ప్రత్యేకహోదాపై ప్రభుత్వాలకు డెడ్‌లైన్

19 Aug, 2015 04:31 IST|Sakshi
ప్రత్యేకహోదాపై ప్రభుత్వాలకు డెడ్‌లైన్

- 20లోగా సమస్య పరిష్కరించాలి
- 21 తర్వాత రాష్ర్ట వ్యాప్తంగా ఆందోళన, నిరసన కార్యక్రమాలు
- రౌండ్‌టేబుల్ సమావేశంలో ప్రత్యేకహోదా సాధన సమితి
గాంధీనగర్ :
రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు ప్రత్యేకహోదా, విభజన హామీల సాధన సమితి డెడ్‌లైన్ విధించింది. ఈనెల 20వతేదీన ప్రధాని నరేంద్రమోదీతో భేటి అవుతున్న చంద్రబాబు ఆయన నుంచి స్పష్టమైన ప్రకటన చేయించాలని డిమాండ్ చేసింది. ప్రత్యేక హోదా , విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో విజయవాడలోని ఐవీ ప్యాలెస్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం మంగళవారం జరిగింది.

సమావేశంలో పాల్గొన్న సీపీఐ రాష్ర్ట కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ సీఎం చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం సస్యశ్యామలం కాదని పదే పదే చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 14నెలల కాలంలో చంద్రబాబు రాష్ట్రానికి ఏం అడిగారు.. ఇప్పటికి ఏం సాధించారు అనే అంశాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎనిమిది సార్లు మోదీని కలిసిన చంద్రబాబు డప్పుకొట్టుకోవడం తప్ప వాస్తవానికి సాధించిదేమీ లేదన్నారు. మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి అన్ని విధాల అన్యాయం చేస్తోందన్నారు. ఈనెల 11న జరిగిన బంద్ తర్వాత ముఖ్యమంత్రిలో చలనం వచ్చిందని, అందువల్లే ఆయన 20న ప్రధానిని కలుస్తున్నారన్నారు.

ప్రధాని మోదీ, చంద్రబాబు మధ్య ఆరోజున జరిగే సంభాషణను బహిర్గతం చేయాలని కోరారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రకటన రాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామన్నారు. అనంతరం వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని విభజించాలని శ్రీకృష్ణ కమిటీ చెప్పలేదని, మూడు పంటలు పండే భూముల్లో రాజధాని ఏర్పాటు చేయొద్దని అందరూ చెప్పారని, అయినా ప్రభుత్వం ఇవేవీ పట్టించుకోకుండా ముందుకు వెళ్తోందన్నారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరితే మాత్రం ప్రణాళికా సంఘానికి ముడిపెట్టడం సరికాదన్నారు.  

ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యాన జరిగే ఉద్యమాల్లో ఉద్యోగ సంఘాలు కూడా పాల్గొనాలని ఆయన కోరారు. మాజీ మంత్రి వడ్డేశోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ విభజన చట్టంలోని షెడ్యూల్ 9,10 లో పేర్కొన్న ఆస్తుల విభజనపై రాష్ర్ట ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. ఆంధ్రమేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ర్ట అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య, వంగల సుబ్బారావు, లారీ ఓనర్స్ అసోసియేషన్  నాయకులు ఈశ్వరయ్య, మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్మత్స దుర్గాభవాని, నగర సీపీఐ కార్యదర్శి దోనేపూడి శంకర్, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
 
తీర్మానాలు ఇవే..
రౌండ్‌టేబుల్ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తీసుకున్న తీర్మానాలను ఆంధ్రమేధావులు ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ వెల్లడించారు. ఈనెల 20న ప్రధానితో సీఎం భేటి తర్వాత ఆమోదయోగ్యమైన ప్రకటన రాకపోతే 13జిల్లాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని తీర్మానించినట్లు చెప్పారు. ఈనెల 21నుంచి ప్రత్యేక హోదా వలన కలిగే ప్రయోజనాలపై ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమాలు నిర్వహించాలని, రాష్ట్ర శాసనసభలో ప్రత్యేక హోదాకు అనుకూలంగా తీర్మానం చేయాలని, పార్లమెంట్  సభ్యులు ఢిల్లీలో ఉండి పోరాడాలని, ప్రజాప్రతినిధులకు గులాబీలు ఇచ్చి నిరసన తెలియజేయాలని తీర్మానించినట్లు చెప్పారు. అప్పటికీ స్పష్టత రాకపోతే  రాష్ట్ర పతికి సమస్యను విన్నవించేందుకు రాష్ట్రపతి భవన్ వద్ద నిరసన తెలియజేస్తామని వివరించారు.

మరిన్ని వార్తలు