రేపటి నుంచి డిగ్రీ పరీక్షలు

3 Mar, 2015 02:43 IST|Sakshi

ఎచ్చెర్ల:డిగ్రీ పరీక్షల నిర్వహణకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. బుధవారం నుంచి జరగనున్న పరీక్షల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ పరిధిలో ఉన్న 93 ఎఫిలియేటెడ్ కళాశాలల నుంచి రెగ్యులర్, సప్లిమెంటరీతో కలిపి 50,440 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. పరీక్షల నిర్వహణపై వీసీ హనుమంతు లజపతిరాయ్ రెక్టార్ మిర్యాల చంద్రయ్య, రిజస్ట్రార్ వడ్డాది కృష్ణమోహన్, పరీక్షల నిర్వహణాధికారి పెద్దకోట చిరంజీవులతో సోమవారం సమావేశమయ్యారు. గత ఏడాది తలెత్తిన సమస్యలు, ఈసారి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే అంశంపై చర్చించారు. 43 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు వీసీ చెప్పారు. అన్ని కేంద్రాల్లో ప్రత్యేక అబ్జర్వర్లు, స్క్వాడ్‌ను నియమిస్తామన్నారు. పరిశీలకుల సమక్షంలో గంట ముందు ప్రశ్న పత్రాల కట్టలు తెరవనున్నట్టు పేర్కొన్నారు.
 
 ప్రత్యేక సీల్ చేసిన ప్రశ్న పత్రాలను స్ట్రాంగ్ రూంల్లో భద్ర పరిచామని, నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ప్రశ్నపత్రాలు ముందుగా తెరిచినట్టు తెలిస్తే ఆ కళాశాల అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో ఆరోపణలు ఉన్న కళాశాలలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. తృతీయ ఏడాది పరీక్షలు ఈ నెల నాలుగు నుంచి 17వ తేదీ వరకు మధ్యాహ్నం రెండు నుంచి ఐదు గంటల వరకు జరుగుతాయని వివరించారు. అలాగే మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఈ నెల 19 నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు జరుగుతాయని వివరించారు. ప్రథమ సంవత్సరం పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, ద్వితీయ ఏడాది పరీక్షలు మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. పరీక్షలు జరుగుతున్న తీరును వర్సిటీ అధికారులు కూడా ఆకస్మికంగా పరిశీలిస్తారన్నారు. డిగ్రీ మూడేళ్లకు సంబంధించి సుమారు మూడు వేల మంది విద్యార్థులు రీవ్యాల్యూయేషన్‌కు దరాఖాస్తులు చేసుకున్నారని, వీరికి వారం రోజుల్లో మార్కుల జాబితాలు అందజేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు