కాల్చేస్తే ఖతం.. కుళ్లిపోతే విషం!

15 Dec, 2019 03:53 IST|Sakshi

అత్యధిక ఉష్ణోగ్రతలో మాడిపోవాల్సిన మందులు చెత్తకుప్పల్లో కుళ్లిపోతున్నాయి 

భూగర్భ జలాలు కలుషితమవుతున్నట్టు సీపీసీబీ ఆందోళన

యాంటీబయోటిక్స్‌కు లొంగని బాక్టీరియా ఉత్పత్తి

కలుషిత నీటిని తాగడం వల్ల రకరకాల జబ్బులు 

కాలం చెల్లిన మందులను మున్సిపాలిటీ చెత్తలో వేస్తున్న మందుల షాపులు

సాక్షి, అమరావతి: చెత్తాచెదారం కుళ్లిపోతే ఎరువుగా మారుతుంది. ఇది భూమికి లాభం చేకూరుస్తుంది. అదే మనుషులకొచ్చే జబ్బులను నయం చేసే మందులు కుళ్లిపోతే విషమవుతాయి. ఇవి భూమిని విషతుల్యంగా మారుస్తాయి. భూగర్భ జలాలు కలుషితమై కొత్త జబ్బులొస్తాయి..ప్రస్తుతం రాష్ట్రంలో ఇదే జరుగుతోంది. అత్యధిక ఉష్ణోగ్రతల మధ్య (100–200 డిగ్రీల సెల్సియస్‌ల మధ్య) కాలి్చవేయాల్సిన మందులు..మున్సిపాలిటీ డంపింగ్‌ యార్డుల్లో కుళ్లిపోతుండడంతో ప్రమాదం ముంచుకొస్తోంది. కొత్తరకం బాక్టీరియా పుట్టుకొస్తోంది.

కాలం చెల్లిన మందులతోనే తీవ్ర సమస్యలు
మందుల షాపుల యాజమాన్యాలు కాలం చెల్లిన మందులను చెత్త డబ్బాల్లో వేసి కొత్త సమస్యలకు తెరతీస్తున్నారు. వీటితో పాటు పలు ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సీవరేజీ ట్రీట్‌మెంటు ప్లాంట్లు లేకపోవడం వల్ల బయో ద్రవ వ్యర్థాలు (బయో లిక్విడ్‌ వేస్ట్‌) మురికి కాలువల్లో కలుస్తున్నాయి. దీనివల్ల కూడా భయంకరమైన జబ్బులు వస్తున్నాయి. దీనిపై సీపీసీబీ (కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి) ఇటీవలే తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితులు ఏ మాత్రం ఉపేక్షించతగ్గవి కావని, దీనిపై ఆయా రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్లు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అన్నిటికీ మించి కాలం చెల్లిన యాంటీబయోటిక్స్‌ మందులు కుళ్లిపోయి తీవ్ర ముప్పును తెస్తున్నట్టు సీపీసీబీ పేర్కొంది.

మందులు కుళ్లిపోతే వచ్చే నష్టాలు...
►కాలం చెల్లిన యాంటీబయోటిక్స్‌ కుళ్లిపోవడం వల్ల కొత్తరకం బాక్టీరియా పుట్టుకొస్తోంది. ఈ బాక్టీరియా వల్ల జబ్బులు సోకితే అత్యంత సామర్థ్యం కలిగిన యాంటీబయోటిక్స్‌ వాడినా తగ్గే అవకాశం ఉండదు.
►చెత్త కుప్పల్లో మందులు కుళ్లిపోతే వాయు కాలుష్యం తీవ్రమవుతుంది. గాలి ద్వారా వ్యాప్తి చెందే జబ్బుల ప్రభావం తీవ్రంగా ఉంటుంది.
►భూగర్భ జలాలు విషతుల్యమవుతున్నాయి
►ఈ జలాలు తాగడం వల్ల మూత్రపిండాలు, కాలేయ సమస్యలు, హెపటైటిస్‌ బి వంటి జబ్బులు వస్తున్నాయి

ఎన్విరాన్‌మెంట్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ ఏం చెబుతోంది
పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం మందులను బయట పడేయకూడదు. వాటిని విధిగా బయోవ్యర్థాల నిర్వహణ సంస్థలకే అప్పజెప్పాలి. పర్యావరణానికి ఎలాంటి హాని లేకుండా వీటిని క్లోజ్డ్‌ డిగ్రేడబుల్‌ హౌస్‌ (నాలుగు గోడల మధ్య ఉన్న బయోవ్యర్థాల ప్లాంటు)లో కాలి్చవేయాలి. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకునే హక్కు, జరిమానాలు విధించే అధికారం ఆయా రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్లకు ఉంది.  

కేరళలో ‘ప్రౌడ్‌’ ప్రాజెక్టు
వినియోగించని మందుల నిర్వీర్యంపై కేరళ అద్భుతమైన చర్యలు చేపట్టింది. దీనికోసం ప్రౌడ్‌ (ప్రోగ్రాం ఆన్‌ రిమూవల్‌ ఆఫ్‌ అన్‌యూజ్‌డ్‌ డ్రగ్స్‌)ను ప్రారంభించింది. కేరళ డ్రగ్‌ కంట్రోల్‌ అథారిటీ, కేరళ కెమిస్ట్‌ అండ్‌ డ్రగ్గిస్ట్‌ అసోసియేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో పనికిరాని, కాలం చెల్లిన మందుల నిరీ్వర్యం చేయడంలో ముందంజ వేశాయి. ఒక్క మాత్ర కూడా మున్సిపాలిటీ డబ్బాల్లోకి వెళ్లకుండా చేయగలుగుతున్నాయి. తిరువనంతపురంలో మొదలైన ఈ పైలెట్‌ ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని కేరళ యోచిస్తోంది.

రాష్ట్రంలో ఫార్మసీ సంస్థల వివరాలు ఇలా
►మాన్యుఫాక్చరింగ్‌ లైసెన్సులు 258
►రిటైల్‌ అండ్‌ హోల్‌సేల్‌  
►మెడికల్‌ స్టోర్‌లు 33,039
►బయోవ్యర్థాల నిర్వహణ ప్లాంట్‌లు 12
►2018–19లో నిబంధనల ఉల్లంఘనలు 6,385
►సీజ్‌చేసిన షాపుల సంఖ్య 66

అగ్రిమెంటు లేకుంటే లైసెన్సులు రద్దు చేస్తాం
మందుల షాపులు గానీ, సీ అండ్‌ ఎఫ్‌ (క్యారీ ఫార్వర్డ్‌ ఏజెన్సీలు)లు గానీ కాలం చెల్లిన మందులను చెత్త బుట్టల్లో వేయడానికి వీల్లేదు. కచి్చతంగా బయోవ్యర్థాల ప్లాంట్లకు పంపించాల్సిందే. సీ అండ్‌ ఎఫ్‌ ఏజెన్సీలు బయోవ్యర్థాల నిర్వాహకులతో అవగాహన ఒప్పందం చేసుకోకపోతే లైసెన్సులు రద్దు చేస్తామని చెప్పాం.  మందులు మున్సిపాలిటీ చెత్త డబ్బాల్లో వేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్ల పర్యవేక్షణలో నిఘా పెంచాం.
– ఎంబీఆర్‌ ప్రసాద్,
సంచాలకులు, ఔషధనియంత్రణ మండలి

 
ఈ చట్టం ఆస్పత్రులకు మాత్రమే వర్తిస్తోంది
ఎన్వీరాన్‌మెంట్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ అనేది కేవలం ఆస్పత్రుల బయోవ్యర్థాల నిర్వీర్యం కోసం మాత్రమే ఉపయోగపడుతోంది. ఇప్పటివరకూ మెడికల్‌షాపులు లేదా మాన్యుఫాక్చరింగ్‌ సంస్థలు మందులను నిబంధనలకు విరుద్ధంగా పారబోస్తే వాటిపై చర్యలు తీసుకుని, జరిమానాలు విధించిన దాఖలాలు కనిపించలేదు.
– ఎ.విజయభాస్కర్‌రెడ్డి,
ఫార్మసీ కౌన్సిల్‌ మాజీ అధ్యక్షులు

మరిన్ని వార్తలు