ఆపదలో ఆదుకుంది

12 May, 2020 04:37 IST|Sakshi

సీఎం జగన్‌ స్పందించిన తీరు అభినందనీయం

ప్రభుత్వానికి మృతుల కుటుంబ సభ్యుల కృతజ్ఞతలు 

మహారాణిపేట/ద్వారకానగర్‌ (విశాఖ దక్షిణ): విష వాయువు లీకేజీ ఘటనలో మృతిచెందిన కుటుంబాలకు పరిహారం చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగా తొలుత సోమవారం 8 కుటుంబాలకు బ్యాంకు ద్వారా చెల్లింపులు జరిగాయి. రూ.కోటి చొప్పున పరిహారాన్ని జమ చేసినట్లు గోపాలపట్నం తహసీల్దార్‌ బి.వి.రాణి తెలిపారు. నలుగురు మృతుల కుటుంబ సభ్యులకు కేజీహెచ్‌లో మంత్రులు పరిహారానికి సంబంధించిన పత్రాలను అందజేశారు. 

ప్రభుత్వం ఆదుకుంది..
కష్టాల్లో ఉన్న మమ్మల్ని ప్రభుత్వం ఆదుకుంది. ఘటన జరిగిన ఐదు  రోజుల లోపే పరిహారం చెల్లించింది. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె చనిపోవడం బాధగా ఉంది. దీన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. మమ్మల్ని అన్ని వి«ధాలా ఆదుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటాం. ఇలాంటి సీఎం నిండు నూరేళ్లు జీవించి ప్రజలకు మరిన్ని సేవలు అందించాలి.        
    – గండబోయిన శ్రీనివాస్‌ (శ్రియ తండ్రి) 

ఏ ప్రభుత్వమూ ఇలా స్పందించలేదు...
గతంలో ఏ ప్రభుత్వాలూ మాలాంటి పేదలను ఇంతగా ఆదుకోలేదు. ఘటన జరిగిన వెంటనే స్పందించిన తీరు చాలా బాగుంది. ప్రభుత్వం అందించిన భరోసాతో కుదుటపడ్డాం. భర్తను కోల్పోయానన్న బాధ ఉంది. కుటుంబంతో సుఖంగా జీవిస్తున్న మాకు ఈ ఘటన చేదు అనుభవాన్ని మిగిల్చింది. భర్త లేని లోటు తీర్చలేనిది. ముఖ్యమంత్రి జగన్‌ మమ్మల్ని ఆదుకున్న తీరు అభినందనీయం.    
    – పిట్టా యల్లమ్మ (మృతుడు శంకరరావు భార్య)

జనావాసాల్లో వద్దు..
మాది పెందుర్తి మండలం నరవ. ఎల్‌జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ ఘటనలో నా భర్త మృతిచెందాడు. నా భర్త కూలికి వెళ్లి కుటుంబాన్ని పోషించేవాడు. కుటుంబ పోషణ   కష్టంగా మారుతుందని బాధపడుతున్న సమయంలో ప్రభుత్వం ఆదుకుంది. మాకు ఆర్థిక సహాయం చేసిన సీఎంకు కృతజ్ఞతలు చెబుతున్నా. అదే చేతులతో జనావాసాల్లో ఇలాంటి కంపెనీలు వద్దని వేడుకుంటున్నా.     
– చిన్న నాగమణి (మృతుడి చిన్న గంగరాజు  భార్య), నరవ పెందుర్తి మండలం 

ఐదు ఊళ్లు ఊపిరి పీల్చుకున్నాయి...
నా భర్త  సింహాచలం ఆర్టీసీ డిపోలో హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. 15 ఏళ్లుగా వెంకటాపురంలో నివాసం ఉంటున్నాం. మాకు ఇద్దరు పిల్లలు. బాబు పార్ధు (13) ఏడో తరగతి చదువుతున్నాడు. ఐదో తరగతి చదివే మా పాప గ్రీష్మ (10) ఈ దుర్ఘటనతో మాకు శాశ్వతంగా దూరమైంది. నిత్యం ఇంట్లో చలాకీగా తిరిగే పాప ఇక లేదనే సంగతి మమ్మల్ని కలచివేస్తోంది. డబ్బు కంటే ప్రాణం ముఖ్యమే అయినా మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.కోటి చొప్పున ఆర్థిక సాయం అందించి ఆదుకుంది. అధికారులు, మంత్రులు తక్షణం స్పందించి తగిన చర్యలు తీసుకోవడం వల్ల ఐదు గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. 
    –  నాగులాపల్లి లత (గ్రీష్మ తల్లి)

పిల్లలను బాగా చదివిస్తా
ఈ ఘటనలో నా భర్త గోవిందరాజు చనిపోవడం చాలా బాధగా ఉంది. ప్రభుత్వం ఇచ్చిన సహాయంతో పిల్లలను చదివించి మంచి ప్రయోజకులను చేస్తా. గ్యాస్‌ లీకేజీతో ఐదు ఊళ్ల ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు. అన్ని రకాలుగా ప్రభుత్వం స్పందించడం వల్ల కష్టాల నుంచి బయట పడ్డాం. తరలించిన వారికి షెల్టర్లలో అన్ని వసతులు కల్పించడం. చాలా బాగుంది. కంపెనీకి అనుకుని ఉన్న మా ఇళ్లను కూడా శుభ్రం చేస్తున్నారు. ఆర్ధికంగా కూడా చేయూతనిచ్చారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల వంతున ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయించడం గొప్ప విషయం. ప్రభుత్వం ప్రజలను ఆదుకున్న తీరు బాగుంది.
– శివకోటి వెంకట లక్ష్మి (మృతుడు శివకోటి గోవిందరాజుల భార్య)

కూలి పనుల కోసం వచ్చాం...
మాది విజయనగరం జిల్లా, ఎల్‌ కోట మండలం, కల్లేపల్లి రేగ .కూలి పనుల కోసం వెంకటాపురం వచ్చాం. గ్యాస్‌ లీక్‌ దుర్ఘటనలో నా భార్య ప్రాణాలు కోల్పోయింది. పోయిన ప్రాణాలను తీసుకురాలేకపోయినా ముఖ్యమంత్రి రూ.కోటి చొప్పున ఆర్ధిక సాయం అందించడం  ఊరటనిచ్చింది. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి.
– రావాడ సత్యమంతుడు (మృతురాలు రావాడ నారాయణమ్మ భర్త 

ఊరటనిచ్చినా..
మాది పెందుర్తి మండలం పురుషోత్తపురం గ్రామం. గ్యాస్‌ లీకేజీ ప్రమాదంలో నా భర్త మేకా కృష్ణమూర్తి మృతిచెందాడు. ప్రభుత్వం అందించిన రూ.కోటి సహాయం ఊరటనిచ్చినా నా భర్త లేరనే విషయం మనసును తొలిచివేస్తోంది.
– మేకా సుశీల (మృతుడు మేకా కృష్ణమూర్తి భార్య)

అందివచ్చే సమయంలో అకాల మరణం
అందివస్తున్న నా కుమారుడు అకాల మరణం చెందడం బాధగా ఉంది. చిన్నతనం నుంచి కష్టపడి చదివే అన్నెపు చంద్రమౌళి (19) పేదలకు మరింత సేవ చేసేందుకు డాక్టర్‌ కావాలని కోరుకున్నాం. విశాఖ మెడికల్‌ కాలేజీలో సీటు వచ్చింది. ఎంతో బాగా చదువుతున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. మా కుమారుడు లేడనే బాధ మర్చిపోలేనిది. ముఖ్యమంత్రి జగన్‌ వెంటనే స్పందించి మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారాన్ని ప్రకటించడం మంచి నిర్ణయం.    
– అన్నెపు ఈశ్వరరావు, వెంకటాపురం (వైద్య విద్యార్థి అన్నెపు చంద్రమౌళి తండ్రి) 

(గ్రామాలకు చేరుకుంటున్న ప్రజలు.. ఫొటో గ్యాలరీ)

మరిన్ని వార్తలు