ఫైలిన్ తుపాను ముంచుకొస్తోంది

10 Oct, 2013 02:06 IST|Sakshi
ఫైలిన్ తుపాను ముంచుకొస్తోంది

ఆరు ఓడరేవుల్లో రెండో ప్రమాద హెచ్చరిక జారీ  
 హెలికాప్టర్లు, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశం

 
 సాక్షి, హైదరాబాద్/విశాఖపట్నం : తూర్పు మధ్య బంగాళాఖాతంలో బుధవారం సాయంత్రం తుపాను ఏర్పడింది. దీనికి ‘ఫైలిన్’గా వాతావరణశాఖ నామకరణం చేసింది. ఇది మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా పయనించి ఈనెల 12వ తేదీ నాటికి కళింగపట్నం, పారాదీప్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం విశాఖ తీరానికి సుమారు 1100కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్న ఈ తుపాను మరింత చేరువకు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల్ని వెనక్కు వచ్చేయాలని అధికారులు సూచించారు. తుపాను నేపథ్యంలో విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం, కాకినాడ, గంగవరం ఓడరేవుల్లో రెండవ నెంబర్ ప్రమాద హెచ్చరికలతో పాటు సెక్షన్ 3 హెచ్చరికలను కూడా జారీ చేశారు.
 
 ఇదే సమయంలో విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు దక్షిణ కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కూడా కొనసాగుతోంది. వీటన్నింటి కారణంగా రానున్న 24గంటల్లో ఉత్తర/దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఒకటి రెండుచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. తుపాను అతి తీవ్ర తుపానుగాను, పెను తుపానుగానూ మారే అవకాశాలున్నాయని, గురువారం ఉదయం నాటికి కొంత స్పష్టత రావచ్చని చెప్పారు. నైరుతి రుతుపవనాల అనంతరం ఏర్పడిన ఈ తొలి తుపానువల్ల ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ మాజీ అధికారి ఆర్. మురళీకృష్ణ తెలిపారు.
 

వర్షాలు పడిన ప్రాంతాలివే : రాష్ట్రంలో మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు కోస్తాంధ్రలోని పొదిలిలో 5 సెం.మీ, మాచర్ల, కందుకూరులలో 4, భీమిలి, గుడివాడలలో 3 సెం.మీ చొప్పున వర్షం పడింది. రాయలసీమలో బద్వేల్, పలమనేరులలో 5 సెం.మీ, కమలాపురం, ఉటుకూరు, ఆళ్లగడ్డలలో 4, తిరుపతి, కుప్పంలలో 3 సెం.మీ చొప్పున వాన కురిసింది. తెలంగాణలోని వికారాబాద్‌లో 7 సెం.మీ, కొల్లాపూర్‌లో 5, పరిగి, చేవెళ్లలలో 4, మహబూబాబాద్, సంగారెడ్డి, షాద్‌నగర్, కల్వకుర్తి, నల్గొండ ప్రాంతాల్లో 3 సెం.మీ చొప్పున వ ర్షం పడింది. గురువారం రాత్రిలోపు కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఓ మోస్తరు జల్లులు, రాయలసీమలోని కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఆకాశం మేఘావృతమై ఉంటుందని, గరిష్ట/కనిష్ట ఉష్ణోగ్రతలు కొన్ని ప్రాంతాల్లో 33, 23 డిగ్రీలు న మోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.
 
 పిడుగుపాటుకు ఇద్దరు మృతి
 పిడుగుపాటుకు విశాఖ జిల్లా ఎస్. రాయవరం మండలంలో ఒకరు, పెదబయలు మండలంలో మరొకరు మృత్యువాత పడ్డారు. కాగా, ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం ఎర్రాయిపాలెం గ్రామంలో పిడుగుపాటు శబ్దానికి ఇద్దరు మహిళలు, ముగ్గురు బాలికలు అస్వస్థతకు గురయ్యారు. వారిని కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
 
 వేల బస్తాల మొక్క జొన్న వర్షార్పణం
 రెండు రోజులపాటు కురిసిన భారీవర్షానికి మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో మొక్క జొన్న తడిసిపోయి రైతులకు తీవ్రనష్టం వాటిల్లింది. వనపర్తి మార్కెట్ యార్డులో 20వేల బస్తాల మొక్కజొన్న తడిసిపోయింది. నవాబ్‌పేట మార్కెట్ యార్డులో 12వేల బస్తాలకు నష్టం వాటిల్లింది. దీంతో రూ. 50 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు అధికారులు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 6.2లక్షల హెక్టార్లలో సాగవుతున్న మొక్కజొన్నకు వర్షాలవల్ల భారీగా నష్టం వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. పత్తికి కూడా ప్రమాదం పొంచి వుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
 
 70 మీటర్లు ముందుకు వచ్చిన సముద్రం
 తుపాను ప్రభావంతో గుంటూరు జిల్లాలోని సూర్యలంక సముద్రతీరం బుధవారం అల్లకల్లోలంగా మారింది. ఆలల ఉధృతితో పాటు సముద్రం దాదాపు 70 మీటర్లు ముందుకు రావడంతో తీరప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. కాగా, గుంటూరు జిల్లా దుర్గి మండలం గజాపురం తండాలో మంగళవారం రాత్రి 15 సెకన్ల పాటు వీచిన బలమైన గాలులకు చెట్లు, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు, పత్తిపైరు నేలకొరిగాయి.  
 
  కంట్రోల్ రూమ్ ఏర్పాటు..
 రాష్ట్ర ప్రకృతి విపత్తుల నివారణ శాఖ ఆధ్వర్యంలో సచివాలయంలో 24 గంటలపాటు పనిచేసే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు.  040-23456005/23451034 ఫోన్‌నంబర్లు, ఫ్యాక్స్ 040-23451819కు సమాచారం తెలపవచ్చన్నారు. అన్ని జిల్లాల్లోనూ కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు వివరించారు. ఈ సమీక్షా సమావేశాల్లో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, పితాని సత్యనారాయణ, కోండ్రు మురళి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి, ప్రకృతి విపత్తుల నివారణ శాఖ కమిషనర్ రాధా, రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి బీఆర్ మీనా, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సాంబశివరావు, నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి అరవిందరెడ్డి, సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ ఎండీ అనిల్‌కుమార్ ఇతర శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
 
  ప్రభుత్వం అప్రమత్తం
 రాష్ట్రానికి తుపాను ముప్పు ముంచుకొస్తున్న తరుణంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. కోస్తా జిల్లాల కలెక్టర్లను ముందుస్తుగా అన్ని ఏర్పాట్లుచేయాలని ఆదేశించింది. ఉత్తరకోస్తాలోని మూడు జిల్లాల్లో తీవ్ర ప్రభావం, మిగిలిన ఆరు కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు ప్రభావం పడనున్న నేపథ్యంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సహచర మంత్రులతో కలిసి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె. మహంతితోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముందస్తు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. జాతీయ ప్రకృతి విపత్తుల నివారణ బృందాలు, ఆర్మీ, నేవీ, కోస్ట్‌గార్డ్, అగ్నిమాపక సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశించడంతోపాటు, పర్యవేక్షణకు సీనియర్ అధికారులను ప్రత్యేకంగా నియమించారు. ప్రభుత్వ ఉద్యోగులంతా సమ్మె విరమించి విధుల్లో చేరాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

>
మరిన్ని వార్తలు