హరిలో రంగ హరి

8 Jan, 2014 04:27 IST|Sakshi

హరిదాసు అంటే హరి భక్తుడని అర్థం. సాక్షాత్తూ ఆ శ్రీమన్నారాయణుడి స్వరూపమే తానుగా ధరించిన హరిదాసు ఆబాల గోపాలుని తన్మయులను చేస్తూ, ఆనందపరుస్తూ తిరుగుతుంటారు. హరిదాసు తలపై ఉన్న నామాలు కలిగిన అక్షయ పాత్ర తరగని సంపదలకు గుర్తుగా భావిస్తారు. త్రిలోక సంచారి అయిన విష్ణుమూర్తి భక్తుడైన నారదులవారే నేటి మన ఈ హరిదాసులుగా గ్రామాలలో ప్రజలు భావిస్తారు.

వేకువ జామునుంచే వీధుల్లో శ్రీమద్రమారమణ గోవిందో హరి... హరిలో రంగ హరి... అంటూ వీరు ఆలపించే గీతాలు మన సంస్కృతిని వివరిస్తాయి. రైతుల లోగిళ్లు ధాన్యరాశులతో నిండాలని, రైతులు సుఖసంతోషాలతో వర్ధిలాలని, ఇలాగే ప్రతిఒక్కరూ దానధర్మాలు చేస్తూ చల్లగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఉంటారు. మహిళలు. పిల్లలు ఆనందంగా ఎవరికి తోచిన విధంగా వారు విష్ణుమూర్తి అవతారమైన హరిదాసుకు  దానధర్మాలు చేస్తుంటారు.
 
 రానురాను తగ్గుతున్న ఆదరణ..

 మండలంలో రాజుపాలెం గ్రామంలో సుమారు 60 కుటుంబాలకు చెందిన హరిదాసులు జీవనం సాగిస్తున్నారు. గతంలో వీరి కుటుంబాల్లో ఒకటి నుంచి ఐదుగురు చొప్పున సంక్రాంతి నెలలో తిరుగుతుంటారు. రానురాను హరిదాసులకు పల్లెల్లో ఆదరణ తగ్గిపోవడంతో నేడు ఒకరిద్దరే తిరుగుతున్నారు. అందులో గ్రామానికి చెందిన తొట్టెంపూడి నరసింహాదాసు హరిదాసు వేషంలో రోజు చుట్టు ప్రక్కల గ్రామ వీధుల్లో తిరుగుతూ, దేవుని గీతాలు ఆలపిస్తూ సందడి చేస్తారు.
 

మరిన్ని వార్తలు