సీమాంధ్ర, తెలంగాణ నేతల వ్యూహ, ప్రతివ్యూహాలు

30 Jan, 2014 10:07 IST|Sakshi

హైదరాబాద్  : రాష్ట్ర విభజన బిల్లుపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పొడగించిన గడువు నేటితో ముగుస్తున్న నేపధ్యంలో సర్వత్రా ఉత్కంఠ రేగుతోంది. ఎక్కడచూసినా విభజన బిల్లుపైనే చర్చ జరుగుతోంది.  అన్నిపార్టీల నేతలూ గురువారం అసెంబ్లీలో, శాసనమండలిలో అనుసరించాల్సిన వ్యూహ, ప్రతివ్యూహాలపై చర్చల్లో  తలమునకలయ్యారు. బిల్లుపై గడువు ఇవాళ్టితో ముగియటంతో  అసెంబ్లీ సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది.

బిల్లుపై చర్చకు మరింత గడువు పెంచాలంటూ ముఖ్యమంత్రితో పాటు పలు పార్టీలు రాసిన లేఖలపై రాష్ట్రపతి నుంచి ఇంతవరకు ఎలాంటి సమాచారం రాలేదు. దీనిపై ఉదయం 11 గంటల్లోపు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆతర్వాతే ఓటింగ్పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సభలో తీవ్ర గందరగోళ పరిస్థితులుండటంతో స్పీకర్ ఎలా వ్యవహరిస్తారన్నదే ప్రస్తుతం కీలకంగా మారింది.

మరోవైపు సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత నేతలు పోటా పోటీగా భేటీలు జరుపుతున్నారు. ఓటింగ్ పెట్టాలని సీమాంధ్ర, ఓటింగ్ జరగకుండా చేయాలని తెలంగాణ ప్రాంత నేతలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. పార్టీలకు అతీతంగా అసెంబ్లీ కమిటీ హాల్లో చర్చలు జరుపుతున్నారు.

మరిన్ని వార్తలు