డీఎడ్‌ పేపర్‌ వాల్యూయేషన్‌ బహిష్కరణ

15 Jun, 2019 11:33 IST|Sakshi
స్టాల్‌ బాలికోన్నత పాఠశాల ప్రాంగణంలో ఆందోళనకు దిగిన అధ్యాపకులు

సాక్షి, గుంటూరు : డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీ ఎడ్‌) ప్రథమ సంవత్సర పరీక్షలు రాసిన విద్యార్థులకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను శుక్రవారం గుంటూరు నగరంపాలెంలోని స్టాల్‌ బాలికోన్నత పాఠశాలలో ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా విధులకు హాజరైన 130 మందికి పైగా ప్రైవేటు డీఎడ్‌ కళాశాలల అధ్యాపకులు గతేడాది డీఎడ్‌ ద్వితీయ సంవత్సర మూల్యాంకనానికి సంబంధించిన రెమ్యూరేషన్‌ బకాయిలను చెల్లించకపోవడంతో ఆందోళనకు దిగారు. రెమ్యూనరేషన్‌ బకాయిలు చెల్లించిన తరువాతే మూల్యాంకన విధుల్లో పాల్గొంటామని అక్కడే ఉన్న ప్రభుత్వ పరీక్షల విభాగ సహాయ కమిషనర్‌ మాణిక్యాంబకు స్పష్టం చేసి, వాల్యూయేషన్‌ విధులను బహిష్కరించారు. అనంతరం క్యాంప్‌ ప్రాంగణంలో ఆందోళనకు దిగారు.ఈ సందర్భంగా చీఫ్‌ ఎగ్జామినర్, ఎగ్జామినర్‌ విధులకు హాజరైన అధ్యాపకులు బి.వెంకటేశ్వరరావు, మరియదాసు, టి.దాసు, రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ గతేడాది వాల్యూయేషన్‌ చేసిన అధ్యాపకులకు చెల్లించాల్సిన రెమ్యూనరేషన్‌ చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై పలుమార్లు అధికారులను కలిసినప్పటికీ పట్టించుకోకపోవడంతో విసిగి వేసారిన ఫలితంగా తాజాగా డీఎడ్‌ ప్రథమ సంవత్సర వాల్యూయేషన్‌ విధులను బహిష్కరిస్తున్నామని చెప్పారు. గతేడాది వాల్యూయేషన్‌ విధుల్లో పాల్గొన్న 177 మంది అధ్యాపకులకు డీఏతో పాటు పేపర్‌ వాల్యూయేషన్‌కు కలిపి మొత్తం రూ.9 లక్షలు చొప్పున చెల్లించాల్సి ఉందని తెలిపారు. 

డీఈవో హామీతో ఆందోళన విరమణ
స్పాట్‌ వాల్యూయేషన్‌ కేంద్రంలో అధ్యాపకులు ఆందోళనకు దిగిన విషయాన్ని తెలుసుకున్న డీఈవో ఆర్‌.ఎస్‌.గంగా భవానీ అక్కడకు చేరుకున్నారు. అధ్యాపకులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. గతేడాదికి సంబంధించిన నిధులను ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ చెల్లింపులు జరగని మాట వాస్తవమేనని, బకాయిలను 20 రోజుల్లోపు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో శాంతించిన అధ్యాపకులు తిరిగి వాల్యూయేషన్‌ విధులకు హాజరయ్యారు. ఈనెల 20వ తేదీ వరకూ వాల్యూయేషన్‌ జరగనుంది.

మరిన్ని వార్తలు