దశాబ్దాల దగా

27 Aug, 2013 06:19 IST|Sakshi

సాక్షి, కడప: రాయలసీమలో సాధారణ వర్షపాతం 750 మిల్లీమీటర్ల కంటే తక్కువ. వర్షాలు ఎక్కువగా ఉండి, భూగర్భజలాలు అధికంగా లభిస్తున్న సముద్రతీర ప్రాంతాలైన తూర్పుగోదావరి జిల్లాలో 75 శాతం, నెల్లూరులో 77శాతం, పశ్చిమగోదావరిలో 64 శాతం, గుంటూరులో 58 శాతం, కృష్ణాజిల్లాలో 64 శాతం సేద్యపునీటి వసతులు ఉన్నాయి. అనంతపురం జిల్లాలో 14 శాతం, మహబూబ్‌నగర్‌లో 24 శాతం, చిత్తూరు, నల్గొండలో 41 శాతం, వైఎస్సార్‌జిల్లాలో 28 శాతం, కర్నూలు జిల్లాలో 20 శాతం మాత్రమే నీటి వసతులు ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో సాగునీటి కేటాయింపుల్లో ‘సీమ’కు ప్రాధాన్యత కల్పించాల్సిన ప్రభుత్వాలు కృష్ణాజలాల పంపిణీలో కొన్నేళ్లుగా అసమానతలు ప్రదర్శిస్తున్నారు.
 
  రాష్ట్రంలో అనంతపురం, చిత్తూరు, కర్నూలు, కడప, మహబూబ్‌నగర్, నల్గొండ, ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, కంభం, మార్కాపురం ప్రాంతాలు కరువుపీడిత ప్రాంతాలు. ఇందులో 60శాతం కరువు ప్రాంతాలు ‘సీమ’లోనే ఉన్నాయనేది స్పష్టమవుతోంది.
 
 కరువుపీడిత ప్రాంతానికి అన్యాయం:
 రాష్ట్రానికి కృష్ణాజలాల్లో 811 టీఎంసీలు, గోదావరిలో 1495 టీఎంసీలను గుల్హతీ, బచావత్ కమిషన్లు కేటాయించాయి. ఇవికాక ఇతర 28 నదుల ద్వారా 98 టీఎంసీలు లభిస్తున్నాయి. అంటే 2,404 టీఎంసీల జలాలు రాష్ట్రానికి దక్కుతున్నాయి. ఇందులో కృష్ణా ట్రిబ్యునల్‌లోని 811 టీఎంసీలలో  రాయలసీమకు కేవలం 122.70 టీఎంసీలను కేటాయించారు. తెలంగాణకు 266.86, ఆంధ్రకు 377.44 టీఎంసీలు కేటాయించారు. కరువు ప్రాంతాలకు సామాజిక న్యాయం, వెనుకబాటుతనం ఆధారంగా నీటి కేటాయింపులు జరగలేదనేది ఈ లెక్కలను బట్టే తెలుస్తుంది. ఈ కేటాయింపులను పెంచాలని  దశాబ్దాలుగా ‘సీమ’వాసులు పోరాటం చేస్తున్నారు. అయినా పాలకులు కరుణించలేదు.  ‘సీమ’లో 98.95 లక్షల ఎకరాల సాగుకు అనువైన భూమి ఉంటే 15.08 లక్షల ఎకరాలు మాత్రమే సాగవుతోంది. వైఎస్ చేపట్టిన జలయజ్ఞం పూర్తయితే  17.36 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగులోకి వస్తుంది.
 
 ఈ కేటాయింపులపై హామీ ఎవరిస్తారో!
 రాయలసీమతో పాటు మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలకు కృష్ణా జలాలు సాగునీటి కేటాయింపులపై కొన్నేళ్లుగా పోరాడుతున్నా ఫలితం లేదు. మద్రాసు తాగునీటికి 15 టీఎంసీలు, తెలుగుగంగకు 29 టీఎంసీలు, శ్రీశైలం కుడికాల్వకు 19 టీఎంసీలు, గాలేరునగరికి 38 టీఎంసీలు, పీఏబీఆర్ కు 10 టీఎంసీల నీటిని పోతిరెడ్డిపాడు ద్వారా కేటాయించాలని మూడుదశాబ్దాలు పైబడి ఉద్యమిస్తున్నారు. అలాగే శ్రీశైలం వెనుకభాగం నుంచి  హంద్రీనీవా ప్రాజెక్టుకు 40 టీఎంసీల నికరజలాలు కేటాయించాలని కోరారు. తద్వారా కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరులో 6.205 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది.
 
  అలాగే వెలిగొండకు 32.5 టీఎంసీలు కేటాయించాలని డిమాండ్  చేస్తున్నారు. శ్రీశైలం ఎడమకాలువకు 30 టీఎంసీలు కేటాయించాలని,  పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 75వేల క్యూసెక్కులకు పెంచాలని కొన్నేళ్లుగా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి, ఎంవీ రమణారెడ్డి, మైసూరారెడ్డి పోరాడారు. అలాగే కేసీ కెనాల్‌ను 600 క్యూసెక్కుల ప్రవాహంతో ఆధునికీకరించాలని కోరుతున్నారు. మిగులుజలాలపై ఆధారపడి నిర్మితమవుతున్న గాలేరు-నగరి, హంద్రీనీవా, తుంగభద్ర హైలెవల్ కెనాల్ వెడల్పు నిర్మాణాల ప్రాజెక్టులను ఎవరు పూర్తి చేయాలి? వాటి నికరజలాలకు భరోసా ఎవరిస్తారు? అనే ప్రశ్న సీమవాసులలో  మెదులుతోంది. మొదటగా ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి, నికర జలాల కేటాయించి ఆపై విభజన అంశం గురించి మాట్లాడాలని సీమ వాసులు డిమాండ్ చేస్తున్నారు. వీటిపై స్పష్టత లేకుండా విభజన జరిగితే కృష్ణాపై ఉన్న జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు అంతరాష్ట్ర ప్రాజెక్టులవుతాయి. అప్పుడు కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉండదు. ఇదే జరిగితే సీమలో సాగునీటి ఆధారిత ఆయకట్టుతో పాటు మిగులుజలాలపై ఆధారపడిన ప్రాజెక్టులకు నీటికష్టాలు తప్పవు.
 
 అసమాన కేటాయింపులు ఇవిగో..
 రాష్ట్రంలో అసమాన నీటికేటాయింపులు స్పష్టంగా కనపడుతున్నాయి. నాగార్జునసాగర్, కృష్ణాబ్యారేజ్ దిగువన కేటాయించిన జలాలకు మించి వినియోగం జరుగుతోంది. పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఖమ్మం, నల్గొండ జిల్లాలలో కేటాయింపులకు మించి జలవినియోగం జరుగుతోంది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ నివేదిక ప్రకారం నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువలకు బచావత్ కేటాయింపులు 261 టీఎంసీలు. అయితే  371 టీఎంసీలను వాడుతున్నారు. అంటే 110 టీఎంసీలను అధికంగా వినియోగిస్తున్నారు. అలాగే కృష్ణాబ్యారేజ్ దిగువన ఖరీఫ్, రబీ పంటలకు 181 టీఎంసీలు కేటాయిస్తే 234 టీఎంసీలు వినియోగిస్తున్నారు. అంటే బచావత్ కేటాయింపుల కంటే 163 టీఎంసీలను అధికంగా వినియోగిస్తున్నారు. 20 ఏళ్లుగా ఇది జరుగుతోందని ఇంజనీర్లు స్పష్టం చేస్తున్నారు. అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ జిల్లాలకు తుంగభద్ర ద్వారా కేటాయించిన 32.50 టీఎంసీల జలాల వినియోగాన్ని సగటున 27.30 టీఎంసీలకు కుదించిన అంశాన్ని సైతం ఇంజనీర్లు తమ నివేదికలో బహిర్గతం చేశారు. అయినా అసమానత ఆగలేదు.
 

మరిన్ని వార్తలు