ప్రజలను మోసగించడం బాబుకు అలవాటే

5 Jul, 2014 05:04 IST|Sakshi

పుంగనూరు:  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రజలను మోసగిం చడం వెన్నతో పెట్టిన విద్య అని పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన పుంగనూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోను నూతన ఎంపీపీలు,  వైస్ ఎంపీపీ, ఎంపీటీసీల ప్రమాణస్వీకారోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుంగనూరులోని కల్యాణ మండపంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో చెప్పిన మాటలను నమ్మి ప్రజలందరు ఓట్లు వేసి గెలిపించారన్నారు.

కానీ పదవిని చేపట్టి నెలరోజులు గడుస్తున్నా చంద్రబాబునాయుడు రుణమాఫీపై స్పష్టమైన ప్రకటన ఇవ్వక, కమిటీలతో కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబునాయుడు 1994లో ఎన్టీఆర్‌ను అధికారంలో నుంచి దించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి, రెండురూపాయల కిలో బియ్యాన్ని ఐదు రూపాయలకు పెంచారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం చంద్రబాబు రైతుల  అన్నిరకాల రుణాలను, మహిళల డ్వాక్రా రుణాలను రద్దు చేస్తామని ప్రకటించి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చాక డ్రామాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో రుణ మాఫీపై ప్రజలు తిరగబడుతూ తెలుగుదేశం పార్టీ మంత్రులను, ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా రైతాంగం వెంటనే స్పందించి రుణమాఫీలపై పోరాటం చేయాలన్నారు. అలా పోరాటం చేసే వారికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు.  పుంగనూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు  ఎంపీ, ఎమ్మెల్యే నిధులతో అభివృద్ధి కేటాయిస్తామన్నారు.
పెండింగ్‌లో ఉన్న పనులన్నింటికీ ప్రభుత్వం వెంటనే నిధులు విడుదుల చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో నూతన ఎంపీపీ నరసింహులు, నూతన వైస్ ఎంపీపీ రామచంద్రారెడ్డి, జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్,  లీడ్‌క్యాప్ మాజీ చైర్మన్ ఎన్.రెడ్డెప్ప, మాజీ మున్సిపల్ చైర్మన్ కొండవీటి నాగభూషణం, మాజీ ఏఎంసీ చైర్మన్లు అమరనాథరెడ్డి, నాగరాజారెడ్డి, మాజీ ఎంపీటీసీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ ఆవుల అమరేంద్రతో పాటు నూతన ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు