డీఎడ్ వార్షిక షెడ్యూల్ ఖరారు

29 Oct, 2013 02:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే డైట్‌సెట్, కాలేజీల అనుమతులు, ప్రవేశాలకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం  రూపొందించింది. ఏటా కాలేజీల అనుమతుల్లో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో నిర్ణీత నెలల్లో అనుమతులు, పరీక్ష నిర్వహణ, ఫలితాల వెల్లడి, ప్రవేశాలు, తరగతుల ప్రారంభం వంటి అంశాలతో అకడమిక్ కేలండర్‌ను ఖరారు చేసింది.

దీనిని ఈ విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి తెస్తూ ప్రాథమిక విద్య ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాంతీయ యూనివర్సిటీల వారీగా వాటి పరిధిలోని జిల్లాలకు చెందిన కాలేజీలను విభజించారు. ప్రతీ కాలేజీలో 80 శాతం కన్వీనర్ కోటా సీట్లను వెబ్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయాలని, నిబంధనల ప్రకారం మేనేజ్‌మెంట్ కోటా సీట్లను భర్తీ చేయాలని అందులో వివరించారు.

ఉత్తర్వుల్లోని ప్రధాన అంశాలివే..
*  ఏటా మార్చి మొదటి వారంలో డైట్‌సెట్ ప్రవేశాల కమిటీ సమావేశం నిర్వహిస్తారు.  మార్చి రెండో వారంలో మైనారిటీ కోటా ప్రవేశాలను చేపడతారా? లేదా? అనే అంశంపై ఆప్షన్ ఇచ్చుకునేందుకు నోటిఫికేషన్. 
* మార్చి నాలుగో వారంలో డైట్‌సెట్ నిర్వహణకు నోటిఫికేషన్ జారీ 
* మే మొదటి వారంలో డైట్‌సెట్ నిర్వహణ. మూడో వారంలో ఫలితాలు. 
* ఆ విద్యా సంవత్సరంలో ప్రవేశాలు చేపట్టేందుకు అనుమతులు అవసరమైన కాలేజీల జాబితాను మే చివరిలో వారంలో అందజేస్తారు. 
* అకడమిక్ కేలండర్‌ను రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి రూపొందిస్తుంది. 
* జూన్ మొదటి వారం నుంచి రెండో వారం వరకు మొదటి దశ కౌన్సెలింగ్. వెబ్ ఆప్షన్లు సీట్ల కేటాయింపు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, సీట్ల కేటాయింపు ఖరారు లేఖలు అందజేస్తారు. 
* జూన్ మూడో వారం నుంచి నాలుగో వారం వరకు రెండో దశ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. 
* జూలై మొదటి వారంలో మైనారిటీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న సీట్లను మైనారిటీ అభ్యర్థులతో భర్తీ చేస్తారు. 
* జూలై రెండో వారం నుంచి నాలుగో వారం వరకు స్పాట్ అడ్మిషన్లు ఉంటాయి. 
* ఆగస్టులో మొదటి పని దినం నాడు తరగతులు ప్రారంభిస్తారు.

మరిన్ని వార్తలు