విధి వక్రించి.. కళ తప్పింది

6 May, 2018 10:34 IST|Sakshi
చిట్టినీడి సూర్యకళ (ఫైల్‌), ఆస్పత్రిలో బెడ్‌పై అచేతనంగా సూర్యకళ

సోడా గ్యాస్‌ సిలిండర్‌ పేలి తీవ్రగాయాలు

 ఐసీయూలో విద్యార్థిని సూర్యకళ తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు

 ఆర్థికసాయం కోసం ఎదురుచూపులు

పశ్చిమ గోదావరి, భీమవరం టౌన్‌: ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత చెందిన ఆనందం.. డిగ్రీలో చేరాలన్న ఉత్సాహంతో ఉన్న ఆ విద్యార్థినిని విధి చిన్నచూపు చూసింది. సోడా గ్యాస్‌ సిలిండర్‌ రూపంలో ప్రమాదం వెంటాడింది. ఇల్లు, కళాశాల తప్ప మరో లోకం తెలియని ఆ విద్యార్థిని గత ఐదు రోజులుగా భీమవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో అపస్మారక స్థితిలో ఉండడం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. స్థానిక వైఎస్సార్‌ కాలనీ ప్రాంతంలో ఈనెల సోడా గ్యాస్‌ సిలిండర్‌ లీకై ఒత్తిడితో ఇంటి గోడను పగలగొట్టుకుని లోపలికి దూసుకువెళ్లిన ఘటనలో విద్యార్థిని చిట్టినీడి సూర్యకళ తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సూర్యకళ ఆరోగ్య పరిస్థితిని ఈ ప్రాంత వాసులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆమె కోసం అందరి హృదయాలు తల్లడిల్లుతున్నాయి. తల్లి నాగలక్ష్మి ఇడ్లీ అమ్ముతూ, తండ్రి వెంకట శివకుమార్‌ కాయకష్టం చేసుకుంటూ తమ ఇద్దరు ఆడపిల్లలు సూర్యకళ, లక్ష్మీ సాయిదుర్గను చదివిస్తున్నారు.

సూర్యకళ ఇంటర్‌ పాసై డిగ్రీలో చేరేందుకు ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది. డిగ్రీ పాసై చిన్న ఉద్యోగం సంపాదించి కుటుంబానికి అండగా నిలవాలనుకున్న ఆమెను విధి ప్రమాదంలోకి నెట్టేసింది. ప్రమాదం నుంచి సూర్యకళ చెల్లెలు లక్ష్మీ సాయిదుర్గ అదృష్టవశాత్తూ త్రుటిలో తప్పించుకోగలిగింది. టీవీ చూస్తూ చెల్లెలితో పై చదువుల గురించి చర్చించుకుంటున్న సంతోష సమయంలో ఈ ప్రమాదం జరగడం ఆ కుటుంబాన్ని కలిచివేస్తోంది. ఇద్దరు ఆడపిల్లలూ చదువుకుంటూనే తల్లికి చేదోడు వాదోడుగా ఉండేవారు. రెక్కాడితేగాని డొక్కాడని ఆ తల్లిదండ్రులు ఆస్పత్రిలో ఉన్న తమ పెద్దకుమార్తెను చూసి దిక్కుతోచని స్థితిలో కన్నీటి పర్యంతమవుతున్నారు.

మనసున్న మారాజులు తమవంతు ఆర్థిక సహాయం చేస్తున్నారు. మరికొందరు విరాళాలు సేకరించి ఇస్తున్నారు. ప్రమాదంలో సూర్యకళ నడుము కింది భాగం బాగా దెబ్బతినడంతో వైద్యం నిమిత్తం రూ.10 లక్షలుపైనే వ్యయమవుతుందని తెలుస్తోంది. దెబ్బతిన్న భాగంలో తొలి ఆపరేషన్‌కు వైద్యులు ఎంతో శ్రమించారు. మానవతా దృక్పథంతో వైద్యులు ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకుని పూర్తి స్థాయిలో సూర్యకళకు నయం చేసేందుకు శ్రద్ధ చూపుతున్నారు. వైద్యానికి పెద్ద మొత్తం అవసరం కావడంతో ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందితే ఆ నిరుపేద కుటుంబానికి కొంత ఊరడింపు కలుగుతుంది.

సహాయం చేయాలనుకునే వారి కోసం...
బాధితురాలి తల్లి చిట్టినీడి నాగలక్ష్మి బ్యాంకు అకౌంట్‌ నంబర్‌
004610100038569
ఆంధ్రా బ్యాంకు
ఐఎఫ్‌ఎస్‌ కోడ్‌: ANDB0000046

బాధితురాలి బాబాయ్‌ జనార్దన్‌ ఫోన్‌ నంబర్లు
9177733995
7799024033

మరిన్ని వార్తలు