‘కరోనా’ అనుకుని ఖననం 

13 May, 2020 09:57 IST|Sakshi
కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేస్తున్న రాంబాబు కుటుంబసభ్యులు (ఇన్‌సెట్‌) రాంబాబు(ఫైల్‌)  

పెద్దాసుపత్రిలో మృతదేహాల తారుమారు 

నెగిటివ్‌ వ్యక్తి మృతదేహం కోసం కుటుంబ సభ్యుల ఆందోళన 

కర్నూలు (హాస్పిటల్‌): కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో మృతదేహాలు తారుమారు అయ్యాయి. ఆసుపత్రి ఉద్యోగులు పొరపాటున అనారోగ్యంతో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని కరోనా పాజిటివ్‌ అనుకుని మున్సిపాలిటీ వారికి అప్పగించారు. వారు అంత్యక్రియలు పూర్తి చేశారు. తీరా ఆ వ్యక్తి మృతదేహం కోసం కుటుంబ సభ్యులు రావడంతో తప్పును తెలుసుకున్నారు. మృతదేహం ఇవ్వాలంటూ కుటుంబ సభ్యులు కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేశారు. వివరాల్లోకి వెళితే.. కర్నూలులోని బుధవారపేటకు చెందిన రాంబాబు ఆటో నడుపుకుంటూ జీవనం సాగించేవాడు.

అతనికి ఈ నెల 6వ తేదీన ఆయాసం రావడంతో కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేర్పించారు. అదే సమయంలో అతనికి వైద్యులు కరోనా టెస్ట్‌ చేశారు. ఆరోగ్యం విషమించి అతను 9వ తేదీ మృతి చెందాడు. అయితే కరోనా పరీక్ష నివేదిక వచ్చాకే మృతదేహాన్ని ఇస్తామని ఆసుపత్రి అధికారులు తెలిపారు. సోమవారం సాయంత్రం వచ్చిన నివేదికలో నెగిటివ్‌గా వచ్చింది. దీంతో మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు మంగళవారం మార్చురీకి వెళ్లి చూడగా రాంబాబు కాదని తెలిసింది.  

పేరు ఒకేలా ఉండటంతో..:
రాంబాబుతో పాటు మార్చురీలో మరో రెండు మృతదేహాలు ఉంచారు. వీటిల్లో రాంబాబు మినహా మిగిలిన రెండూ కరోనా పాజిటివ్‌ వ్యక్తులవి. పాజిటివ్‌ వచ్చిన మృతదేహాలను సోమవారం రాత్రి ఫొరెన్సిక్‌ విభాగం వారు మున్సిపాలిటీ సిబ్బందికి అప్పగించి నగర శివారులో ఖననం చేయించారు. అయితే పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి పేరు..రాంబాబు పేరుకు దగ్గరగా ఉండటంతో పొరబడ్డారు. పాజిటివ్‌ వ్యక్తి మృతదేహం బదులుగా రాంబాబు మృతదేహాన్ని ఖననం చేయించారు.

ఈ నేపథ్యంలో రాంబాబు మృతదేహం తమకు అప్పగించాలంటూ  మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట కుటుంబసభ్యులు ధర్నా చేశారు. పోలీసులు వారిని సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జి.నరేంద్రనాథ్‌రెడ్డి వద్దకు తీసుకెళ్లారు. పొరపాటు జరిగిందని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. మృతదేహాల మార్పిడిపై త్రిసభ్య కమిటీ విచారణకు జిల్లా కలెక్టర్‌ 
జి.వీరపాండియన్‌ ఆదేశాలు జారీ చేశారు.

మరిన్ని వార్తలు