్కడి నుంచి నామమాత్రంగా 4348 టీఎంసీల నీటిని విడుదల చేశారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో 832 అడుగుల వద్ద కనిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ ఉంచాలని నిబంధన ఉంది. ఈ ప్రకారం ఇక శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేసే అవకాశంలేదు.
 
రోజుకు అరడుగు తగ్గుముఖం..
నాగార్జునసాగర్ జలాశయంలో ప్రతిరోజు అరడుగు నీరు తగ్గిపోతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే మరో వారంరోజుల్లో సాగర్ డెడ్ స్టోరేజికి చేరుకునే అవకాశం ఉంది. సాగర్ రిజర్వాయర్ నుంచి కుడికాలువకు ఈనెల 25వ తేదీ వరకే నీటిని విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతుండగా నెలాఖరు వరకు నీటిని కేటాయించాలని రైతులు కోరుతున్నారు.

తెలంగాణ ప్రాంతానికి రోజు 10 వేల క్యూసెక్కులకు పైగా నీటిని ఉపయోగిస్తూ కుడికాలువకు అందులో సగభాగం నీటిని వినియోగించుకుంటున్నారు. ఇలాంటి స్థితిలో సాగర్ రిజర్వాయర్ డెడ్ స్టోరేజికి చేరుకుంటే నీరివ్వలేమని తెలంగాణ ప్రభుత్వం చేతులెత్తే అవకాశాలు ఉండటంతో నీటి విడుదల ఎప్పటి వరకు ఉంటుందనే విషయంపై రైతుల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 

మరిన్ని వార్తలు