కరువు, తుపాన్లు వచ్చినా 11 శాతం వృద్ధి రేటు!

7 Feb, 2019 03:01 IST|Sakshi

గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చలో సీఎం చంద్రబాబు

నల్లధనాన్ని తెచ్చి పేదలకు రూ.15 లక్షల చొప్పున ఇస్తానన్న మోదీ మాట్లాడరేం? 

రుణమాఫీకి సహకరించకపోగా డబ్బులివ్వొద్దని ఆర్బీఐకి చెప్పారు

కుట్రలు చేస్తున్నారంటూ విపక్ష నేతపై అసెంబ్లీలో సీఎం నిందారోపణలు

సాక్షి, అమరావతి: కేంద్రం సహకరించకుండా అడుగడుగునా అడ్డుపడినా అభివృద్ధిలో దూసుకెళ్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో కరువులు, తుపాన్లు వచ్చినప్పటికీ 11 శాతం వృద్ధి రేటును సాధించామన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో (ఎఫ్‌డీఐ) అత్యధికంగా రాష్ట్రంలో 300 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా బుధవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ నల్ల ధనాన్ని వెనక్కి తెచ్చి పేదల ఖాతాల్లో రూ. 15 లక్షలు చొప్పున జమ చేస్తానన్న నరేంద్ర మోదీ మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రైతులకు రుణమాఫీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ. 1.50 లక్షలు చొప్పున ప్రకటిస్తే కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద కేవలం రూ. 6 వేలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొంటోందని విమర్శించారు. రుణమాఫీకి సహకరించాలని ప్రధాని మోదీని కోరితే అందుకు సహకరించకపోగా డబ్బులు ఇవ్వొద్దంటూ ఆర్బీఐకి చెప్పారని ఆరోపించారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రజల కనీస అవసరాలను తీర్చే ప్రయత్నమే చేయలేదన్నారు. పేదలపై మానవత్వం చూపకుండా సబ్సిడీ చక్కెరను సైతం రద్దు చేసిందన్నారు. మహిళలకు వారి తల్లిదండ్రులు పసుపు కుంకుమ ఇచ్చినట్లే తాను ఒక అన్నగా ఈ పథకాన్ని నిరంతరం కొనసాగిస్తానన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా బీసీల కోసం 20 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు కేటాయించకపోయినా రాత్రింబవళ్లు పనులు జరుగుతున్నాయన్నారు. పోలవరం డీపీఆర్‌–2ను కేంద్రం ఆమోదించకుంటే ఈనెల 11వతేదీన ఢిల్లీలో నిర్వహించే ధర్నాలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తామని ప్రకటించారు. ఈ నెలాఖరులోగా కృష్ణా జలాలను మడకశిరకు తరలిస్తామన్నారు.   

నిండుసభ సాక్షిగా విపక్ష నేతపై నిందారోపణలు..
రాష్ట్రంలో నీతిమాలిన ప్రతిపక్షం ఉందంటూ శాసనసభ సాక్షిగా సీఎం చంద్రబాబు నిందారోపణలు, దూషణలకు దిగారు. రాష్ట్ర అభివృద్ధికి ఏమాత్రం సహకరించకుండా తప్పుడు పనులు చేస్తున్నారని ఆరోపించారు. కుట్రలు, కుతంత్రాలు, అశాంతిని సృష్టిస్తున్నారన్నారు.  పోలవరం కాలువను తెగ్గొట్టడమే కాకుండా తునిలో రైలుకు నిప్పు పెట్టారన్నారు. ‘కాపులకు రిజర్వేషన్లు ఇచ్చే అంశం తన పరిధిలో లేదని జగన్‌ అన్నారు... తునిలో రైలుకు నిప్పు పెట్టేది మాత్రం నీ పరిధిలో ఉందా?’ అంటూ సీఎం వ్యక్తిగత విమర్శలు చేశారు. రాష్ట్రంలో అసలు ప్రతిపక్షం ఉందా...? వారికి ప్రజలు ఓట్లు ఎందుకు వేశారో అర్థం కావడం లేదన్నారు. ప్రజా సమస్యలు అసెంబ్లీలో చర్చించాల్సి ఉన్నా వారు రావడం లేదు, అలాంటప్పుడు జీతాలెందుకు తీసుకోవాలి? అని ప్రశ్నించారు. కేసుల భయంతోనే ప్రత్యేక హోదా గురించి ప్రధాని మోదీని గట్టిగా అడగటం లేదన్నారు. ఎన్నికలొస్తున్నాయని భయపెట్టేందుకు పశ్చిమ బెంగాల్‌లో కేంద్రం సీబీఐతో దాడులు చేయిస్తే ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఎందుకు ఖండించలేదన్నారు. మోదీ ఫ్రంట్‌ పెట్టించి భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రత్యర్థులపై కేంద్ర ప్రభుత్వం ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు చేసి భయబ్రాంతులకు గురి చేస్తోందన్నారు. కాంగ్రెస్‌ హయాంలో పారిశ్రామిక వేత్తలను బెదిరించడం వల్లే విశాఖలో ఏర్పాటు చేయాల్సిన ఫోక్స్‌ వ్యాగన్‌ కంపెనీ పుణెకు తరలి వెళ్లిందన్నారు. బొత్స సత్యనారాయణ వాటాల కోసం బెదిరించడం వల్లే పరిశ్రమ రాకుండా పోయిందని ఆరోపించారు.  

17 లక్షల పంపుసెట్లను సోలార్‌కు మారుస్తాం..
దేశంలో విద్యుత్‌ సంస్కరణలకు ఆద్యుడిని తానేనని, ఇప్పుడు చేపట్టే వినూత్న కార్యక్రమాలతో ప్రపంచం తనను చూసి నేర్చుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘పవరింగ్‌ ఏపీ’ పేరిట విజయవాడలో రెండు రోజులు పాటు జరిగిన ఎనర్జీ ఇన్నోవేషన్‌ ముగింపు సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 50,000 పంపుసెట్లను సోలార్‌ పంపుసెట్లుగా మార్చామని, మొత్తం 17 లక్షల పంపుసెట్లను సోలార్‌ పంపుసెట్లుగా మార్చడమే కాకుండా మిగులు విద్యుత్‌ను ప్రభుత్వానికి విక్రయించేలా కొత్త పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. పంపుసెట్ల నుంచి వచ్చే మిగులు విద్యుత్‌ను రైతుల నుంచి యూనిట్‌ రూ.1.50 చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు. దేశంలో టెలికాం సంస్కరణలను కూడా తానే చేపట్టానని, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌(ఈవోడీబీ)లో వరుసగా రెండేళ్లుగా మొదటి స్థానంలో ఉన్నట్లు తెలిపారు.   

మరిన్ని వార్తలు