చనిపోయిందనుకున్న మహిళ ఆస్పత్రిలో ప్రత్యక్షం

19 Dec, 2018 10:56 IST|Sakshi

కొడుకు మాట ఫోన్‌లో విని స్పృహలోకి వచ్చిన మహిళ

ఉపాధి కోసం కువైట్‌ వెళ్లిన బాధితురాలి దీనగాథ

‘మహాసేన’ చొరవతో వెలుగులోకి..

మలికిపురం (రాజోలు): తూర్పుగోదావరి జిల్లా కె.గంగవరం మండలానికి చెందిన పుట్టి వెంకటలక్ష్మి 2016లో ఉపాధి కోసం కువైట్‌కు వెళ్లింది. కొద్ది రోజుల పాటు కుటుంబీకులతో ఫోన్‌లో మాట్లాడింది. క్రమంగా ఆమె నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో కుటుంబీకులు ఆమె ఆచూకీ కోసం వాకబు చేశారు. ఎటువంటి సమాచారం రాకపోవడంతో చనిపోయి ఉంటుందని భావించి అదే ఏడాది చివర్లో దిన కార్యక్రమాలు పూర్తి చేశారు. ఈ క్రమంలో కువైట్‌లో తూర్పుగోదావరి జిల్లా ప్రవాసాంధ్రులు నిర్వహిస్తున్న మహాసేన స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులకు ఈ నెల 10న ఫోన్‌ కాల్‌ వచ్చింది. అక్కడి ఓ ఆస్పత్రిలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక మహిళ అపస్మాకర స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న మహాసేన సభ్యులు అక్కడకు వెళ్లి వివరాలు సేకరించారు. మహాసేన టీం సభ్యులు ఆమె ఫొటోను కువైట్‌లోని వాట్సాప్‌ గ్రూపుల్లో పెట్టి, వివరాలు తెలుసుకున్నారు.

జిల్లా వాసుల ద్వారా ఆమె పాస్‌పోర్టు వివరాలు తెలుసుకుని, కుటుంబ సభ్యుల వివరాలు సేకరించి విషయాన్ని ఆమె భర్త రాఘవులు, కుమారుడు దుర్గాప్రసాద్‌కు తెలిపారు. అప్పటివరకూ వెంకటలక్ష్మి స్పృహలోకి కూడా రాలేదు. వెంకటలక్ష్మి కుమారుడు దుర్గాప్రసాద్‌ మహాసేన సభ్యులతో ఫోన్‌లో మాట్లాడగా..ఆ ఫోనును ఆమె చెవి వద్ద పెట్టడంతో కుమారుడి మాటలకు వెంకటలక్ష్మి స్పృహలోకి వచ్చింది. ఆమె ఎందుకు ఈ దుస్థితికి వెళ్లిందనేది చెప్పలేకపోతోందని మహాసేన సభ్యులు చెబుతున్నారు. ఆమెను భారత్‌కు తరలించేందుకు మహాసేన సభ్యులు కృషి చేస్తున్నారు. అక్కడి ప్రభుత్వం నుంచి న్యాయపరమైన అనుమతి పొందడంతోపాటు ప్రయాణ ఖర్చులకు రూ.2 లక్షల వరకు ఖర్చవుతుందని కువైట్‌ మహాసేన టీం అధ్యక్షుడు యల్లమిల్లి ప్రదీప్, సభ్యుడు గంటా సుధీర్‌ తెలిపారు. త్వరలో ఆమెను స్వదేశానికి పంపిస్తామని మహాసేన సభ్యులు చెప్పారు.

మరిన్ని వార్తలు