నీటి పథకంపై నాన్చుడు

7 Jan, 2015 03:43 IST|Sakshi
నీటి పథకంపై నాన్చుడు

కిరణ్ హయూంలో రూ.7,390 కోట్లతో కండలేరు పథకం మంజూరు
తొలి దశలో రూ.4,300 కోట్లతో 12 ప్యాకేజీలకు టెండర్లు
పథకం పనులను అభయాన్స్‌లో పెట్టిన చంద్రబాబు    
రూ.ఎనిమిది వేల కోట్లతో వాటర్‌గ్రిడ్ ఏర్పాటుకు ప్రణాళిక
ఇంతవరకూ ఏదీ తేల్చని ప్రభుత్వం

 
 తిరుపతి: జిల్లా ప్రజల దాహార్తి శాశ్వతంగా తీర్చే ప్రాజెక్టుపై స్పష్టత లేకపోవడంతో అధికార వర్గాల్లో అయోమయం నెలకొంది. వాటర్ గ్రిడ్ పనులను చేపడుతున్నట్లుగానీ .. కండలేరు పథకాన్ని రద్దు చేసినట్లుగానీ ఇప్పటిదాకా ప్రభుత్వం ప్రకటించకపోవడంతో గందరగోళం నెలకొంది. జిల్లాలో 1,380 పంచాయతీల పరిధిలో 11,580 గ్రామాలు, రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, ఆరు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఒక్క తిరుపతి నగరం మినహా తక్కిన ప్రాంతాలకు భూగర్భ జలాలపై ఆధారపడే తాగునీటి పథకాలను చేపట్టారు. వర్షాభావ ప్రాంతమైన జిల్లాలో భూగర్భ జలమట్టం 21.35 మీటర్లకు పడిపోయింది. భూగర్భ జలాలు అందుబాటులో లేకపోవడంతో  ఏడాది పొడవునా 1,713 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు.

రూ.7.390 కోట్లతో కండలేరు పథకం..

నెల్లూరు జిల్లా కండలేరు రిజర్వాయర్ నుంచి 6.61 టీఎంసీల నీటిని ఎత్తిపోసి జిల్లాలో 45 మండలాల్లోని 8,468 గ్రామాలకు తాగునీటిని అందించే పథకానికి అప్పటి సీఎం కిరణ్ రూపకల్పన చేశారు. పథకం నిర్మాణ బాధ్యతలను ఇన్‌ఫ్రాస్టక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఐఎన్‌సీఏపీ)కి అప్పగించారు. రూ.7,390 కోట్ల అంచనా వ్యయంతో 576 కిలోమీటర్ల పొడవున పైపు లైన్లు నిర్మించి, 32 క్లస్టర్ రిజర్వాయర్లను ఏర్పాటు చేసి 8,468 గ్రామాలకు నీళ్లందించేలా అంచనాలను రూపొందించారు.  కండలేరు నీటి ప్రాజెక్టు చేపట్టేందుకు జనవరి 4, 2014న టెండర్లు పిలిచింది. తొలి దశ కింద కండలేరు రిజర్వాయర్ నుంచి చిత్తూరులోని కలవకుంట రిజర్వాయర్ వరకూ 164 కిలోమీటర్ల పైపు లైను నిర్మించి 4,500 గ్రామాలకు నీళ్లందించేందుకు రూ.4,300 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు. ఎనిమిది నుంచి 12 శాతం అధిక ధరలకు కోట్ చేసిన అస్మదీయ కాంట్రాక్టర్లకు టెండర్లను ఖరారు చేసి మొబిలైజేషన్ అడ్వాన్సు రూపంలో రూ.40 కోట్లను కట్టబెట్టింది. కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూలును ప్రకటించడంతో పనులును ప్రారంభించలేకపోయారు.

కథ మళ్లీ మొదటికి..

సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలుపొందడంతో చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసి దాహార్తి తీర్చుతామని ప్రకటించారు. కండలేరు నీటి ప్రాజెక్టును అభయాన్స్‌లో పెడుతున్నట్లు జూన్ 24న ప్రకటించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పశ్చిమ మండలాలకు హంద్రీ-నీవా, వెలిగల్లు రిజర్వాయర్ తూర్పు మండలాలకు గాలేరు-నగరి, తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా నీటిని తరలించి వాటర్ గ్రిడ్‌ను ఏర్పాటు చేసేలా అధికారులు నివేదిక రూపొందించారు. వాటర్ గ్రిడ్ ఏర్పాటుకు రూ.ఎనిమిది వేల కోట్ల అవసరం అవుతాయని అంచనా వేశారు. సుమారు 6.5 టీఎంసీల నీటిని వాటర్ గ్రిడ్‌కు కేటాయించాలని సూచించారు. వాటర్ గ్రిడ్‌పై పలుమార్లు సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు.. పనులను ఎప్పుడు చేపడతామన్నది ప్రకటించలేదు. కండలేరు నీటి ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్లు కూడా ఉత్తర్వులు జారీ చేయలేదు. ఏ పథకం ప్రభుత్వం చేపడుతుందో తెలియక ఇటు అధికారులు .. అటు ప్రజలు గందరగోళంలో పడ్డారు.

మరిన్ని వార్తలు