కృష్ణమ్మకు కష్టం.. గోదారమ్మకూ నష్టం

25 Dec, 2019 03:57 IST|Sakshi

పశ్చిమ కనుమల్లో అడ్డగోలుగా అడవుల నరికివేత జీవ నదులపై విషమ ప్రభావం

గ్రీన్‌హౌస్‌ వాయువులు గ్రహించే సామర్థ్యం కోల్పోతున్న కనుమలు

నైరుతి రుత పవనాల గమనంపై తీవ్ర ప్రభావం

భూతాపం పెరిగి సాధారణం కంటే 0.5 నుంచి 1.5 డిగ్రీల అధిక

ఉష్ణోగ్రతలు నమోదు.. కురిస్తే కుండపోత.. లేదంటే వర్షాభావం

ఐఐఎస్సీ, సీడబ్ల్యూసీ పరిశోధనల్లో వెల్లడి

సాక్షి, అమరావతి : పశ్చిమ కనుమల్లో అడ్డగోలుగా అడవుల నరికివేత గోదావరి, కృష్ణా నదుల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తుందా.. నైరుతి రుతు పవనాల గమనాన్ని మార్చేస్తుందా.. ఈ పరిస్థితి ద్వీపకల్ప భారతావనిని దుర్భిక్షంలోకి నెడుతుందా.. అనే ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నాయి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ (ఐఐఎస్సీ) తాజా పరిశోధనలు. పశ్చిమ కనుమల్లోని అడవులను ఇష్టారాజ్యంగా నరికివేయడం వల్లే గతేడాది కేరళ, ఈ ఏడాది కర్ణాటకలో జల విలయాలు సంభవించాయనే వాస్తవాన్ని స్పష్టం చేస్తున్నాయి. అటవీ విస్తీర్ణం తగ్గడం వల్ల గ్రీన్‌హౌస్‌ వాయువుల ప్రభావం పెరగటం ప్రమాదకరంగా పరిణమించిందనే వాస్తవాన్ని చాటుతున్నాయి.

పశ్చిమ కనుమల్లో ఉష్ణోగ్రతలు 0.5 నుంచి 1.15 డిగ్రీలకు పెరుగుతున్నాయని.. దీనివల్లే ఒకట్రెండు నెలల్లో కురవాల్సిన వర్షం.. మూడు నాలుగు రోజుల్లోనే కుండపోతలా కురుస్తోందని.. ఈ పరిస్థితి వరదలకు దారి తీస్తోందని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతల ప్రభావం వల్ల నైరుతి రుతు పవనాలు బలహీనపడే అవకాశం ఉందని.. ఇది ద్వీపకల్ప భారతదేశాన్ని కరువు కోరల్లోకి నెట్టేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశంలో పశ్చిమ కోస్తా తీరానికి 1,621 కిలోమీటర్ల పొడవున గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో 1.4 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పశి్చమ కనుమల్లో పచ్చటి అడవులు విస్తరించి ఉన్నాయి. నైరుతి రుతు పవనాలు పశ్చిమ కనుమల మీదుగానే కేరళలో ప్రవేశించి.. దేశమంతటా విస్తరిస్తాయి. వర్షాలు కురిపిస్తాయి.

ద్వీపకల్ప భారతదేశంలో ప్రధానమైన గోదావరి, కృష్ణ, పెరియర్, పంబా తదితర జీవ నదులకు పుట్టినిల్లు పశ్చిమ కనుమలే. అక్కడ సమృద్ధిగా వర్షాలు కురిస్తే గోదావరి, కృష్ణ, పెరియర్‌ వంటి నదులు ఉరకలెత్తి ద్వీపకల్పాన్ని సస్యశ్యామలం చేస్తాయి. ప్రపంచం విడుదల చేసే గ్రీన్‌హౌస్‌ వాయువుల్లో ఏటా 37.5 మిలియన్‌ టన్నుల బొగ్గు పులుసు వాయువు (కార్బన్‌ డైయాక్సైడ్‌)ను పశ్చిమ కనుమల్లో అడువులు పీల్చుకుని.. అంతే స్థాయిలో ఆక్సిజన్‌ను విడుదల చేసి పర్యావరణ సమతౌల్యంలో ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. ఇది 100 బిలియన్‌ డాలర్ల (రూ.2,142 కోట్లు)కు సమానం.

వరదలు.. లేకుంటే ఎడారులు
పశ్చిమ కనుమల్లో అటవీ విస్తీర్ణం తగ్గుదల వల్ల ఒకట్రెండు నెలల్లో కురవాల్సిన వర్షం.. రెండు మూడు రోజుల్లోనే కుండపోతగా కురుస్తోందని ఐఐఎస్సీ, సీడబ్ల్యూసీ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కుండపోతలా కురిసిన వర్షపు నీటిని అడ్డగించేందుకు అడవులు లేవు. దీనివల్ల పశ్చిమ కనుమల్లో వాగులు, వంకలు ఉప్పొంగి.. నదులు వరదెత్తేలా చేస్తున్నాయి. ఈ వరదల దెబ్బకు భారీ ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తోంది. గతేడాది కేరళను వరదలు అతలాకుతలం చేయడానికి పశ్చిమ కనుమల్లో అడవుల అడ్డగోలు నరికివేతే కారణమని సీడబ్ల్యూసీ స్పష్టం చేసింది. ఈ ఏడాది కర్ణాటకను, కృష్ణా, తుంగభద్ర నదులు ఉప్పొంగి ప్రవహించడానికి కూడా అదే కారణమని ఐఐఎస్సీ వెల్లడించింది.

పశ్చిమ కనుమల్లో ఒక్కసారిగా కుండపోత కురిసి.. ఆ తర్వాత వర్ష విరామం (డ్రై స్పెల్‌) వస్తే వరదతో ఉప్పొంగిన నదులు.. నీటి చుక్క లేక ఎడారులను తలపిస్తాయని సీడబ్ల్యూసీ పేర్కొంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు గోదావరి, కృష్ణా నదులే ఆధారం. పశ్చిమ కనుమల్లో అటవీ క్షయం గోదావరి, కృష్ణా నదుల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తుందని, ఇది ద్వీపకల్ప భారతదేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. పశ్చిమ కనుమల్లో అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఐఐఎస్సీ కేంద్రానికి నివేదిక ఇచి్చంది.  

ద్వీపకల్పానికి గొడ్డలిపెట్టు..
ప్రపంచానికి, ద్వీపకల్ప భారతదేశానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న పశ్చిమ కనుమల్లో అడవులను వ్యవసాయం, రహదారులు, ఖనిజ నిక్షేపాల వెలికితీత పేరుతో అడ్డగోలుగా నరికేస్తున్నారు. దీనివల్ల గత రెండు దశాబ్దాల్లో పశ్చిమ కనుమల్లో అటవీ విస్తీర్ణం ఐదు శాతం తగ్గిపోయిందని ఐఎల్‌పీసీ సెంటర్‌ ఫర్‌ ఎకలాజికల్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ టీవీ రామచంద్ర నేతృత్వంలో నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. 1985 అటవీ లెక్కల ప్రకారం పశ్చిమ కనుమల్లో 16.21 శాతం హరితారణ్యాలు ఉంటే 2019 నాటికి ఆ అడవుల విస్తీర్ణం 11.3 శాతానికి తగ్గిపోయింది.

అంటే ఏడాది పొడవునా పచ్చగా ఉండే అటవీ విస్తీర్ణం 4.91 శాతం తగ్గిపోయిందని ఐఐఎస్సీ వెల్లడించింది. దీనివల్ల గ్రీన్‌హౌస్‌ వాయువులను గ్రహించే సామర్థ్యం పశ్చిమ కనుమలు 11 శాతం కోల్పోయాయి. ఇది భూతాపం పెరగడానికి దారి తీస్తోంది. పశ్చిమ తీరం వెంబడి సాధారణ ఉష్ణోగ్రతల కంటే 0.5 నుంచి 1.15 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పశ్చిమ కనుమల్లోనూ అదే రీతిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల ప్రభావం వల్ల నైరుతి రుతు పవనాల ప్రవేశంలో జాప్యం చోటుచేసుకుంటోందని ఐఐఎస్సీ పరిశోధనలో మరోమారు వెల్లడైంది. నైరుతి రుతు పవనాలు ఆలస్యంగా ప్రవేశించినా.. అధిక ఉష్ణోగ్రతల వల్ల ఏకరీతిగా వర్షాలు కురవడం లేదు. ఇది ద్వీపకల్ప భారతదేశంలో ఖరీఫ్‌ పంటలను తీవ్రంగా దెబ్బతీస్తోంది. తీవ్ర దుర్భిక్షానికి దారి తీస్తోంది.

►పశ్చిమ కనుమల పొడవు 1,621కి.మీ
►అడవుల విస్తీర్ణం 1.40 లక్షల చ.కి.మీ.
►దీని పరిధిలో గల రాష్ట్రాలు గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ
►ఇక్కడి అడవులు పీల్చుకునే కార్బన్‌ డైయాక్సైడ్‌ 37.50 మిలియన్‌ టన్నులు
►ఇవి విడుదల చేసే ఆక్సిజన్‌ విలువకు సమానమైన మొత్తం  రూ.2,142 కోట్లు
►1985 నాటికి పశ్చిమ కనుమల్లో గల హరితారణ్యాలు 16.21%
►2019 నాటికి వీటి విస్తీర్ణం 11.3%

మరిన్ని వార్తలు