విడ‘తీయని’ బంధం

23 Aug, 2019 08:56 IST|Sakshi
రామచంద్ర నాయుడు, అచ్చమ్మల(ఫైల్‌) 

భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య మృతి

కన్నీరుమున్నీరైన కీనాటంపల్లె

70 ఏళ్ల వైవాహిక జీవితం ఒడిదుడుకుల ప్రయాణం చలించని మనోధైర్యం ప్రేమానురాగాలు అనంతం అలసి ఆగెను ఓ హృదయం విలవిల్లాడెను మరో ప్రాణం ఆ హృదయాన్నే అనుసరించిన వైనం ఓడి గెలిచిన మూడుముళ్ల ‘బంధం’. వారిదో ఉన్నతమైన కుటుంబం. వ్యాపారాలతో మంచి స్థాయికి ఎదిగిన ఆ కుటుంబానికి పెద్ద దిక్కు ఆయనే. పలువురికి మార్గదర్శకంగా ఉంటూ అందరినీ ముందుకు నడిపించిన ఆ పెద్దాయన అనారోగ్యంతో మృతి చెందారు. ఈక్రమంలో ఏడు దశాబ్దాల పైచిలుకు జీవనయానంలో తోడూ–నీడలా ఉన్న భర్త  మరణాన్ని ఆ ఇల్లాలు జీర్ణించుకోలేకపోయింది. భర్త జ్ఞాపకాలతో కుమిలిపోతూ రెండు రోజుల తరువాత సాంగ్యం పెడుతున్న సమయంలో అలాగే ఒరిగిపోయి కన్నుమూసింది. భర్త మరణాన్ని జీర్ణించుకోలేకపోయింది. తనతో నడిచిన ఏడడుగుల బంధాన్ని గుర్తుచేసుకుని కుమిలిపోయింది. రెండో రోజు భర్తబాటలోనే తనువు చాలించింది. ఈ విషాద ఘటన యాదమరి మండలం కీనాటం పల్లెలో గురువారం చోటు చేసుకుంది.
 
సాక్షి, యాదమరి: మండలంలోని కీనాటంపల్లెకు చెందిన రామచంద్రనాయుడు(96)ది పే..ద్ద కుటుంబం. ఆయనకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె, ఐదుగురు మనవరాళ్లు, ముగ్గురు మనవళ్లు, మునివరాళ్లు ముగ్గురు ఉన్నారు. పెద్దకుమారుడు సుబ్రమణ్యం కీనాటంపల్లెలోనే వ్యవసాయంతో స్థిరపడ్డారు. రెండవ కొడుకు కృష్ణమూర్తి తండ్రి తాలూకు వారసత్వాన్ని అందిపుచ్చుకుని చిత్తూరులో మామిడి కాయల మండీ వ్యాపారిగా స్థిరపడ్డారు. కృష్ణమూర్తికి రామచంద్రనాయుడు వ్యాపారపరంగా చేదోడువాదోడుగా ఉంటున్నారు. వివాహాల అనంత రం వేర్వేరు ప్రాంతాల్లో కుమారులు, కుమార్తె స్థిరపడినా ప్రతి పండగకూ అందరూ తమ పిల్లలతో సహా వచ్చి కలవాల్సిందే. కీనాటంపల్లెలో బంధువులు, ఆత్మీయుల మధ్య సందడి చేయాల్సిందే. ఇదీ రామచంద్రనాయుడి నియ మం. ఊరిపెద్దగా ఉన్న ఆయన గ్రామానికి సైతం తనవంతు సేవ చేశారు.  ‘కీనాటంపల్లె పెద్దాయన’గా పేరు తెచ్చుకున్నారు.

రామచంద్రనాయుడు దంపతులను చూస్తే పార్వతీపరమేశ్వరులను చూసినట్టు ఉంటుందని గ్రామస్తులు వారి అన్యోన్య దాంపత్యం గురించి చెప్పడం కద్దు! ఈ నేపథ్యంలో ఈ నెల 19న సోమవారం అనారోగ్యంతో ఆ పెద్దాయన కన్నుమూశారు. గ్రామం పెద్ద దిక్కును కోల్పోయింది. మంగళవారం దహనక్రియలు నిర్వహించారు. బుధవా రం పాలు పోశారు. తన భర్త చనిపోయిన రోజు నుంచి అచ్చమ్మ(87) తీవ్రంగా కుంగిపోయిం ది. నిద్రపట్టేది కాదు. ఎక్కడో శూన్యంలోకి ఆమె చూపులు నిర్వికారంగా! ఆమె కళ్లల్లో ఎప్పుడూ దుఃఖమేఘాలే. ఈ నేపథ్యంలో  అచ్చమ్మకు  పుట్టింటినుంచి గురువారం సాంగ్యం తెచ్చారు.  పసుపు, కుంకుమ, గాజుల సాంగ్యం ఆమెకు పెడుతుండగా  భర్త జ్ఞాపకాలతో ఆమె గుండె పగిలింది. నుదుట పాత రూపాయి బిళ్లంత కుంకుమ బొట్టు పెట్టి, ముఖానికి, చేతులకు పసుపు రాస్తుండగా కన్నీటిపర్యంతమవుతూ ఆమె పక్కకు ఒరిగిపోయింది. వెంటనే ఆమెను హుటాహుటిన చిత్తూరు ఆసుపత్రికి తరలించా రు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో కుటుంబ సభ్యులతో పాటు ఆ గ్రామం మరోసారి శోకసంద్రమైంది. 

ఇలాంటి సంఘటన మూడోసారి..
కీనాటంపల్లెలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం ఇది మూడవది. ఐదేళ్ల క్రితం డాక్టర్‌ గోపాల్‌నాయుడు భార్య గుర్రమ్మ అనారోగ్యంతో చనిపోయారు. 13వ రోజు కర్మక్రియలు చేస్తున్న రోజే ఆమె భర్త కూడా ఇలాగే బంధువుల నడుమ ప్రాణం విడిచారు. రెండేళ్ల క్రితం గ్రామంలో పార్థసారథి నాయుడు అనారోగ్యంతో చనిపోగా, అదే రోజు సాయంత్రం అతని అన్న జయశంకర్‌ నాయుడు తమ్ముడినే తలచుకుని కుమిలిపోతూ చనిపోయారు. ప్రస్తుతం రామచంద్రనాయుడు, అతని భార్య అలాగే చనిపోవడం యాధృచ్ఛికమే అయినప్పటికీ గుండె లోతుల్లో గూడుకట్టుకున్న  ప్రేమానుబంధాలకు, పది మందికీ పంచే ఆత్మీయతానురాగాలకు నిలువెత్తు దర్పణమే. ఈ ఉదంతాల నుంచి ఇప్పటి తరాలు నేర్చుకోవాల్సిందే ఎంతో ఉందని అన్యాపదేశంగా చెప్పినట్లే ఉంది.

>
మరిన్ని వార్తలు