వన్యప్రాణుల దాహం తీర్చేలా..

9 Jul, 2018 11:48 IST|Sakshi
నల్లమలలో ఏర్పాటు చేసిన సాసర్‌ పిట్లలో నీరు తాగుతున్న పెద్ద పులులు

నల్లమలలో జంతువుల తాగునీటి సమస్యకు శాశ్విత పరిష్కారం

వివిధ ప్రాంతాల్లో 8 డీప్‌ బోర్లు ఏర్పాటు

సోలార్‌ సిస్టం ద్వారా పనిచేస్తున్న మోటార్లు

దప్పిక తీర్చుకుంటున్న వన్యప్రాణులు

మార్కాపురం: గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో వేలాది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో జంతువుల తాగునీటి సమస్యకు అటవీ శాఖాధికారులు శాశ్విత పరిష్కారం చూపారు. ఏటా వేసవి ప్రారంభం నుంచి జంతువులకు తాగునీటి సమస్య ఏర్పడేది. అధికారులు ట్యాంకర్ల ద్వార కొన్ని ప్రాంతాల్లో సిమెంట్‌ తొట్లు(సాసర్‌ పిట్స్‌)ను ఏర్పాటు చేసినప్పటికీ వేసవి తీవ్రతకు నీరు ఆవిరి కావటం, కొన్ని ప్రాంతాల్లో ట్రాక్టర్‌ యజమానులు నీళ్లు పోయకపోవటంతో జంతువులు దప్పికతో అలమటించేవి. సమీపంలోని గ్రామాలకు వెళ్తే ప్రజలు దాడులు చేసే వారు. ఈ నేపథ్యంలో అటవీశాఖ ఉన్నతాధికారులు నల్లమలలోనే శాశ్వితంగా నీటి వనరులు ఏర్పాటు చేసినట్లయితే జంతువులకు ఇబ్బంది ఉండదని భావించారు.

100కు పైగా చిరుతలు...
టైగర్‌ రిజర్వు ఫారెస్ట్‌లో ప్రస్తుతం 100కు పైగా చిరుత పులులు, దాదాపు 70 పెద్ద పులులు, సుమారు 3 వేల జింకలు, దుప్పులు, ఇంకా రేచు కుక్కలు, కణతులు, ఎలుగుబంట్లు లెక్కలేనన్ని ఉన్నాయి. వీటి నీటి సమస్య తీర్చేందుకు నల్లమలలో అధికారులు కొన్ని ప్రాంతాల్లో డీప్‌బోర్లు వేసి సోలార్‌ సిస్టం ద్వారా మోటార్లు ఏర్పాటు చేసి శాశ్వితంగా నీటి సమస్యకు పరిష్కారం కనుగొన్నారు. గతంలో ఏటాఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు అటవీ జంతువులకు నీటి సరఫరా కోసం రూ.10 లక్షల వరకు ఖర్చు చేసే వారు. 95 సాసర్‌ పిట్లను ఏర్పాటు చేశారు. ప్రధానంగా కొండ అంచు, మిట్ట ప్రాంతాల్లో సాసర్‌పిట్స్‌ను ఏర్పాటు చేశారు. దోర్నాల, యర్రగొండపాలెం, పుల్లలచెరువు, శ్రీశైలం సరిహద్దు, తదితర మండలాల్లో ఉన్న అటవీ ప్రాంతాల్లో పిట్లు ఏర్పాటు చేశారు.
 గత ఏడాది అటవీశాఖ ఉన్నతాధికారులు శాశ్విత పరిష్కారం కోసం ప్రయోగాత్మకంగా దోర్నాల మండలం పులిచెరువు, యర్రగొండపాలెం మండలం తంగెడివాగు, గుంటూరు జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతమైన బొంకులపాడు వద్ద మూడు డీప్‌బోర్లు వేసి సోలార్‌ ప్యానళ్లను పెట్టి పైపులైన్లు వేసి ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నీటి కుంటలకు ఇంజిన్ల ద్వారా నీటిని పంపింగ్‌ చేశారు. ఇందు కోసం సుమారు రూ.10 లక్షలు ఖర్చు చేశారు.

ఈ ఏడాది ఇలా...
ఈ ప్రయోగం విజయవంతం కావటంతో ఈ ఏడాది రూ.5 లక్షలు ఖర్చు పెట్టి నల్లగుంట్ల 2, కొమరోలు, నారుతడికల, బటుకులపాయ ప్రాంతాల్లో ఒక్కొక్క డీప్‌బోరు మోటార్లు ఏర్పాటు చేసి పైపు లైన్ల ద్వారా నీటి సరఫరా చేశారు. ఇందుకోసం గిరిజన యువకులను ఎంపిక చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క బోరుకు రూ.45 వేలు ఇవ్వగా, నెడ్‌ క్యాప్‌ ద్వారా సోలార్‌ సిస్టంకు రూ.55 వేలు కేటాయించారు. ఈ విధంగా గత ఏడాది మూడు ప్రాంతాల్లో, ఈ సంవత్సరం ఐదు ప్రాంతాల్లో డీప్‌బోర్లు వేసి నీటి సరఫరా చేయటంతో పెద్ద పులులు, చిరుతలు, జింకలు, రేచు కుక్కలు, ఎలుగు బంట్లు, కణతులకు నీటి సమస్య తీరింది. దీని వలన అవి అటవీ ప్రాంతంలోనే హాయిగా సంచరిస్తుంటాయి. నీటి కోసం అడవి నుంచి బయటకు వచ్చి వేటగాళ్ల బారి నుంచి ప్రమాదాలను తప్పించుకుంటున్నాయి. ఇప్పటికే నల్లమలలోని బేస్‌ క్యాంప్‌లో ఉన్న పెద్ద చేమ, చిన్న మంతనాల, పులిబోను ప్రాంతాల్లో ఉన్న డీప్‌బోర్లకు మోటార్లు బిగించాలని అధికారులు ఆలోచిస్తున్నారు. మార్కాపురం డీఎఫ్‌ఓ పరిధిలో గుంటూరు జిల్లా సాగర్, రెంటచింతల, గురజాల, దోర్నాల అటవీ ప్రాంతాలు ఉన్నాయి.

నీటి సమస్య తీరినట్లే..జయచంద్రారెడ్డి, డీఎఫ్‌ఓ, మార్కాపురంనల్లమలలో శాశ్వితంగా జంతువులకు నీటి సమస్య తీర్చాలనే ఉద్దేశంతో గత ఏడాది మూడు ప్రాంతాల్లో, ఈ ఏడాది ఐదు ప్రాంతాల్లో డీప్‌ బోర్లు వేశాం. సోలార్‌ సిస్టం ద్వారా మోటార్లను ఆన్‌చేసి పైపు లైన్ల ద్వారా సాసర్‌పిట్‌ ప్రాంతాలకు నీటి సరఫరా చేస్తున్నాం. దీనితో అటవీ ప్రాంతంలో జంతువులు ఈ ప్రాంతాలకు వచ్చి నీరు తాగి వెళ్తున్నాయి. గతంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉండటంతో జంతువులు తీవ్రంగా ఇబ్బంది పడేవి. ఇప్పుడు ఆ సమస్య తీరింది. బేస్‌ క్యాంప్‌ల్లో కూడా ఉన్న డీప్‌బోర్ల వద్ద మోటార్లను బిగించాలన్న ఆలోచన ఉంది.

మరిన్ని వార్తలు