వైఎస్సార్‌ వాహనమిత్ర పథకానికి నేడు తుది గడువు

31 Oct, 2019 05:50 IST|Sakshi

లబ్ధిదారుల ఖాతాల్లో ఇప్పటికే రూ.173.10 కోట్లు జమ

నేటి వరకు గడువు పెంపుతో మరో 50 వేల మంది దరఖాస్తు 

అర్హులైన వారికి 15వ తేదీలోగా రూ.10 వేల సాయం

సాక్షి, అమరావతి :  ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లకు ఏడాదికి రూ.10 వేలు అందించే ‘వైఎస్సార్‌ వాహన మిత్ర’ పథకం గడువు నేటితో (గురువారం)తో ముగియనుంది. అర్హత ఉన్న వారికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో అవకాశాన్ని కల్పించడంతో రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల మంది బుధవారం రాత్రి వరకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ సంఖ్య గురువారానికి మరికొంత పెరిగే అవకాశం ఉందని రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఆటో, ట్యాక్సీ, క్యాబ్‌ డ్రైవర్లకు ఫిట్‌నెస్, మరమ్మతులు, బీమా ఖర్చులకు ఏటా రూ.10 వేల వంతున ఐదేళ్లకు రూ.50 వేలు ఇస్తామని సీఎం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి బడ్జెట్‌లో రూ.400 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద సెప్టెంబర్‌ 14 నుంచి 25వ తేదీ వరకు రవాణా శాఖ అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,75,352 దరఖాస్తులు అందగా, 1,73,102 మందిని అర్హులుగా ఎంపిక చేసి, ఈ నెల 5న వారి బ్యాంకు ఖాతాల్లో రూ.10 వేల చొప్పున జమ చేశారు.  

ఐదేళ్ల పాటు ఇస్తామని సీఎం హామీ
గడువు పెంచక ముందు ఎంపిక చేసిన లబ్ధిదారులకు రూ.173.10 కోట్లు వారి ఖాతాల్లోకి చేరాయి. గురువారంతో దరఖాస్తుల గడువు ముగియనుంది. జిల్లాల వారీగా అందిన దరఖాస్తులను గ్రామ వలంటీరు/పంచాయతీ కార్యదర్శి/వార్డు వలంటీరు/బిల్‌ కలెక్టరు క్షేత్ర స్ధాయిలో పరిశీలిస్తారు. నవంబరు 8వ తేదీలోగా ఎంపీడీవో/మున్సిపల్‌ కమిషనర్‌ ఈ దరఖాస్తుల్ని ఆమోదిస్తారు. నవంబరు 10లోగా లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్‌ ఆమోదం తెలుపుతారు. నవంబర్‌ 15లోగా గడువు పెంపు తర్వాత ఎంపిక చేసిన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు రూ.10 వేలు విడుదల చేస్తారు. నవంబర్‌ 20లోగా జమ చేసిన రూ.10 వేల రశీదు, సీఎం సందేశ పత్రం లబ్ధిదారులకు అందుతుంది.   

మరిన్ని వార్తలు