భావి తరాల బాగుకే వికేంద్రీకరణ

6 Feb, 2020 04:09 IST|Sakshi

నేను బాహుబలి సినిమా చూపించలేను

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

చట్టసభల రాజధానిగా అమరావతి కొనసాగుతుంది

పాలనా రాజధానిగా విశాఖ

న్యాయ రాజధానిగా కర్నూలు

ఓ తండ్రిగా ఏమి చేయాలో అది చేశా 

ప్రస్తుత పరిస్థితుల్లో ఏమీ లేని చోట రూ.లక్ష కోట్లు పెట్టగలమా?

గ్రాఫిక్స్‌తో లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చూపించలేను

మీరైతే ఏమి చేస్తారో చెప్పండి

అప్పులు తప్ప బాబు ఇచ్చిందేముంది?

నిధులు లేవన్న వాస్తవాన్ని దారి మళ్లించాలనుకోవడం లేదు. ఎక్కువ ఖర్చు కాదని నేను వాస్తవాన్ని కప్పి పుచ్చలేను. ప్రజలను తప్పుదోవ పట్టించాలనుకోవడం లేదు. బాహుబలి గ్రాఫిక్సో, సింగపూర్‌ సిటీనో చూపించాలనుకోవడం లేదు. జపాన్‌ నగరాలనో, షాంఘై సిటీలనో చూపించి ప్రజలను మభ్యపెట్టాలనుకోవడం లేదు. నిధులను బట్టి క్రమానుగతంగా వేటికి ప్రాధాన్యత ఇవ్వాలో నిర్ణయించుకుంటున్నాం.
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

అమరావతి ప్రాంతంలో అన్నీ పంట భూములు కావడంతో ఎటువంటి కనీస మౌలిక వసతులు ఉండవు. అంటే రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, నీరు వంటి వాటి కోసమే గత ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎకరాకు రూ.2 వేల కోట్లు వ్యయం చేయాలి. అంటే 53 వేల ఎకరాల అభివృద్ధికి సుమారు రూ.1.09 లక్షల కోట్లు కావాలి. ఇదంతా కనీస మౌలిక వసతుల కోసమే. ఇందుకోసమే అంత డబ్బు ఖర్చు చేస్తే మిగతా పనుల మాటేమిటి?

ఇవాళ ప్రభుత్వం వద్ద అమరావతి లాంటి అద్భుతమైన నగరాలు కట్టేందుకు ఫండ్స్‌ లేవు. మరి ఇక్కడే 5 ఏళ్లు ఉన్న తర్వాత కూడా పరిస్థితి మారదు. అలాంటప్పుడు ఏం చేయాలి? అమరావతిలో పెట్టే ఖర్చులో 10 శాతం మాత్రమే విశాఖకు అవసరం. ఇప్పుడిలా విమర్శలు చేస్తున్నారని చెప్పి విశాఖకు రాజధాని తరలించకుండా ఉంటే.. ఐదేళ్ల తర్వాత మన రాజధాని ఏదో చూపించమంటే.. ఏ పల్లెటూరునో.. తుళ్లూరు మండలాన్నో రాజధానిగా చూపించాలి. 

ఒక ముఖ్యమంత్రిగా రాబోయే తరాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. రాబోయే తరాల వారు అభివృద్ధి, ఉద్యోగాలు కోరుకుంటారు. డిగ్రీ పూర్తి చేసుకొని, చేతుల్లో పట్టాలు పట్టుకొని యువత ఉద్యోగాల కోసం వెతుకుతారు.. వారంతా ఎక్కడకు వెళ్లాలి?

సాక్షి, అమరావతి : భవిష్యత్‌ తరాలకు మేలు చేసేందుకే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామని సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. చంద్రబాబులా బాహుబలి సినిమా చూపించ లేనని, గ్రాఫిక్స్‌ మాయాజాలంతో ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్పలేనన్నారు. విజయవాడలో బుధవారం ‘ది హిందూ’ గ్రూపు నిర్వహించిన ‘ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌’ సదస్సులో ఆయన మాట్లాడారు. రాజధానిపై రాష్ట్రానికి ఓ తండ్రిగా ఏమి నిర్ణయం తీసుకోవాలో అది తీసుకున్నానని, ఏమీ లేని చోట లక్ష కోట్లను మౌలిక వసతుల కోసం ప్రస్తుత పరిస్థితుల్లో వ్యయం చేసే స్థితిలో లేమని చెప్పారు. ఈ సదస్సులో సీఎం వైఎస్‌ జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..  

ప్రజల మేలు కోసం కొన్ని నిర్ణయాలు తప్పదు
‘‘సదస్సుకు ముందు ది హిందూ గ్రూప్‌ చైర్మన్‌ ఎన్‌.రామ్‌ గారితో బ్రేక్‌ఫాస్ట్‌ మీటింగ్‌ సందర్భంగా ఆసక్తికర చర్చ జరిగింది. మా చర్చలో ప్రస్తావనకు వచ్చిన అంశాలను ఈ వేదికపై నుంచి పంచుకోమని ఆయన కోరారు. అందులో ఒకటి రాజధానికి సంబంధించింది. ఒక సీఎంగా కొన్ని అధికారాలతో పాటు బాధ్యతలూ ఉంటాయి. కొన్ని నిర్ణయాలు సకాలంలో తీసుకోవాలి. లేకపోతే, భవిష్యత్‌ తరాలకు నష్టం జరుగుతుంది.  ఈ కోవలో మూడు రాజధానులపై నిర్ణయం తీసుకోకపోతే భావి తరాలకు అన్యాయం, నష్టం జరుగుతుంది.

ఎటు చూసినా 30, 40 కిలోమీటర్ల దూరమే...
ఇప్పుడున్న అమరావతి ఇటు విజయవాడకు కానీ, అటు గుంటూరుకు కానీ దగ్గరగా లేదు. ఎటుచూసినా 30, 40 కిలోమీటర్ల దూరం. పైగా అవన్నీ పంట భూములు. అక్కడికి కనీసం రెండు లైన్ల రోడ్డు కూడా లేదు. అంతా సింగిల్‌ లైన్‌ రోడ్డే. అయినా ఆయన (చంద్రబాబు) ఆ ప్రాంతంపై ఎందుకంత ఆసక్తి చూపారో రాష్ట్రంలో అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన, ఆయన ఆశ్రితుల (క్రోనీ – అత్యంత ఇష్టమైన వ్యక్తులు)కు అక్కడ భారీ ఎత్తున భూములున్నాయి. చంద్రబాబు సీఎం అయ్యాక రాజ ధాని ప్రకటనకు ముందే, ఈ గ్రామాలు పబ్లిక్‌ డొమైన్‌లోకి రాక ముందే భూములు కొనుగోలు చేయడం వల్ల అక్కడ పెట్టారు.  

రూ.2,300 కోట్ల అప్పు మిగిల్చారు 
లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటే గత ప్రభుత్వం ఐదేళ్లలో ఎంత ఖర్చు పెట్టిందో తెలుసా? కేవలం రూ. 5,677 కోట్లు. పైగా మరో రూ.2,300 కోట్ల అప్పు 10.32 శాతం వడ్డీతో  తెచ్చి ఈ ప్రభుత్వం నెత్తిన వేసింది. కేంద్రం నుంచి రూ.1,500 కోట్లు వచ్చింది. దాన్ని మించి వస్తుందని కూడా నేను అనుకోవడం లేదు. మహా అయితే మరో రూ.1,000 కోట్లు ఇస్తారేమో. ఈ పరిస్థితుల్లో ఏ రాష్ట్ర సీఎం అయినా ఏం చేస్తారు? అమరావతిలో కనీస మౌలిక వసతులు కల్పించడానికే దాదాపుగా రూ.1.09 లక్షల కోట్లు ఖర్చు చేయాలి. ఇక్కడ నేను రూ.5,000 కోట్లు లేక రూ.6,000 కోట్లు కూడా ఖర్చు చేయలేని పరిస్థితి. అదయినా సముద్రంలో నీటి చుక్క చందమే. ఇక్కడ పెట్టుబడి పెట్టాలంటే తప్పనిసరిగా రుణాలకు వెళ్లాల్సిందే.

లెజిస్టేటివ్‌ రాజధానిగా అమరావతి కొనసాగుతుంది..
అమరావతి లెజిస్లేటివ్‌ రాజధానిగా తప్పనిసరిగా కొనసాగుతుంది. ఇక్కడే ఏటా అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. 60 నుంచి 70 రోజుల పాటు ఎమ్మెల్యేలంతా వస్తారు. అందువల్ల అమరావతి అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రంలోనే నంబర్‌ వన్‌ సిటీ విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌ అవుతుంది. సీఎం, మంత్రులు అక్కడ ఉంటారు. సచివాలయం, హెచ్‌వోడీ కార్యాలయాలు కూడా పని చేసాయి. ఇప్పటికే కావాల్సిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఉంది. ఇక మూడో అంశం జ్యుడిషియల్‌ కేపిటల్‌. రాయలసీమలోని కర్నూలులో హైకోర్టు ఉంటుంది. తమిళనాడు నుంచి ఆంధ్ర విడిపోయినప్పుడు 1953 నుంచి 1956 వరకు కర్నూలు రాష్ట్ర రాజధానిగా కొనసాగిందనే విషయం మీకందరికీ తెలుసు. అప్పట్లో శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం కర్నూలులో రాజధాని ఏర్పాటు చేశారు. వికేంద్రీకరణ జరగాలని, పాలన మూలాలను విడగొట్టాలని (సీడ్స్‌ ఆఫ్‌ గవర్నెన్స్‌ స్ప్లిట్‌) కావాలని ఆనాడే పెద్దలు నిర్ణయించారు. అందుకే అక్కడ జ్యుడిషియల్‌ కేపిటల్‌ను ఏర్పాటు చేస్తున్నాం.

అసలు ఎంత ఖర్చవుతుంది?
అమరావతికి రూ.లక్ష కోట్లు ఖర్చు అవుతుంది. అది కూడా అప్పు తీసుకొచ్చి పెట్టాలి. ఓ 20 ఏళ్ల తర్వాత ఈ రూ.లక్ష కోట్లకు వడ్డీతో కలుపుకుని రూ.3 లక్షల కోట్లు లేదా 4 లక్షల కోట్లు అవుతుంది. చంద్రబాబు చెబుతున్నట్టుగా కేపిటల్‌ నిర్మించేందుకు అనువైన ల్యాండ్‌ బ్యాంక్‌ లేదు.  నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్, నది పరీవాహక చట్టం ప్రకారం లీగల్‌గా భవనాలు కట్టేందుకు మిగిలింది 5,200 ఎకరాలు మాత్రమే. ఇందులో మాత్రమే రూ.లక్ష కోట్ల పెట్టుబడి పెడితే అది 20 ఏళ్ల తర్వాత రూ.3 లక్షల కోట్లు లేదా 4 లక్షల కోట్లు అవుతుంది. ఇంత డబ్బు ఎక్కడి నుంచి ప్రభుత్వాలు తీసుకురాగలుగుతాయి? ఇదే మనకున్న క్లిష్టమైన పరిస్థితి. అందుకే విశాఖను పరిపాలన రాజధానిగా ఎంచుకున్నాం.

ఓ తండ్రిగా తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకున్నా..
మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోవాల్సిందే. అందరూ విప్లవాత్మకంగా మాట్లాడుతున్నారు. కానీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఒక తండ్రి తన పిల్లలకు ఏదైతే చేయాలనుకుంటాడో అలాగే చేశాను. ఈ రాష్ట్రానికి తండ్రి స్థానంలో ఉంటూ నిర్ణయం తీసుకునే అవకాశం నాకు ప్రసాదించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నేను ఒక తండ్రి నెరవేర్చాల్సిన బాధ్యత నెరవేరుస్తున్నాను. నాకున్న సామర్థ్యం మేరకు ఎంత వరకు చేయగలనో అదంతా ఉత్తమంగా చేస్తున్నాను.
 
వర్షాలు పడినా డ్యామ్‌లు నిండలేదు..

ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు పడ్డాయి. కానీ రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో డ్యామ్స్‌ నిండనే లేదు. కాల్వల సామర్థ్యం లేక పోవడమే ఇందుకు కారణం. కాల్వల ఆధునికీకరణ చేయాలంటే సహాయ పునరావాస (ఆర్‌ అండ్‌ ఆర్‌) సమస్యలు ఉన్నాయి. వీటన్నిటినీ పరిష్కరించాలంటే రూ.33 వేల కోట్లు అవసరం అవుతాయని ఇంజనీర్లు అంటున్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి చూసినా, పోలవరం చూసినా రూ.16,000 కోట్లు అవసరం. వీటిలో నేను వేటికి ప్రాధాన్యత ఇవ్వాలి? దశాబ్దాలుగా పూర్తి కాని ప్రాజెక్టులు, నా తండ్రి వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉండగా ప్రారంభించిన ప్రాజెక్టులను గత ప్రభుత్వంలో చంద్రబాబు విస్మరించారు. వాటిని పూర్తి చేయాలంటే మాకు మరో 25,000 కోట్లు కావాలి.

47 ఏళ్ల సీడబ్ల్యూసీ రికార్డులు పరిశీలిస్తే 1,200 టీఎంసీల నీరు శ్రీశైలం చేరుతుందని ఉంది. కానీ గత పదేళ్ల రికార్డు చూస్తే 1,200 టీఎంసీల నుంచి అది 600 టీఎంసీలకు పడిపోయింది. అదే ఐదేళ్ల రికార్డులు చూస్తే 400 టీఎంసీలకు క్షీణించినట్టు అర్థం అయ్యింది. అంటే నీరందక కృష్ణా ఆయకట్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉంది. మరోపక్క గోదావరి వరద 3,000 టీఎంసీలు వృథాగా సముద్రం పాలవుతోంది. వ్యవసాయ ఆధారితమైన ఈ రాష్ట్రంలో 62 శాతం మంది దానిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. గోదావరి నీటిని కృష్ణాకు మళ్లించడం తప్ప వేరే దారిలేదు.

ఇంజనీర్లు ఇందుకు రూ.68,000 కోట్లు ఖర్చు అవుతుందంటున్నారు. దీనికంటే తక్కువ ఖర్చుతో, వేగంగా పూర్తి అయ్యే మరో మంచి మోడల్‌ సూచించాలని వారిని కోరాను. అదైనా రూ.40,000 కోట్ల నుంచి 45,000 కోట్లు ఖర్చు అవుతుంది.  ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇంటి పట్టా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. సుమారు 25 లక్షల మందికి ఈ ఉగాదికి ఇంటి పట్టాలు ఇవ్వబోతున్నాం. వీటిలో కనీసం ఏడాదికి 6 లక్షల మందికి ఇళ్లు కట్టించి.. నాలుగేళ్లలో మొత్తం ఇళ్లు పూర్తి చేయాలనుకుంటున్నాం. ఇందుకోసం ఏడాదికి సుమారు రూ.9,000 కోట్లు అవుతుంది. ఇవన్నీ చేయడానికి రాష్ట్రంలో నిధులు ఉన్నాయా? అలా చేసే స్వేచ్ఛ, అవకాశం లేదు’ అని సీఎం జగన్‌ వివరించారు. 

విశాఖే ఎందుకంటే.. 
విశాఖపట్నం ఇప్పటికే అభివృద్ధి చెందిన నంబర్‌ వన్‌ సిటీ. ఇప్పటికే అన్ని మౌలిక వసతులు ఉన్నాయి. లక్ష కోట్లలో పది శాతం విశాఖపట్నంలో ఖర్చు చేస్తే ఐదేళ్లు కాకపోయినా పదేళ్లలోనైనా హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి దీటుగా తయారవుతుంది. మన రాష్ట్రంలోని యువత ఉద్యోగాల కోసం ఎక్కడెక్కడికో పోవాల్సిన అవసరం ఉండదు. అదే విశాఖను అభివృద్ధి చేస్తే అది మా నగరం, మా రాజధాని, మా ఊరు అనుకుంటారు. మీరే నా స్థానంలో ఉంటే ఏం చేస్తారో ఆలోచించండి? ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నామంటే అందరూ సంతోషంగా ఉండాలని..    ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాలనీ.. అందుకోసం పాలనను (గవర్నెన్స్‌) మూడు ప్రాంతాలకు విస్తరించేలా విడగొట్టాం.

పారదర్శకతకు పెద్దపీట
దేశంలోనే తొలిసారిగా రివర్స్‌ టెండరింగ్‌తో ఓ మార్పునకు శ్రీకారం చుట్టాం. (రివర్స్‌ టెండరింగ్‌ అంటే ఏమిటన్న ది హిందూ గ్రూప్‌ చైర్మన్‌ రామ్‌ ప్రశ్నకు సమాధానమిస్తూ..) మూలాల నుంచి అవినీతిని నిర్మూలించే మార్పును ప్రారంభించాం. దేశం అంతా ఆదర్శంగా తీసుకునే నిర్ణయం తీసుకున్నాం. రూ.100 కోట్లకు పైబడిన ఏ టెండర్‌ అయినా ముందు జ్యుడిషియల్‌ ప్రివ్యూ కోసం జడ్జి ముందుకు వెళుతుంది. దీన్ని వారు పబ్లిక్‌ డొమైన్లో వారం రోజులు ఉంచుతారు. కాంట్రాక్ట్‌లో ఉన్న నిబంధనలపై విమర్శకులు సహా ఎవరైనా అభ్యంతరాలు తెలపచ్చు.. సలహాలు ఇవ్వొచ్చు. చాలా వరకు అవినీతికి ఆస్కారం ఎక్కడుంటుందంటే ప్రాజెక్టుల టెండర్లు టైలర్‌ మేడ్‌గా (కమీషన్లు ఇచ్చే వారికే పనులు దక్కేలా నిబంధనలు పెట్టి టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడం) ఉంటాయి.

కొందరు మాత్రమే అర్హత పొందేలా వాటిని తయారు చేస్తుంటారు. దీన్ని నివారించడానికే మేము ఈ ప్రివ్యూ కమిషన్‌ ఏర్పాటు చేశాం. న్యాయమూర్తి ఆధ్వర్యంలో టెండర్‌ నిబంధనలు ఖరారవుతాయి. టెండర్లో అతి తక్కువ కోట్‌ చేసిన మొత్తాన్ని చూపిస్తూ రివర్స్‌ టెండరింగ్‌కు వెళతాం. దాని కంటే తక్కువకు ఆ టెండర్‌ చేస్తామని ఎవరు పోటీ పడినా వారికి ప్రాజెక్టు కాంట్రాక్టు అప్పగిస్తాం.

ఈ ఏడు నెలల కాలంలో దాదాపుగా రూ.2000 కోట్లు రివర్స్‌ టెండరింగ్‌ విధానం ద్వారా ఆదా చేయగలిగాం. పేదల ఇళ్లకు సంబంధించిన టిడ్కో ప్రాజెక్టు అందుకు ఓ ఉదాహరణ. గతంలో సుమారు రూ.2,700 కోట్లుగా నిర్ణయమైన ఈ టెండర్‌ను రద్దు చేసి రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లడం ద్వారా దానిని రూ.2,300 కోట్లకు తీసుకురాగలిగాం. పోలవరంలో గత టెండర్‌తో పోలిస్తే రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ.830 కోట్లు ఆదా చేయగలిగాం. రాష్ట్రంలో ఇక ఏ టెండర్‌ అయినా ఇప్పుడు ఇదే పద్ధతిలో చేయబోతున్నాం. త్వరలో దీన్ని దేశమంతా అమలు చేస్తుందని నేను నమ్ముతున్నాను. పారదర్శకతకు పెద్ద నిదర్శనంగా ఉంటుందని భావిస్తున్నా. 

మరిన్ని వార్తలు