అరేబియా సముద్రంలో తుపాను

12 Jun, 2014 05:42 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం/పుణే: తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం కాస్తా బలపడి పెను తుపానుగా మారింది. నానౌక్ అని పేరుపెట్టిన ఈ తుపాను ప్రస్తుతం ముంబైకి 720 కి.మీ. దూరంలో పశ్చిమ నైరుతి దిశగా ఒమన్ తీరం వైపు పయనిస్తోన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో దేశ పశ్చిమ తీరంలో భారీ గాలులు వీయడంతోపాటు, వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు వెల్లడించింది. అలాగే ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ కోస్తాం ధ్ర, తెలంగాణ  మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది.
 
 దీని ప్రభావంతో రాష్ట్రంలో ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలి పింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వడగాల్పుల ప్రభావం కొనసాగుతోంది. కోస్తాం ధ్రల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. కాగా.. కేరళకు పూర్తిగా వ్యాపించి ప్రస్తుతం క్రియాశీలంగా ఉన్న నైరుతి రుతుపవనాలు బుధవారం నాటికి కర్ణాటక, గోవాలోని పలు ప్రాంతాలకు మహారాష్ట్రలోని కొంకణ్‌కూ విస్తరించాయని వెల్లడించింది.

మరిన్ని వార్తలు