ఖాతాల నుంచే కోత!

23 Sep, 2014 01:19 IST|Sakshi
ఖాతాల నుంచే కోత!
  • రుణాల రికవరీకి ఎత్తుగడ
  • స్టేట్ బ్యాంకుల నిర్వాకం
  • మునగపాక : మునగపాక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిలో ఖాతాదారులకు తెలియకుండానే వారి ఖాతా నుంచి రుణాలు రికవరీ చేస్తున్నారు. ఖాతాదారుని అకౌంట్ నుంచి నగదు లావాదావీలకు ఖాతాదారుని అనుమతి తప్పనిసరి. బ్యాంక్ అధికారులు మాత్రం తమకు ఇవేమీ పట్టనట్లు వ్యవహరించడం పట్ల పలువురు ఖాతాదారులు నివ్వెరపోతున్నారు.
     
    మునగపాకలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, చూచుకొండలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ శాఖలున్నాయి. ఈ బ్యాంక్‌ల ద్వారా నగదు లావాదేవీలతో పాటు ఇళ్లు, వ్యవసాయ, వాహన రుణాలు పొందుతున్నారు. తమ ఖాతాల ద్వారా పొదుపులు కూడా చేస్తున్నారు. కొంతకాలంగా ఖాతాదారులకు తెలియకుండానే పొదుపు ఖాతాల్లో ఉన్న నగదును అధికారులు రుణాల రికవరీ చేసేస్తున్నారు. ఒకవైపు వ్యవసాయ రుణాలు మాఫీ అవుతాయని ఆశిస్తున్న రైతులు బ్యాంక్ అధికారుల నిర్వాకానికి కంగుతింటున్నారు.

    నగదు లావాదేవీలకు తప్పనిసరిగా ఖాతాదారుని అనుమతి తీసుకోవాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. ఇప్పటికే డ్వాక్రా సంఘాలకూ రుణ మాఫీ చేస్తుందన్న ఆశతో మహిళలు సభ్యులు పొదుపులు చేసుకుంటున్నారు. ఆ నగదును సైతం అప్పుల రికవరీకి మళ్లిస్తుండడంతో వీరూ ఆందోళన చెందుతున్నారు. మునగపాకకు చెందిన బొడ్డేడ మహేష్ ఈ ఏడాది జనవరి 7న రూ.25 వేల వ్యవసాయ రుణం తీసుకున్నాడు. ఆ వ్యక్తికి బ్యాంక్‌లో పొదుపు ఖాతా ఉంది.

    ఆయనకు తెలియకుండానే ఈనెల 5న రుణం చెల్లించలేదని రూ.25 వేలను పొదుపు నుంచి మళ్లించడంతో షాక్‌తిన్నాడు. ఇలా పలువురి పొదుపు ఖాతాలో ఉన్న సొమ్ము రుణాల కింద రికవరీ చేస్తున్నారని తెలిసి లబోదిబోమంటున్నారు. దీనిపై బ్యాంక్ అధికారులను వివరణ కోరగా రుణాలు తీసుకున్న వారు సకాలంలో తీర్చకపోతే వారి పొదుపు ఖాతాల నుంచి రికవరీ చేసుకోవాలన్న ఆదేశాల మేరకు నడుచుకుంటున్నామని తెలిపారు.
     

మరిన్ని వార్తలు