ప్రపంచస్థాయిలో రాణించిన ‘లాస్య’

29 May, 2017 02:18 IST|Sakshi
ప్రపంచస్థాయిలో రాణించిన ‘లాస్య’

వ్యక్తిత్వ వికాస పోటీల్లో ప్రథమ బహుమతి
ఆమె అమలాపురంవాసి మనవరాలు


అమలాపురం టౌన్‌ : ఏటా అమెరికాలో జరిగే ప్రపంచస్థాయి వ్యక్తిత్వ వికాస పోటీల్లో తెలుగు అమ్మాయి మంథా లాస్య విజేతగా నిలిచింది. అమెరికాలో 9వ తరగతి చదువుతున్న లాస్య అమలాపురం వాసి మనవరాలే. ఇంతటి ప్రతిష్టాత్మకమైన బహుమతిని సాధించిన మనవరాలి గురించి అమలాపురం ఎస్‌కేబీఆర్‌ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్‌ మంథా సాంబశివశాస్త్రి విలేకర్లకు ఆదివారం చెప్పారు. అమెరికాలోని డిస్ట్రిబ్యూటెడ్‌ ఎడ్యుకేషనల్‌ క్లబ్‌ ఆఫ్‌ అమెరికా(డీఈసీఏ) ఏటా ప్రపంచవ్యాప్తంగా తొమ్మిదో తరగతి నుంచి పన్నెండో తరగతి చదువుతున్న విద్యార్థులకు మేనేజ్‌మెంట్‌ విభాగంలో వ్యక్తిత్వ వికాసంపై పోటీ నిర్వహిస్తుంది.

 ఈ సంవత్సరం కాలిఫోర్నియాలోని అనాహిమ్‌లో నిర్వహించిన ఇంటర్నేషనల్‌ కెరీర్‌ కాన్ఫరెన్సులో లాస్య ప్రథమ స్థానంలో నిలిచి ట్రోఫీతో పాటు మూడు పతకాలు కైవసం చేసుకుంది. లాస్య అమెరికాలోని మిషిగాన్‌ రాష్ట్రంలో డెట్రాయిట్‌ దగ్గరలో గల శార్త్‌ విల్‌ హైస్కూలులో తొమ్మిదో తరగతి చదువుతోంది. ప్రపంచవ్యాప్తంగా 18 వేల విద్యార్థులు పోటీ పడ్డ ఈ పరీక్షలో లాస్య  విజేతగా నిలిచినందుకు ఆమె తల్లిదండ్రులు  గీతా, వేణుమాధవ్‌లను డీఈసీఏ అభినందించింది.

ఆ స్కూలు చరిత్రలో 9వ గ్రేడ్‌ విద్యార్థి అయిన లాస్య బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ ఆర్థిక సలహా సర్వీసెస్‌లో ఇలాంటి ప్రతిష్టాత్మక బహుమతి ఇప్పటి వరకూ ఎవరూ పొందలేదని శార్త్‌ విల్‌ స్కూలు యాజమాన్యం ప్రకటించింది. లాస్య గతంలో 5, 8 తరగతుల్లో చూపిన ప్రతిభకు అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా నుంచి ప్రశంసా పత్రాలు అందుకుంది. పలు సైన్స్‌ ఒలింపియాడ్‌లలో బంగారు పతకాలు సాధించింది. ప్రస్తుతం వైనీ ఓక్‌ల్యాండ్‌ సైన్స్‌ ఒలింపియాడ్‌  బోర్డులో మెంబరుగా, లివోనియా యూత్‌ సింఫనీ ఆర్కెస్ట్రాలో వయోలిన్‌ కళాకారిణిగా పనిచేస్తోంది.

 డ్రాయింగ్, స్విమ్మింగ్‌లలో అభిరుచి గల లాస్య తేట తెలుగులో చక్కగా మాట్లాడగలదు, రాయగలదు. ప్రతి ఆదివారం అమెరికాలో జరిగే సత్యసాయి ఎడ్యుకేషనల్‌ క్లాస్‌లకు హాజరవుతూ వ్యక్తిత్వ వికాసం, సామాజిక చైతన్యంపై పరిణితి పొందుతోందని సాంబశివశాస్త్రి చెప్పా రు. లాస్య తల్లిదండ్రులు మిషిగాన్‌లోని ఓ యూనివర్సిటీలో ఉద్యోగులుగా 20 ఏళ్లుగా అక్కడే స్థిరపడ్డారు.

మరిన్ని వార్తలు